ఉండమ్మా బొట్టుపెడతా (28-09-1968)

0
753

అలనాటి చిత్రాలు

ఉండమ్మా బొట్టుపెడతా (28-09-1968)

సరిగ్గా 50 సంవత్సరాలక్రితం 1968 లో విడుదలైన 55 తెలుగు చిత్రాలు గమనిస్తే ఎన్ టి ఆర్ 11 చిత్రాలలో, కృష్ణ 10 సినిమాలలో, అక్కినేని 5 చిత్రాలలో, కాంతారావు 12 చిత్రాలలో, ఇతరులు 27 చిత్రాలలో నటించారు. జయలలిత 5 తెలుగు చిత్రాలలో (15 తమిళం 1 హిందీ), కాంచన 9 చిత్రాలలో, జమున 9 చిత్రాలలో నటించారు. సి ఎస్ రావు 7 చిత్రాలకు దర్శకత్వం వహించారు. జి వర లక్ష్మి, సావిత్రి దర్శకురాళ్ళుగా మారారు.

ఎన్ టి ఆర్ నటించిన రాము (04-05-1968) ఆ ఏటి సూపర్ హిట్ సినిమాగా రజతోత్సవం, 15 కేంద్రాలలో శతదినోత్సవాలు జరుపుకుంది. ఎన్ టి ఆర్ నటించిన తల్లి ప్రేమ (09-03-1968), నిండు సంసారం (05-12-1968), నిలువు దోపిడి చిత్రాలు (25-01-1968), అక్కినేని నటించిన మంచి కుటుంబం కూడా శతదినోత్సవాలు జరుపుకున్నాయి.

ఇవి కాక ఎన్ టి ఆర్ నటించిన ఉమా చండీ గౌరీ శంకరుల కధ, కలిసొచ్చిన అదృష్టం, తిక్క శంకరయ్య, నిన్నే పెళ్ళడతా, నేనే మొనగాణ్ని, బాగ్దాద్ గజ దొంగ, భాగ్య చక్రం ,

అక్కినేని నటించిన గోవుల గోపన్న, బంగారు గాజులు, బ్రహ్మచారి, సుడి గుండాలు,

కృష్ణ నటించిన అసాధ్యుడు, నిలువుదోపిడి, మంచి కుటుంబం, సర్కార్ ఎక్స్ప్రెస్, అమాయకుడు, అత్తగారు కొత్త కోడలు, నేనంటే నేనే, ఉండమ్మా బొట్టు పెడతా, చెల్లెలికోసం, వింత కాపురం

ఇతరులు నటించిన అగ్గి మీద గుగ్గిలం, అగ్గి రవ్వ, ఎవరు మొనగాడు, కలసిన మనసులు, కుంకుమ భరిణ, గ్రామ దేవతలు, చల్లని నీడ, చిన్నారి పాపలు, చుట్టరికాలు, జీవిత బంధం, దేవ కన్య, నడ మంత్రపు సిరి, పంతాలు పట్టింపులు, పాప కోసం , పాల మనసులు, పెళ్ళి రోజు, పేదరాసి పెద్దమ్మ కధ, బంగారు చిలక, బంగారు సంకెళ్ళు, బాంధవ్యాలు, భలే కోడళ్ళు, భలే మొనగాడు, భార్య, మన సంసారం, మూగ జీవులు, రణ భేరి, రాజ యోగం, లక్ష్మీ నివాసం, వీరాంజనేయ, సతీ అరుంధతి, సుఖ దుఖాలు విడుదలయ్యాయి.

28-09-1968 న విడుదలైన ఉండమ్మా బొట్తు పెడతా చిత్ర విశేషాలు:-

మాటలు: ఎన్ఆర్ నంది
పాటలు: దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు.
కూర్పు: కోటగిరి గోపాలరావు
కళ: తోట
నృత్యం: కెఎన్ రెడ్డి
డీవోపీ: కెఎస్ రా
సంగీతం: కెవి మహదేవన్
నిర్మాత: సి సుందరం
దర్శకత్వం: కె విశ్వనాథ్
సమర్పణ : ఆదుర్తి సుబ్బారావు;
కథ: దత్తాకులకర్ణి;
ఛాయాగ్రహణం: కే.ఎస్.రామ కృష్ణ రావు;
తారాగణం: కృష్ణ, జమున, ధూళిపాళ, చలం, నాగభూషణం, జానకి, నాగయ్య మొదలైనవారు.

ఇద్దరు టెక్నీషియన్లతో కలిసి ‘యూనిట్ పిక్చర్స్’ ప్రారంభించారు నిర్మాత సి సుందరం. తరువాత ‘శరవణభవ పిక్చర్స్’తో కలిసి నాలుగు తమిళ చిత్రాలు నిర్మించారు. వాటిలో నాల్గవ తమిళ చిత్రమే -ఎల్లాం పునకాగ. దీనికి ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు. అలా ఆదుర్తితో ఏర్పడిన స్నేహం, సహృదయతలతో ఆయన దర్శకత్వంలో తెలుగులో చిత్రాలు నిర్మించాలన్న ఆలోచనకు వచ్చారు నిర్మాత సి సుందరం. అందుకు ‘బాబూ మూవీస్’ సంస్థను నెలకొల్పారు. మంచి మనసులు, మూగమనసులు, తేనె మనసులు బాబూ మూవీస్ బేనర్పై రూపొందినవే.

1968లో బాబూ మూవీస్ సంస్థ, ఆదుర్తి సుబ్బారావు సమర్పణలో మరో చిత్రాన్ని తీసుకొచ్చింది. ఆదుర్తి వద్ద పలు చిత్రాలకు సహాయకుడిగా పనిచేసి పేరు తెచ్చుకున్న కె విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రమే ఉండమ్మా బొట్టుపెడతా. ఈ చిత్రానికి మూలం 1967లోని మరాఠి చిత్రం థంబ్ లక్ష్మి కుంకు లావతే. మరాఠీ చిత్రానికి కథ పండిట్ మహాదేవ్ శాస్త్రి జోషి, దర్శకుడు దత్త్ధర్మాధికారి. ఇక తెలుగు చిత్రానికి సినిమా అనుసరణ ఆదుర్తి సుబ్బారావు.

ఆ ఊళ్లోని మోతుబరి ఆసామి దశరథ రామయ్య (నాగయ్య). ఆయనకు నలుగురు కుమారులు. పెద్దవాడు శ్రీనివాస్ (నాగభూషణం). పేకాట వ్యసనపరుడు. అతని భార్య తులసి (షావుకారు జానకి). ఇంటి శుభ్రత, పనిపాటల కంటే పూజలకు ఎక్కువ సమయం కేటాయిస్తుంది. వారి కుమార్తె పద్మ (ప్రసన్నరాణి).

రెండో కొడుకు వెంకటేశం (అర్జా జనార్ధనరావు). తాగుబోతు, తిరుగుబోతు. మేనమామ సాక్షి రంగారావు కూతురు శేషు (సూర్యకళ)ను పెళ్లి చేసుకుంటాడు. రోజూ భార్యతో గొడవ పడుతుంటాడు. వారికి ఇద్దరు సంతానం.

మూడోవాడు చలం (రంగ), అతని భార్య సుమతి (మీనాకుమారి). ఎక్కువ చదివానన్న అహంతో భర్తను అవహేళన చేస్తుంటుంది.

నాల్గవ కొడుకు కృష్ణ (కృష్ణ). మంచితనం, సత్ప్రవర్తన కలిగిన కుర్రాడు. తండ్రికి చేదోడువాదోడుగా ఉంటుంటాడు.

ఆ ఊరి హరిదాసు (ఢూళిపాళ) కుమార్తె లక్ష్మి (జమున). కూతురి పెళ్లికోసం వడ్డీ వ్యాపారి, హోటలు నడిపే పాపాయమ్మ (సూర్యాకాంతం) వద్ద డబ్బు కూడబెడుతుంటాడు దాసు.

లక్ష్మిని వౌనంగా ఆరాధిస్తుంటాడు కృష్ణ. ఆమె కూడా అతని పట్ల వౌనంగా ఆరాధన ప్రదర్శిస్తుంటుంది. ఈ సమయంలో లక్ష్మికి పెళ్లి కుదురుతుంది. అయితే, దాసు దాచుకున్న డబ్బులు లేవని పాపాయమ్మ అబద్ధమాడటంతో లక్ష్మి పెళ్లి ఆగిపోతుంది. దశరథ రామయ్య పెద్ద మనసుతో అదే ముహూర్తానికి లక్ష్మి, కృష్ణకు పెళ్లి జరిపిస్తాడు. పేదింటినుంచి వచ్చిన లక్ష్మికి, అత్తవారింట తోడికోడళ్ల నుంచి అవమానాలు ఎదుర్కొంటుంది. వాటిని నిబ్బరంతో భరిస్తూనే, భర్తకు తోడుగా నిలుస్తుంది. పొలంలో బావి తవ్వించి భూమిని సస్యశ్యామలం చేస్తుంది. పురిటికి పుట్టింటికెళ్లి ఆడపిల్లను ప్రసవిస్తుంది.
బిడ్డతో వచ్చిన ఆమెకు అత్తింట ఎన్నో ఇక్కట్లు ఎదురవుతాయి. బావగార్లను పోలీసులు అరెస్టు చేయటం, ఇంట్లో అనాచారాలు ఎదురవ్వడం లాంటివి.

ఆ ఇంటి సిరి లక్ష్మీదేవి (తెలుగు వారి సీతమ్మ అంజలీ దేవి ) ఇల్లొదిలి వెళ్లిపోతానంటుంది. బొట్టు పెట్టించుకుని వెళ్లమని లక్ష్మీదేవిని కోరి, బిడ్డను ఊయలలో ఉంచి, తాను బావిలోకి దూకి తనువు చాలిస్తుంది లక్ష్మి. ఆమె వచ్చి బొట్టు పెట్టేవరకూ ఉండాలి కనుక లక్ష్మీదేవి ఆ ఇంట్లోనే ఉండిపోవడం, తోడికోడలు ఆత్మత్యాగంతో తులసీ తదితరుల్లో మార్పురావడం, అన్నదమ్ములు ఐకమత్యంతో భూమిని పండించి జాతీయస్థాయిలో కృషి పండిట్ అవార్డు తండ్రి దశరథ రామయ్యకు వచ్చేలా చేయటం, అవార్డు బహూకరణ సందర్భంలో తమ గత జీవితం గూర్చి మంత్రికి వివరించిన దశరాథ రామయ్య, అవార్డును తన మనుమరాలు, లక్ష్మి కుమార్తె చిన్నలక్ష్మికి అందింపచేయటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.

చిత్రంలో ఇంకా మాడా వెంకటేశ్వరరావు, రాజ్బాబు, ప్రభావతి, మద్దాలి తదితరులు నటించారు.

చిన్న చిన్న సన్నివేశాల ద్వారా చిత్రాన్ని అర్ధవంతంగా, ఆకట్టుకునేలా రూపొందించారు దర్శకుడు విశ్వనాథ్. చిత్ర ప్రారంభంలోనే లక్ష్మి (జమున) సమాధి మీదనుంచి కృష్ణను బృంద గీతంలో చూపించటంతో, ఆమె జీవించి లేదన్న విషయాన్ని ఆలోచనాత్మకంగా చెప్పగలిగారు. మంత్రికి నాగయ్య కథను వివరిస్తున్నపుడు, ఫ్లాష్బ్యాక్ నుంచి చిత్ర కథ మొదలవుతుంది. అన్నదమ్ముల స్వభావాలు, పాత్రల పరిచయం తరువాత.. లక్ష్మి, కృష్ణల మూగ ఆరాధన, వారి మనసులు పైకి మాట్లాడుకోవడం లాంటి సన్నివేశాలను హృద్యంగా చిత్రీకరించారు.

లక్ష్మి పాటను బహిరంగంగా నాగయ్య, మనసులో కృష్ణ మెచ్చుకోవటం.. లక్ష్మికి పెళ్లి నిశ్చయమైందన్న కబురు తెలిసి కృష్ణలో రియాక్షన్.. లాంటి సన్నివేశాలు హత్తుకుంటాయి. లక్ష్మీ-కృష్ణల పెళ్లి జరిగి ఇంటికొచ్చినపుడు, తోడి కోడళ్ళు ఎవరూ హారతి ఇవ్వకపోవడం, తరువాత రెండో కోడలు, చిన్నపాప గదిలో పిన్ని- బాబాయికి హారతినివ్వటం లాంటి సన్నివేశాలతో ఆ కుటుంబాన్ని చక్కగా పరిచయం చేయగలిగారు దర్శకుడు.

ముగ్గులు పెట్టిన లోగిలి వదిలి పెదబావ పేకాటకు మరోచోటికి వెళ్లటం, పురిటికి వెళ్తున్న లక్ష్మికి చిన్నపాప బొట్టుపెట్టి ‘వెళ్లేటప్పుడు బొట్టుపెట్టాలి కదా పిన్నీ’ అనిపించి సంప్రదాయం, పద్ధతులను తెలియ చెప్పే సన్నివేశాలు హత్తుకుంటాయి. చివర అదే సూత్రంతో చిత్రాన్ని ముగించటం దర్శకుడి ప్రతిభకు అద్దం పడుతుంది.

ఉండమ్మా బొట్టుపెడతా చిత్రంలోని పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేరకు సహజమైన నటనతో మెప్పించారు. రాజ్బాబు, సూర్యకాంతం అతిథి నటులుగా కనిపించినా, సూర్యకాంతం తన పాత్రకుతగిన పరిణతితో మెప్పించింది. చిన్న పాత్ర అయినా మాడా తన పాత్రకు తగ్గ న్యాయం చేశారు.

పాటల చిత్రీకరణలోనూ దర్శకుడు తన ప్రతిభను చాటుకున్నారు.

సంక్రాంతి విశేషాలు చూపుతూ హరిదాసు గానంతో చిత్రీకరించిన సజీవ నిత్య నూతన గీతం -రావమ్మా మహాలక్ష్మి రావమ్మా (గానం: ఎస్పీ బాలు, పి సుశీల బృందం). ధూళిపాళ, జమున, ఇతరులపై చిత్రీకరించిన ఈ పాట సినిమాకే ఓ ప్రత్యేకత తెచ్చిన గీతంగా నేటికీ నిలవడం విశేషం.

కృష్ణ, జమునల తొలి రేయిగీతం -చుక్కలతో చెప్పాలని. వారిరువురి ఊహలను చక్కని పూదోటలో, పావురాలు, పూవుల సందేశాలతో సున్నిత ప్రణయాన్ని చూపుతూ చిత్రీకరించారు.

ఇంటి శుభ్రత, పూజల గురించి పిల్లలకు లక్ష్మి ఇచ్చే చక్కని సందేశాత్మక పాటే -అడుగడుగున గుడి వుంది/ అందరిలో గుడి ఉంది/ ఆ గుడిలో దీపముంది/ అదియే దైవం (రచన: దేవులపల్లి; గానం: పి సుశీల).

లక్ష్మి పసిబిడ్డకు పాడిన జోలపాట -చాలులే నిదురపో జాబిలి కూనలో, తండ్రి (కృష్ణ) వస్తున్న జాడ పాప తెలుసుకుందన్న విషయాన్ని చరణంలో (అంత దాపునుండే అయ్యడుగులు తెలిసేనా) చెప్పడం గమ్మత్తుగా అనిపిస్తుంది. దేవులపల్లి సాహిత్యం, మహదేవన్ సంగీతం, అతి సహజమైన చిత్రీకరణతో పాట అలరించేలా సాగుతుంది.

చిత్రం ప్రారంభంలో నాగయ్య కుటుంబ సభ్యులతో పొలంలో చిత్రీకరించిన గీతం -శ్రీశైలం మల్లన్న శిరసొంచేనా (గానం: ఘంటసాల, పి సుశీల బృందం).

లక్ష్మి (జమున) సందెదీపం వెలిగిస్తూ పాడే గీతం -ఎందుకే సందెగాలి/ సందెగాలి తేలిమురళి (గానం: పి సుశీల). ఇంటి బయటి నుంచి పాట వింటున్న కృష్ణ, నాగయ్యలపై రియాక్షన్ చూపించటం బావుంటుంది.

జమున, కృష్ణ, బృందంతో సాగే గీతం -పాతాళ గంగమ్మ రారా (గానం: ఘంటసాల, పి సుశీల బృందం).

మహిళాలోకపు విశేష ఆదరణ పొందిన చిత్రంగా ‘ఉండమ్మా బొట్టుపెడతా’ నేటికీ నిలుస్తుంది.

‘అడుగడుగున గుడి వుంది’, ‘రావమ్మా మహాలక్ష్మి’ లాంటి సందేశాత్మక, కళాత్మక గీతాలు ఎన్నటికీ శ్రోతలను పరవశింప చేస్తూనే ఉంటాయి అనడంలో సందేహం లేదు.

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.