అలనాటి చిత్రాలు – 119
వివాహ బంధం (23-0-1964)

1964 లో 27 సినిమాలు విడుదలయ్యాయి. అక్కినేని నటించిన 6 సినిమాలు పూజా ఫలం , ఆత్మ బలం , మూగ మనసులు , మురళీ కృష్ణ , అమర శిల్పి జక్కన్న , డాక్టర్ చక్రవర్తి , ఎన్ టి ఆర్ నటించిన 15 సినిమాలు రాముడు భీముడు , అగ్గి పిడుగు , దాగుడు మూతలు, బబ్రువాహన, మంచి మనిషి , గుడి గంటలు, మర్మ యోగి, కలవారి కోడలు, దేశ ద్రోహులు, సత్యనారాయణ మహాత్మ్యం, శభాష్ సూరి, వివాహ బంధం, మంచి మనిషి, వారసత్వం, బొబ్బిలి యుద్ధం, ఇతరులు నటించిన 6 సినిమాలు బంగారు తిమ్మరాజు, నవ గ్రహ పూజా మహిమ, మైరావణ, పీటల మీద పెళ్ళి, తోటలో కోటలో రాణి, భక్త రామ దాసు విడుదలయ్యాయి.

23-10-1964 న విడుదలైన వివాహ బంధం చిత్ర విశేషాలు:-
సుమారు 54 సంవత్సరాల క్రితం విడుదలైన భరణీ వారి వివాహ బంధం అప్పటికీ ఇప్పటికీ సమాజానికీ దర్పణం గా నిత్య నూతనమైన చిత్రం. స్త్రీ పురుషులు, వివాహమైనవారు, చేసుకోబోయేవారు తప్పక చూడవలసిన సినిమా. దురదృష్టవశాత్తూ ఈ సినిమా పై చాలామందీ , ఎన్ టి ఆర్ అభిమానులతో సహా ఒక అపోహ ఉంది – భానుమతి డామినేట్ చేశారనీ, ఎన్ టి ఆర్ చొక్కా పట్టుకు చింపే ఒక సన్నివేశం ఉదాహరణగా చూపుతూ. నిజానికి వివాహ బంధం సినిమా చాలా సహజం గా తీసారు. నాకు ఇష్టమైన సినిమాలలో ఇది ఒకటి. ఈ సినిమాను మరొక 10 సంవత్సరాల తర్వాత హిందీ లో జయ బాధురితో కోరా కాగజ్ పేరుతో నిర్మించారు. ఆ సినిమా కూడా బాగుంటుంది. కానీ పూర్తి మార్కులు తెలుగులోని వివాహ బంధానికే. ఈ సినిమా టీ వీలో ఎప్పుడు వచ్చినా నేను మిస్ కాకుండా చూడడానికి ప్రయత్నిస్తాను.

భరణీ పిక్చర్స్ వారి “వివాహ బంధం”
కధ: అషుతోష్ ముఖర్జీ రచించిన సాత్ పాకే బాంధా (బెంగాలీ)
రచన: ఎ పిచ్చేశ్వర రావు
పాటలు: సి నారాయణ రెడ్డి
సంగీతం: ఎం బి శ్రీనివాస్
సంగీత పర్యవేక్షణ: పి భానుమతి
గాయనీ గాయకులు: పి బి శ్రీనివాస్, పి భానుమతి.
నిర్మాత, దర్శకుడు : పి రామ కృష్ణ

ఆమె పురాతన గృహిణి కావచ్చు. ఆధునిక గృహిణి కావచ్చు. విద్యావతీ, భాగ్యవతీ కావచ్చు. కాకపోవచ్చు. ఉద్యోగినిగా ఉండవచ్చు. ఉండకపోవచ్చు. నాటికీ నేటికీ ఆమె అలంకరణలు, అలవాటులు పరిస్థితుల ప్రాభల్యం వలన కొద్దిగా మారి ఉండనూ వచ్చు. కానీ ఆమె అంతరంగం మాత్రం మారనూ లేదు. భర్త పట్ల భారతీయ గృహిణూలకు వినయ, గౌరవ సహనములుండి తీరతాయి. అవి ఆమెకమూల్యాభరణాలు. ఆమె సహనౌదార్యాములవల్లనర్ గృహం స్వర్గసీమగా భాసిల్లగలదు.

వివాహాన్ని బంధమని అభివర్ణించడం భారతీయేతరులకు అర్ధం కాకపోవచ్చు. నియమబద్ధమైన జీవన రంగానికి స్త్రీ పురుషులకు అవసరమైన హృదయానుబంధమది అని భారతీయులు దాని ఆంతర్యమెరుగుదురు. పవిత్రమైన మమతానుబంధమది యని వారు గుర్తింతురు. ఏ రంగంలో ఎన్ని మార్పులు జరిగినా అంతరంగంలో వివాహ బంధం గురించిన ఈ భావనా సౌరభం వారి హృదయ పద్మ సీమలనుండి తొలగిపోలేదు. చెరగిపోలేదు.

కొందరు భావించినట్లు కుక్కిన పేనులా ఉండటం భారతీయ గృహిణి లక్షణం కాదు. ఈ చిత్రంలోని గృహిణి భారతి కోరినట్లు భర్తనుండి ఆమె కోరేది కేవలం జాలి కాదు, ఆమె ఆత్మ గౌరవాన్ని కోరుతుంది.

తప్పులు భర్త చేయ వచ్చు. భార్య చేయ వచ్చు. వాటిని ఉబయులు సర్దుకు పోవడం వల్ల ఒకరినొకరు అర్ధం చేసుకుని నిజం గ్రహించడం వల్ల కలతలు తొలగిపోతాయి.

ఈ పూర్వరంగమంతా దృష్టిలో ఉంచుకుని నేటి ఆధునిక యువతీ యువకులు వివాహ బంధం అనతరం ఏర్పడే కలతలను ఎదుర్కొంటూ వివాహ విచ్చిత్తి తప్పదా అనే స్థితివరకూ వచ్చికూడా పశ్చాత్తాపంతో తుదకు మమతాపాశ బద్ధులై వివాహబంధం ఎలా కొనసాగించుతారో శ్రీ అశుతోశ్ ముఖర్జీ అద్భుతంగా వివరించారు.

సాత్ పాకే బాందా (ఏడడుగుల బంధం) పేర బెంగాలీలో నిర్మించిన ఈ చిత్రానికి మాస్కో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో బహుమతి లభించింది.

దానిని భరణీ సంస్థ వారు తెలుగులో తీశారు. ఉదాత్తమైన ఉత్తమ సాంఘిక చిత్రాలు నిర్మించడానికి కొత్తపుంతలు తొక్కారు. నవయుగా వారు వివాహ బంధం విడుదల చేశారు. ఎన్ టి ఆర్ చిత్రాలు నవయుగా లో ఆత్మ బంధువు, నర్తనశాల సినిమాల తర్వాత విడుదల అవ్వడం ఒక విశేషం.

కధా సంగ్రహం: భారతి (భానుమతి) బి ఏ విధ్యార్ధిని. సంస్కారవంతమైన కుటుంబంలో పుట్టిన ఆమెకు మంచి గుణాలు అబ్బినవి. ఆమె అభిమానవతి. అట్లా అని గర్విష్టి కాదు.

ఆ వూరిలోనే లెక్చరర్ గా ఉంటున్న చంద్ర శేఖర రావు (ఎన్ టి ఆర్) గుణవంతుడు. సంస్కారి. విధ్యాధికుడు. కానీ అతనిలో కొంత ముక్కోపితనం, పెడసరం ఉన్నాయి.

కళాశాలకు వెళ్ళే సందర్భంగా ఈ ఇద్దరూ ఒకనాడు సిటీ బస్సులో ఒకరినొకరు చూసుకున్నారు.

భారతి తండ్రి రిటైర్డ్ అప్పారావు గారికి (నాగయ్య) చంద్రం ఒకప్పటి శిష్యుడే. భారతి మనస్స్ను గ్రహించిన అప్పారావు ఆమెకు చంద్ర శేఖరం తగిన వరుడని భావిస్తాడు. అంత ధనిక సంబంధం కాదని తల్లి మాణిక్యాంబ (సూర్యాకాంతం) అయిష్టం చూపినా చంద్ర శేఖర్, భారతిల కల్యాణం జరుగుతుంది.

కాపురం చల్లగా సాగుతున్న దశలో భారతి తల్లి వలన వారిలో అభిప్రాయ బేధాలు కలుగుతాయి. చంద్రం అత్తగారికి హోదా, అంతస్థుల గురించి పట్టుదల ఎక్కువ. అల్లుడికి టెలెఫోన్ లేదని అది తమ దర్పానికి లోటుగా తలచి తానే దానిని వేయిస్తుంది. లేనిపోని గొప్పలను అల్లునికి ఆపాదించి ఇతరులకు దర్జాగా చెబుతుంది. తీరా అవి
బెడసికొడతాయి. తాను అల్లుడు కావడం ఆమెకు చిన్నతనంగాగా ఉన్నట్లు చంద్రం అనుకుంటాడు. చంద్రం అసలే కట్టె కొట్టె తెచ్చె రకం. విద్యా వ్యాసంగం వలన పర ధ్యానం ఎక్కువ. అత్తా అల్లుళ్ళ మధ్య అపోహలు త్వరాగా పెరిగాయి. వీటిని తొలగించడానికి భారతి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

చంద్రాన్ని చిన్నప్పటినుంచి పెంచిన పిన్ని శాంతమ్మ (హేమలత) పై మాణిక్యాంబ విరుచుకుపడటం చంద్రానికి బాగా కష్టమయింది. నూతన దంపతుల మధ్య వైమనస్యం మొదలయ్యింది.

ఒక రోజున తన అన్న వివాహ వార్షికోత్సవానికి రమ్మని పుట్టింటినుంచి భారతికి ఫోన్ వస్తుంది. ఏ ఆడ పడచైనా దీనిని ఎలా కాదనగలదు. కానీ చంద్రం మాత్రం వెళ్ళలేదు. భారతి ఏది అని వెదుక్కుంటాడు చంద్రం. పిన్ని పుట్టింటికి వెళ్ళిందని చెబుతుంది. వెళ్ళిందా అని ఆశ్చర్యపోతాడు. తాను వెళ్ళ వద్దని చెప్పలాఎదే అంటాడు పిన్నితో. అప్పుడు హేమలత – వెళ్ళద్దు అనలేదు, వెళ్ళకపోతే బాగుడును అనుకున్నావు అన్న మాటలు చాలా సహజంగా చిత్రీకరించారు దర్శకులు. పిన్ని మందలింపులతో చంద్రం చల్లబడతాడు. తిరిగి వచ్చిన భారతితో సరసమాడాడు. అతని చేష్టలు భారతిలో రోషం కలిగించాయి. తన తల్లి అహంభావానికి, విజ్ణుడైన చంద్రం ఇంతగా అలగడం ముడుచుకుపోవడం ఏమంత సబబని ఆమె ఆంతర్యం. అందుకే అభిమానం అధికమయింది. ఇద్దరూ ఏదో మాటా మాటా అనుకున్నారు. పలుకులూ పడకలూ కూడా వేరయ్యాయి. ఒకరకంగా చంద్రం పెంకితనం దీనికి కారణం అని చెప్పవచ్చు.

కానీ స్త్రీ సహజమైన లాలిత్యం వల్ల, వినయం వలన భారతి చల్లబడింది. చంద్రం మాత్రం బిగిసి కూచున్నాడు. భారతి కొన్నాళ్ళు పుట్టింటికి వెడుతుంది.

ఇంతలో మాణిక్యాంబకు తనపై ఎంత దురభిప్రాయం ఉందో శాంతమ్మ స్వయంగా వినే ఘటన జరిగింది. సౌమ్యురాలైన శాంతమ్మ తన పరోక్షంలో భార్యా భర్తల సఖ్యం గా ఉంటారని ఆశించి యాత్రలకు వెడుతుంది.

విషయం తెలిసి చింతపడి వెంటనే ఇంటికి వెళ్ళిన భారతి , తన పిన్ని యాత్రలకు వెళ్ళడానికి కారణం భారతే అని అభిప్రాయం కలిగించుకున్న చంద్రం ఈ సారి తీవ్రంగా , రోషంగా మాట్లాడుకున్నారు. తనపై ఆరోపించినదానిని భరించలేక భారతి భర్త చొక్కాను పట్టుకు ఏడిచే సందర్భంలో ఆపళంగా అతని చొక్కా చిరిగింది. దానితో చంద్రం ఉగ్రుడైనాడు. తమ వివాహ బంధమే చిరిగిందంటాడు.

అన్న (ప్రభాకర రెడ్డి) ప్రోద్బలంపై విడాలుల పత్రం పై భారతి సంతకం చేస్తుంది. కానీ అంతలోనే వాటిని చించివేసింది. యాత్రనుండి తిరిగి వచ్చిన శాంతమ్మ చంద్రాన్ని మందలిస్తుంది. కానీ వెళ్ళి పిలుచుకు రావడానికి అతనికి బహుశా లజ్జ అడ్డమొచ్చింది.

భారతి ఎం ఏ చదివి చిన్న ఊళ్ళో ఉద్యోగానికి వెడుతుంది. శాంతమ్మ మృతి చెందిన వార్త విని భారతి భర్త ఇంటికి వస్తుంది. కానీ ఆ ఇంటిలో అద్దెకు చేరిన మరొక వ్యక్తి చంద్రం వికల మనస్కుడైనాడని, అందుకు తానే కారణమనీ నిందించడాన్ని భరించలేక పోతుంది. ఇంకేది తనకి దిక్కు? భరించలేని శోకంతో నదిలో దూకబోయింది భారతి.

కొద్దిసేపటిముందే తనకై భారతి వచ్చిందన్న వార్త విన్న చంద్రం ఆమె మనస్సౌందర్యానికి సిగ్గిలి, పరుగు పరుగున వచ్చి భారతిని ఆత్మహత్యాప్రయత్నమ్నుండి ఆపుతాడు. పరస్పరాందాతిరేకంతో వారిద్దరూ గాఢాలింగనాబంధంలో బంధితులైనారని చూపడంతో కధ శుభం.

ఇంత ఉదాత్తమైన ఈ చిత్రానికి శ్రీ పిచ్చేశ్వర రావు చక్కని తెలుగు సంభాషణలు అంతటి ఉదాత్తంగానూ వున్నవి. ఒక్క అధిక ప్రసంగం, ఒక్క అల్ప ప్రసంగం వెదకినా కనీంచదు. ఉదాహరణకు అలిగి బిగిసిన చంద్రానికి భారతి కాఫీ ఇస్తూ “కాఫీ త్రాగండి. మీ వలె రోజుల తరబడి వేడిగా ఉండదు” అంటుంది. దీనిలో భారతికి భర్తతో పున సత్సంబంధ వాంచ, లలితమైన వ్యంగ్యం, శృంగార భావాలను పొదిగించి వాడారు.

ఈ వ్యాసం మొదట్లో చెప్పిన హేమలత ఎన్ టి ఆర్ తో చెప్పిన మాటలు కూడా చాలా సహజంగా ఉన్నాయి.

అలాగే రోష పరవశులై భారతీ చంద్ర శేఖరులు విడిపోయినప్పటి మాటలు ప్రేక్ష హృదయాలను పోటు పొడుస్తాయి.

నాయకీ నాయకులుగా భానుమతీ ఎన్ టి ఆర్ తమ సమస్థ ప్రతిభనూ వెదజల్లారు. భర్తనుడికిస్తూ చతురభాషణలు పలికినప్పుడు భానుమతి అద్వితీయంగా నటించారు. ఎన్ టి ఆర్ ముఖ్యంగా ద్వితీయార్ధంలోనూ, రోష భావాలప్పుడూ అసమానంగా నటించారు.

ఉన్న పాటలు నాలుగు. అందులో ఒకటి త్యాగరాజ కీర్తన. ఆభేరి రాగంలో నగుమోము గనలేని నా జాలి తెలిపి..

విన్నావా మ్నసులోన దాగియున్న మధుర గీతి, సి నా రె, భానుమతి.

ఆలుమగలు విడిపోయినంత్నే అనురాగాలే మారునా, భానుమతి, సి నా రె

నీటిలోనా, నింగిలోనా , సి నా రె, పి బి శ్రీనివాస్, భానుమతి, ఎన్ టి ఆర్, భానుమతి

భారతీయ గృహిణుల మనసౌందర్యాన్ని ఇంత గొప్పగా చిత్రీకరించిన మూల కధా రచయిత శ్రీ అశుతోష్ ముఖర్జీకి జోహార్లు. అంతే గొప్పగా వెండి తెరపై చిత్రీకరించిన పి రామ కృష్ణ, భానుమతిగార్లు అభినదనీయులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.