శ్రీ కృష్ణ విజయం (11-01-1971)

0
994

అలనాటి చిత్రాలు – 114
శ్రీ కృష్ణ విజయం (11-01-1971)

(కౌముదీ పిక్చర్స్); నిర్మాత, చిత్రానువాదం: మల్లెమాల (సుందరరామిరెడ్డి/ఎంఎస్.రెడ్డి);
దర్శకుడు :కె.కామేశ్వరరావు;
సంగీతం:పెండ్యాల నాగేశ్వరరావు;
మాటలు: పింగళి నాగేంద్రరావు;
పాటలు: మల్లెమాల, పింగళి నాగేంద్రరావు , ఆత్రేయ, నారాయణరెడ్డి, దాశరథి, ఉషశ్రీ, ముదివర్తికొండమాచార్యులు; నృత్యం:వెంపటిచినసత్యం;
కళ: గోఖలే;
ఛాయాగ్రహణం:జే.సత్యనారాయణ;

తారాగణం: ఎన్ టి ఆర్, కాంతారావు, ఎస్వీఆర్, నాగయ్య, రామకృష్ణ, జమున, జయలలిత, దేవిక, సుకన్య, సంద్యారాణి, శ్రీరంజని, రాజనాల, సత్యనారాయణ, ధూళిపాళ, త్యాగరాజు, ప్రభాకరరెడ్డి, నాగభూషణం, అర్జా జనార్థన రావు, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, పద్మనాభం, రమాప్రభ, అల్లురామలింగయ్య, వంగర, రావి కొండలరావు, శివరామ కృష్ణయ్య, మద్దాలి కృష్ణమూర్తి, కేవీ.చలం; అతిథి నటీమణి : హేమమాలిని;

ప్రముఖ నిర్మాత ‘కౌముదీ ఆర్ట్ పిక్చర్స్’ ఎమ్మెస్ రెడ్డి (15-08-1924 & 11-12-2011) సినీరంగంలో ఎగ్జిబిటర్‌గా ప్రవేశించారు. గూడూరులో సుందరమహల్ అనే థియేటరు ఉండేది ఆయనకు. ఒకసారి మద్రాసు వెళ్లినపుడు ఎవరో చెపితే ”కుమరిపెణ్” అనే సినిమా చూడడానికి వెళ్లారు. దర్శకనిర్మాత టిఆర్ రామన్న రవిచంద్రన్ హీరోగా తీసిన ఆ సినిమాలో హీరోయిన్ జయలలిత ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తోందని ఆయనకి అర్థమైంది. అప్పటికి సినిమా రిలీజై పదివారాలయింది. ఎమ్మెస్ మర్నాడే రామన్న ఆఫీసుకి వెళ్లి తెలుగు డబ్బింగ్ రైట్స్ అరవై వేలకు కొన్నారు. మరో అరవై వేలు ఖర్చు పెట్టి డబ్బింగు పూర్తి చేసి, ”కన్నెపిల్ల” పేరుతో 24-11-1966 న విజయా పిక్చర్స్ ద్వారా రిలీజు చేశారు. యీ సినిమా లాభాలు తెచ్చిపెట్టింది. ఆ వూపులోనే ”కొంటెపిల్ల”, ”కాలచక్రం” అనే మరో రెండు డబ్బింగు సినిమాలు తీస్తే అవి ”కన్నెపిల్ల” లాభాలలో సగం తినేశాయి. 1968లో టిఆర్ రామన్న తమిళంలో తీసిన ”భవాని” సినిమాకు తెలుగు రీమేక్ రైట్స్ కొని కెఎస్ ప్రకాశరావుగారి దర్శకత్వంలో శోభన్ బాబు , వాణిశ్రీలతో ”భార్య” (1968) పేరుతో తీస్తే అది కొంత లాభం తెచ్చిపెట్టింది. ఆ తరవాత కామేశ్వరరావుగారు దర్శకుడిగా, శోభన్ బాబు , వాణిశ్రీలతో ”కలసిన మనసులు” (1969) సినిమా తీస్తే అది ఘోరంగా ఫ్లాపయింది.

అయినా ఎమ్మెస్ యీసారి ఎన్టీయార్‌తో భారీ సినిమా తలపెట్టారు. ఆయనా, పింగళి, కమలాకర కామేశ్వరరావు గారు పురాణాలన్నిటినీ గాలించి ”శ్రీకృష్ణవిజయం” సినిమా కథ తయారుచేశారు. దాని ప్రకారం కృష్ణుడికి అష్ట భార్యలతో బాటు వసుంధర అనే మరో భార్య ఉంటుంది. నాయకుడైన ఎన్టీయార్ కథ ఎప్రూవ్ చేశారు. కాలయవనుడు, మహోదరుడు అనే ప్రతినాయకుల పాత్రలు ఎస్వీ రంగారావు డబుల్ రోల్‌గా వేస్తే బాగుంటుంది. కానీ అప్పట్లో రామారావు, రంగారావుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేటంత వివాదం నడుస్తోంది కాబట్టి అది జరిగేపని కాదన్నారు కామేశ్వరరావు. ఏం చేయాలా అని ఆలోచించి ఎమ్మెస్ ‘ఎన్టీయార్ నాయకుడిగా, ఎస్వీయార్ ప్రతినాయకుడిగా త్వరలో ప్రారంభం కాబోతున్న భారీ పౌరాణిక చిత్రం ‘శ్రీకృష్ణవిజయం’ అని యాడ్ యిచ్చేశారు.

అది చూసి ఎన్టీయార్ పిలిపించుకుని ‘మాతో మాటమాత్రం చెప్పకుండా యిలా చేశారు?’ అన్నారు కోపంగా. ‘సార్, మాది పెద్ద పేరున్న బ్యానర్ కాదు, అలా యిస్తే ప్రేక్షకుల్లో క్రేజ్ వస్తుందని యిచ్చా..’ అన్నారు ఎమ్మెస్. దానికి ఎన్టీయార్ నిర్లిప్తంగా నవ్వి ‘ముందుచూపులో మీరు మా కన్నా ముందున్నారు. అలాగే కానీయండి’ అన్నారు. తర్వాత రంగారావు వద్దకు వెళ్లి కథ వినిపిస్తే ‘అలాగే వేస్తాను కానీ నన్ను పెట్టుకునేందుకు రామారావు ఒప్పుకోడు’ అన్నారు. ఆయన అనుమతితోనే నేను యాడ్ యిచ్చా అని యీయన చెప్తే సరేనన్నారు.

ఇక హీరోయిన్ పాత్ర దగ్గరకు వచ్చేసరికి ”వసుంధర పాత్ర కొత్తగా ఉంది. ఆ పాత్రకు జయలలిత గారైతే గొప్పగా ఉంటుంది. మీరు గట్టిగా ప్రయత్నించండి.” అని ఎన్టీయార్ సూచించడంతో ఎమ్మెస్ ఆవిడ దగ్గరకు వెళ్లారు. ఆయన ”కన్నెపిల్ల” సినిమా డాన్సింగ్ పోజులోని ఒక దృశ్యాన్ని ఒక ఆర్టిస్టు చేత పెయింటింగ్ చేయించి, ఫ్రేమ్ కట్టించి ఆఫీసులో పెట్టుకునేవారు. ఆ పటం తీసుకుని జయలలిత యింటికి వెళితే వాళ్ల అమ్మగారు మేడపైన మేకప్‌లో ఉంది కలవండి అన్నారు. ఎమ్మెస్ వెళ్లి ఆ పటం చేతికి యివ్వగానే ఆమె ఎక్కడిది అన్నట్లు యీయన వంక చూసింది. ‘నా ఫస్ట్ పిక్చర్ హీరోయిన్ మేడమ్’ అన్నారీయన. ‘ఓహో కుమరిపెణ్ డబ్బింగు చేసింది మీరేనన్నమాట. ఇది నేను ఉంచుకోవచ్చా?’ అని అడిగింది జయలలిత. మీ కోసమే తెచ్చా, అంటూ తన సినిమా కథ చెప్పసాగారు.

ఆమె సగం కథ విని ‘నా పాత్ర కొత్తగా ఉంది. తప్పకుండా చేస్తాను. షూటింగుకి టైమైంది’ అంటూ కిందకు వచ్చి తల్లితో ‘రెడ్డిగారి పిక్చర్ చేస్తున్నాను. కాల్షీట్లెలా అడ్జస్టు చేస్తావో నీ యిష్టం’ అని చెప్పి వెళ్లిపోయింది. ఇదంతా ఎమ్మెస్ రెడ్డి ఆత్మకథ ”నా కథ”లో రాశారు.

జయలలిత యన్టీఆర్ తో ‘గోపాలుడు-భూపాలుడు’లో తొలిసారి నాయికగా నటించింది. ఆ తరువాత ‘చిక్కడు-దొరకడు, గండికోట రహస్యం, కథానాయకుడు, శ్రీకృష్ణవిజయం, శ్రీకృష్ణసత్య, దేవుడు చేసిన మనుషులు” వంటి చిత్రాల్లో హీరోయిన్ గా అలరించింది… యన్టీఆర్ చిత్రాలతోనే జయలలిత తెలుగునాట ఓ వెలుగు వెలిగారు… జయలలిత తల్లి సంధ్యతోనూ హీరోగా నటించిన యన్టీఆర్, ఆమెతోనూ కథానాయకుడుగా మెప్పించడం విశేషం…

అలా అగ్రశ్రేణి తారాగణంతో భారీ వ్యయ ప్రయాసలతో శ్రీ కృష్ణ విజయం పౌరాణిక చిత్రం నిర్మాణం మొదలయ్యింది.

చిత్ర కధ: తన అన్న కాల యవనుడిని శ్రీ కృష్ణుడు సమ్హరించినందుకు అతని తమ్ముడు మహోదరుడు యాదవులపై పగబట్టాడు. శివునివలన అసాధ్యమయిన వరాలను పొంది శ్రీ కృష్ణుని హతమార్చాలని సంకల్పించుకున్నాడు.

బ్రహ్మ వసుంధర అనే సుందరిని సృష్టించి నారదునికి అప్పగించాడు. ఆమె మహోదరుని కంటబడింది. ఆమె ముగ్ధమోహన సౌందర్యాన్ని చూడగానే మహోదరుడు ఆమెను ప్రేమిస్తాడు.

లీలామానుష వేషధారి అయిన శ్రీ కృష్ణుడు నారదుని సహాయంతో వసుంధరను సాధనంగా చేసుకుని మహోదరుని సంహరించి లోకాలకు కల్యాణం చేకూరుస్తాడు.

ప్రధానమైన కధ ఇదే అయినప్పటికీ చిత్రంలో నరకాసుర వధ, పౌండ్రక వాసుదేవ స్హారం, రైవతకాద్రిపై భవానీ ఉత్సవాలు, కుచేలోపాఖ్యానం ఘట్టాలు చేర్చారు.

ఎన్ టి ఆర్ శ్రీ కృష్ణుడిగా తనకు తానే సాటి అని మరొకసారి ఈ చిత్రంలో నిరూపించుకున్నారు. మహోదరుడిగా ఎస్ వి ఆర్, వసుంధరగా జయలలిత, సత్యగా జమున, రుక్మిణిగా దేవిక , రంభగా హేమమాలిని, పౌండ్రక వాసుదేవుడిగా నాగభూషణంనటించారు. నారదుడిగా కాంతారావు ఆ పాత్రలో జీవించారు.

కాలయవనుడి కధ భాగవతంలోనిది. వసుంధరకు సంబంధించిన కధ సర్వజ్ఞ సింగ భూపాలుని రత్న పాంచాలిక (కువలయాళవలి) నాటకములోనిది. ఇది కల్పితము.

కృష్ణుడనగానే కౌరవులు, పాండవులు, భారత యుద్ధం జ్ఞాపకం వస్తాయి. కృష్ణావతారంలోఎన్నో రమణీయ ఘట్టాలున్నాయి. ప్రజా బాహుళయంలో విశేష ప్రచారం ఉన్న కధా ఘట్టాలను తీసుకుని నూతన పంధాలో చిత్రీకరిస్తే ప్రజాదరణ పొందడానికి అవకాశం ఉండేది. తెలుపు నలుపులలో , మధ్యలో పాటలు రంగుల్లో తీసిన శ్రీ కృష్ణ విజయం విజయవంతం కాలేదు. ఒక్క బెంగళూరులో మాత్రం రజతోత్సవం జరుపుకుంది.

శ్రీ కృష్ణ విజయంలో నాయకి పాత్ర వేసిన జయ లలిత ముద్దు ముచ్చటలతో ఒక విధంగా బాగానే పోషించింది. కాని బ్రహ్మ ఆమెకు జ్ఞాన అహంకారాలను ప్రసాదిస్తున్నానని ఒకచోట అంటాడు. అవేవీ ఆమెలో కానరావు. ఆ దృష్టితో చూసినపుడు ఆ పాత్రను మలచిన తీరు లోపభూయిష్టంగా కనిపిస్తుంది.

పౌండ్రక వాసుదేవుని ఉపాఖ్యానంలో కుచేలుడి కధ కలపడం, అటు వాసుదేవుని చెరసాలలో కుచేలుడు, ఇటు మహొదరుని బంధిఖానాలో వసుంధర చూపడం సందర్భ శుద్ధి లోపించినా, ప్రేక్షకులను ఆర్దృ హృదయులు చేయడానికి దర్శకుడు వాడుకున్నారు.

చిత్రంలో ప్రధానమైన లోపం సంభాషణలు ఒకే శైలిలో నడవకపోవడం. దానివలన కొన్ని సనివేశాలలో తాధాత్మ్యానికి భంగం కలుగుతుంది. అలాగే జె సత్య నారాయణ కెమెరా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమా తెలుపు నలుపులలో ఉండి, పాటలు మాత్రం రంగుల్లో తీయడం కూడా కొంత చూడడానికి ఇబ్బంది కలిగించే విషయమే.

పెండ్యాల సంగీతం బాగుంది. అదేమి విచిత్రమో 1964 తరవాత పెండ్యాల సంగీతం సమకూర్చిన చిత్రాలు ఇంచుమించుగా అన్నీ (శ్రీ కృష్ణ తులాభారం , శ్రీ కృష్ణ సత్య, దాన వీర శూర కర్ణ తప్ప) మ్యూజికల్ హిట్ అయినా చిత్రాలు పరాజయం పాలయ్యేవి.

శ్రీ కృష్ణ విజయం ఆశించిన విజయం కాకపోవడంతో పింగళి, పెండ్యాల, ఎస్ వి ఆర్, జయ లలిత లతో పౌరాణికం సరి కాదన్న విమర్శలకు జవాబుగా ఎన్ టి ఆర్ స్వీయ నిర్మాణంలో ఫార్మ్ లో లేని కె వి రెడ్డి గారిని దర్శకుడిగా శ్రీ కృష్ణ సత్య పూర్తి రంగుల్లో నిర్మించి హిట్ చేసి చూపించారు అదే సంవత్సర. ఆ తరువాత 6 సంవత్సరాలకు మహా భారత కధను నూతన రీతిలో నిర్మించిన దాన వీర శూర కర్ణ చరిత్ర సృష్టించింది.

ఈ రోజు (20-08-2018) రాత్రి 7 గంటలకు ఈ టీ వీ సినిమా (టాటా స్కై చానెల్ 1447) లో శ్రీ కృష్ణ విజయం సినిమా వస్తోంది.

పిల్లనగ్రోవి పిలుపు,

పౌండ్రకా వాసుదేవ వృతాంతం

జోహారు శిఖిపించమౌళీ

నా జీవితము నీకంకితము

అనరాదే బాలా

రమణీ, సత్యా కృష్ణుల ప్రణయం

జయతు జయతు

హాయి హాయి

జయహే నవనీళ

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.