సత్య హరిశ్చంద్ర (22-04-1965)

0
2269

అపురూప చిత్రాలు-118.

సత్య హరిశ్చంద్ర (22-04-1965)

1965 లో 30 తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. అందులో 12 సినిమాలలో ఎన్ టి ఆర్ నటించారు. ఆ ఏటి సూపర్ హిట్ సినిమా పాండవ వనవాసం, విడుదలైన 23 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుని, రజతోత్సవం జరుపుకుంది. 1965 లో ఎన్ టి ఆర్ నటించిన 8 సినిమాలు డైరెక్ట్ గా శతదినోత్సవాలు జరుపుకున్నాయి. ఇది ప్రపంచ రికార్డు. ఆ సినిమాలు నాదీ ఆడ జన్మే (13 కేంద్రాలు), పాండవ వనవాసం (23 కేంద్రాలు), మంగమ్మ శపధం (5 కేంద్రాలు), తోడు నీడ (6 కేంద్రాలు), దేవత (6 కేంద్రాలు), వీరాభిమన్యు (12 కేంద్రాలు), సి ఐ డి, ఆడ బ్రతుకు (11 కేంద్రాలు). అక్కినేని నటించిన 4 సినిమాలు , సుమంగళి, అంతస్థులు, ప్రేమించి చూడు, మనుషులు మమతలు , ఇతరులు నటించిన 14 సినిమాలు ఉయ్యాల జంపాల, చదువుకున్న భార్య, తేనె మనసులు, కీలు బొమ్మలు, చంద్రహాస, ప్రతిజ్ఞా పాలన, ఆకాశ రామన్న, వీలునామా, జ్వాలాద్వీప రహస్యం, సతీ సక్కుబాయి, ప్రచండ భైరవి, ఇల్లాలు, శ్రీ సింహాచల క్షెత్ర మిహిమ, పక్కలో బల్లెం కూడా విడుదలయ్యాయి.

22-04-1965 న విడుదలైన సత్య హరిస్చంద్ర చిత్ర విశేషాలు:-
భారతీయ భాషల్లో ‘హరిశ్చంద్ర’ నాటకానికి ఒక ప్రత్యేక స్థానముంది. మూకీ యుగంలో నాలుగు సార్లు, టాకీ యుగంలో ఇరవై సార్లు వెండితెరకెక్కిన ఒకే ఒక కథ ఇది. 1913లో చలనచిత్ర పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే ‘రాజా హరిశ్చంద్ర’ సినిమాను పూర్తిస్థాయి మూకీ చిత్రంగా మరాఠీలో నిర్మించారు. అదే కథను ‘సత్యవాది రాజా హరిశ్చంద్ర’ పేరుతో మరాఠీలోనే 1917లో లఘుచిత్రంగా నిర్మించింది కూడా ఆయనేన ఇదే మూల కథను ‘సత్యవాది రాజా హరిశ్చంద్ర’ పేరుతోనే రుస్తుంజీ ధోతీవాలా కూడా బెంగాళీ భాషలో నిరించాడు. తెలుగులో 1935లో ఒకసారి 1956లో మరొక సారి 1965లో చివరిసారి హరిశ్చంద్ర సినిమా వచ్చింది. ఇన్నిసార్లు ఇదే కథను సినిమాగా మలచడానికి కారణం అంతకు ముందే అది నాటకం రూపంలో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేయడమే. విజయా సంస్థ నిర్వహణలో ప్రముఖ దర్శకుడు కెవి రెడ్డి నిర్మాత, దర్శకుడిగా వ్యవహరించి నిర్మించిన ‘సత్య హరిశ్చంద్ర’ 22 ఏప్రిల్ 1965న విడుదలై 53 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంలో ఆ సినిమా గురించి కొన్ని విషయాలు.

22-04-1965 విజయా ప్రొడక్షన్స్ పతాకాన కె.వి.రెడ్డి దర్శకనిర్మాతగా పెండ్యాల సంగీత దర్శకత్వంలో ‘సత్య హరిశ్చంద్ర’ రూపొందింది. ఎన్.టి.రామారావు హరిశ్చంద్రునిగా, ఎస్.వరలక్ష్మి చంద్రమతిగా, ముక్కామల విశ్వామిత్రునిగా, రమణారెడ్డి నక్షత్రకుడిగా, మాస్టర్బాబు లోహితాస్యుడిగా, రేలంగి కాలకౌశికుడిగా, రాజనాల వీర బాహుడిగా, రాజశ్రీ, మీనాకుమారి మాతంగ కన్యలుగా, ఎల్.విజయలక్ష్మి మేనకగా, వాణిశ్రీ నర్తకిగా నటించారు. కథ,మాటలు, పాటలు పింగళి, ఛాయాగ్రహణం కమల్‌ఘోష్ నిర్వహించారు.

భారతీయ పురాణాల్లో, కావ్యాల్లో హరిశ్చంద్ర వృత్తాంతం కనిపిస్తుంది. పురాణ కాలంలో ప్రసిద్ధి చెందిన షట్చక్రవర్తుల్లో హరిశ్చంద్రుడు అగ్రగణ్యుడు. సత్యం కోసం సకలైశ్వర్యాలను త్యజించి, చివరకు భార్యా బిడ్డలను బానిసలుగా అమ్మి, ఛండాల దాస్యానికి సిద్ధపడిన సార్వభౌముడు. సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం, కోలాచలం శ్రీనివాసరావు, పురుషోత్తమ కవి, బలిజేపల్లి లక్ష్మీకాంతం వంటి సాహితీ మూర్తులు ఈ సత్యసందుని కథను పద్య నాటకంగా మలిస్తే రంగస్థలం మీద అత్యంత జనాదరణ పొంది మన్ననలనందుకుంది. వీటిలో బలిజేపల్లి విరచిత నాటకం మరింత ప్రాచుర్యం పొందింది. ఈ నాటకం తయారయ్యే నాటికి మూకీ సినమా అవిర్భావం కూడా జరగలేదు.

1932లో తెలుగులో తొలి టాకీ ‘భక్త ప్రహ్లాద’ నిర్మించిన మూడేళ్ళలోపే స్టార్ ఫిలిం కార్పొరేషన్ సంస్థ ఆధ్వర్యంలో ‘హరిశ్చంద్ర’ సినిమా నిర్మాణం మొదలైంది. బలిజేపల్లి నాటకమే ఈ సినిమాకు స్ఫూర్తి. ఆ రోజుల్లోనే ఈ సినిమా నిర్మాణానికి లక్ష రూపాయలు ఖర్చయింది. ఆరు నెలలు పట్టింది. ఈ సినిమాలో చంద్రమతిగా కన్నాంబ నటించగా, ఆమె సలహా మేరకే తన నాటక ట్రూపులో ఉన్న నటీనటులందరూ కూడా ఈ సినిమాలో నటించారు, నాటకాల్లో హరిశ్చంద్రుని పాత్రకు పేరొందిన డివి సుబ్బారావు, హరిప్రసాదులను కాదని అందమైన పాటగాడు అద్దంకి శ్రీరామమూర్తిని హరిశ్చంద్రుని పాత్రకు ఎంపిక చేసారు. సినిమా అఖండ విజయాన్ని సాధించింది. పేరుకు రామన్ దర్శకుడేగాని సినిమా నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలను పి. పుల్లయ్యే నెత్తిన వేసుకున్నారు.

1956లో రాజ్యం పిక్చర్స్ బ్యానర్ కింద జంపన దర్శకత్వంలో ఎస్ వి ఆర్ ‘హరిశ్చంద్రునిగా, రేలంగి నక్షత్రుడుగా గుమ్మడి విశ్వామిత్రుడుగా, లక్ష్మీ రాజ్యం చంద్రమతిగా నటించగా సుసర్ల దక్షిణామూర్తి సంగీతం సమకూర్చారు. ఈ సినిమా బాగా ఆడింది.

ఈ రెండు సినిమాల విజయాన్ని దృష్టిలో పుంచుకొని విజయా సంస్త బ్యానర్‌పై దర్శకుడు కెవి రెడ్డి ‘సత్య హరిశ్చంద్ర’ పేరుతో సినిమా నిర్మించి 22 ఏప్రిల్ 1965లో విడుదల చేశారు.

పిగళి సంభాషణలు, పాటలు సమకూర్చగా, పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం, కమల్‌ఘోష్ చాయాగ్రహణం, పసుమర్తి కృష్ణమూర్తి నృత్యదర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు.

ఎన్టీఆర్ హరిశ్చంద్రుడుగా, ముక్కామల విశ్వామిత్రుడుగా, నాగయ్య వశిస్టుడుగా, రమణా రెడ్డి నక్షత్రకుడిగా, రాజనాల వీరబహుడుగా, రేలంగి కాలకౌశికుడుగా, యస్ వరలక్ష్మి చంద్రమతిగా నటించారు.

సూర్య వంశ మహీపతి హరిశ్చంద్ర చక్రవర్తి కృతయుగంలో తన సామ్రాజ్యాన్ని భూతల స్వర్గంగా మార్చి త్రిలోకాలకు ఆదర్శప్రాయంగా వుంటాడు. ఓ సారి హరిశ్చంద్రుని సత్యసంథతపై దేవేంద్రుని సభలో ప్రస్తావన వస్తుంది. ఆ సందర్భంలో విశ్వామిత్రుడు వశిష్టమహర్షితో వివాదపడి హరిశ్చంద్రుని సత్యమార్గము నుండి తప్పిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. తర్వాత హరిశ్చంద్రుని వద్దకు వెళ్ళి అలవికాని ధనసంపదను దానంగా అడుగుతాడు. తీరా హరిశ్చంద్రుడు ఇవ్వబోయే అవసరమొచ్చినపుడు స్వీకరిస్తానని నిష్క్రమిస్తాడు. ఆపై హరిశ్చంద్రునిపై అతడి పరీక్షలు మొదలవుతాయి. తనకు దానమివ్వగోరిన ధనానికి ప్రతిగా హరిశ్చంద్రుని రాజ్యాన్ని హరిశ్చంద్రుని రాజ్యాన్ని కైవసం చేసుకొని మిగిలిన దాన శేషాన్ని రాబట్టుకునేందుకు నక్షత్రకుడికి బాధ్యత అప్పగిస్తాడు. రాజ్యబ్రష్టుడైన హరిశ్చంద్రుడు తన బాకీ చెల్లించడం కోసం భార్యను అమ్ముకుంటాడు. చివరకు తను కూడా వీరబాహుడనే కాటికాపరికి అమ్ముడుపోతాడు. విశ్వామిత్రుడు మయోపాయంతో హరిశ్చంద్రుని కుమారుడు లోహితాస్యుని పాముచేత కరిపించి శవదహనానికి భార్య చంద్రమతి ద్వారా కాటికి పంపితే, రుసుము చెల్లించలేనిదే శవదహనానికి హరిశ్చంద్రుడు అనుమతించడు. ఇలా చివరకు భార్యకు మరణశిక్షను అమలుచేసే బాద్యత కూడా హరిశ్చంద్రుని మీదనే పడే పరిస్థితులను విశ్వామిత్రుడు కల్పిస్తాడు. ఇన్ని కష్టాల్లో సైతం సత్యధర్మాన్ని విడువని విడువని హరిశ్చంద్రుని వ్యక్తిత్వానికి మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై విశ్వమిత్రుని మందలించి హరిశ్చంద్రుని రాజ్యాధిపతిని చేస్తాడు.

సినిమాలో ఎన్టీఆర్ హరిశ్చంద్రునిగా ఉదాత్తంగా నటించారు. స్త్రీని వధించడం మహాపరాధమని తెలిసి, అందునా అర్ధాంగి శిరస్సు ఖండించడం గురించి సంఘర్షనకు గురైనప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై వారించేప్పుడు ఎన్టీఆర్ నటన పరాకాష్ఠకు చేరుతుంది. చివరకు విశ్వామిత్రుడు తన తపోబలం ధారపోసి పద్నాలుగు మన్వంతరాలు ఇంద్రపదవిని యేలే వరాన్ని హరిశ్చంద్రునికి ఇవ్వడంతో కథ ముగింపు పలికినతీరు కెవి రెడ్డి మార్కు క్లైమాక్సు చిత్రీకరణకు ఒక ఉదాహరణ. కెవి షూటింగు విధానమే వేరుగా ఉంటుంది. నటీనటులకు ముందుగానే స్క్రిప్ట్ ఇచ్చి నటించమనేవారు. అది తనకు నచ్చకపోతే ఇంకో విధంగా చెయ్యమని చెప్పేవారు తప్ప ఫలానా విధంగా చేయాలని సూచించేవారు కాదు. ఏనాడూ కెవి రెడ్డి షాట్‌కు ‘ఓకే’ చెప్పలేదు. ‘పాస్’ అనేవారు ఆయన షూటింగుకు ఎవరినీ అనుమతించేవారు కూడా కాదు.

‘సత్య హరిశ్చంద్ర’ సినిమాలో అగ్రశ్రేణి తారాగణమున్నా, ప్రధమ శ్రేణి సాంకేతిక నిపుణులున్నా విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా తొమ్మిది వారాలు ఆడాక ‘బి’ సెంటర్లకు తరలించారు. తొలుత విశ్వామిత్రుని పాత్రను యస్వీ రంగారావుకు ఇవ్వజూపితే ఆయన తిరస్కరించారు. కారణం 1956లో వచ్చిన ‘హరిశ్చంద్ర’ సినిమాలో అతడు హీరో వేషం వేసివుండడమే! ఆ ప్రాతను తరువాత ముక్కామలకు ఇచ్చారు. విజయా సంస్థకు మార్కస్ బార్ట్లే ఆస్థాన సినిమాటో గ్రాఫర్ అనే విషయం అందరికీ తెలుసు. ఎందుకో గానీ ఈ సినిమాకు కమల్ ఘోష్ పనిచేసారు.

ఇక చంద్రమతి పాత్రకు ముందు సావిత్రిని అనుకున్నారు. ఆమె కూడా ఒప్పుకున్నారు, మంచి పాత్ర అని. అయితే కొందరు ఆమెతో విజయావారు అంతకుముందు గ్లామర్ పాత్రకు జగదేక వీరుని కధ లో బి సరోజను తీసుకుని, ఇప్పుడు శోక పాత్రకు సావిత్రిని అడిగేరని ఆమెతో చెప్పడంతో సావిత్రి ఒప్పుకోలేదు. భానుమతి గారు శోక పాత్రలు తాను వేయనన్నారు. అప్పుడు ఎస్ వర లక్ష్మిగారిని తీసుకున్నారు. నాటకంలోని పద్యాలు ఇవ్వడానికి లక్ష్మీ రాజ్యం గారు ఒప్పుకోనందున పింగళి గారి చేత రాయించారు.

1935లో వచ్చిన ‘హరిశ్చంద్ర’ సినిమాకు బలిజేపల్లి లక్ష్మీకాంత కవే పద్యాలు పాటలతో బాటు సంభాషణలు కూడా రాశారు. అద్దంకి శ్రీరామమూర్తి తోబాటు విశ్వామిత్రుడిగా నటించిన బండారు నాయుడు, నక్షత్రకుడుగా నటించిన పులిపాక వెంకటేశ్వర్లు నాటకాల్లో నటించిన అనుభవంతో తవ పద్యాలు పాటలు వారే పాడుకోవడంచేత ప్రేక్షక ఆదరణ లభించింది. ఈ సినిమాలో వచ్చే ‘‘నిరతిన్ కష్టములెన్ని వొచ్చినను గాని’’, ‘‘అరయన్ వంశము నిల్పనే కదా వివాహం బట్టి వైవాహిక స్పురణం బిప్పటి కెన్నడో జరిగే’’, ‘‘మాయామేయ జగంబె నిత్యమని సంభవించి మోహంబునన్ నా ఇల్లాలని’’, ‘‘ఇచ్చోటయే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులోన కరగిపోయే’’ లాంటి పద్యాలు అప్పటి ప్రేక్షకులకు కంఠోపాటం కావడంతో సినిమాను సమాదరించారు. కానీ విజయావారి సినిమాల్లో ప్రాచుర్యం పొందిన పద్యాలు లేకపోవడం ఒకలోటే.

31-05-1956 జంపన చంద్రశేఖరరావు దర్శకత్వంలో రాజ్యం పిక్చర్స్ పతాకాన లక్ష్మీరాజ్యం నిర్మించిన రెండవ చిత్రం ‘హరిశ్చంద్ర’. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రాసిన హరిశ్చంద్ర నాటకంలోని 14 పద్యాలతో పాటు గుర్రం జాషువా రాసిన పద్యాల్ని ఈ సినిమాలో ఉపయోగించారు. బలిజేపల్లి ఈ నాటకాన్ని ఉప్పు సత్యాగ్రహం సమయంలో జైల్లో ఉన్న కాలం లో రచించారు. హరిశ్చంద్రుడు తెలుగువాడేనన్నతగా తెలుగు ప్రజలు ఈ నాటకాన్ని ఆదరించారు. ఇవికాకుండా జంపన, కొసరాజు రాసిన పాటలు ఉన్నాయి. ఎస్.వి.రంగారావు హరిశ్చంద్రుడు, గుమ్మడి విశ్వామిత్రుడు, లక్ష్మీరాజ్యం చంద్రమతి, మాస్టర్ గిరి లోహితాస్యుడు పాత్రలు పోషించారు. కాలకౌశికుడిగా గౌరీపతిశాస్త్రి, వివి సుబ్బారావు వీరబాహుడుగా, రేలంగి నక్షత్రకుడిగా, రాజుసులోచన, కుచల కుమారి మాతంగ కన్యలుగా నటించారు. ఘన విజయం సాధించిన ఈ చిత్రం ఈ అందరికీ పేరుతెచ్చింది.

నిజానికి ఎన్.టి.రామారావుతో హరిశ్చంద్రుడు పాత్ర వేయించాలని లక్ష్మీరాజ్యం యత్నిస్తే ఎన్.టి.ఆర్ కాల్షీట్లు లభ్యం కాలేదు. సి.హెచ్.నారాయణరావుతో నటింపచేయాలని తలచి, ఆయనను సంప్రదించి అప్పటికే ఆయనకు హీరోగా డిమాండ్ తగ్గిందని తక్కువ పారితోషికం ఇస్తామనడంతో రీజనబుల్‌గా ఇస్తే చేస్తానని తనకున్న పేరుని, గత అనుభవాన్ని వినియోగించుకోవడానికి తక్కువ ఇస్తే అంగీకరించేది లేదని అన్నారట. దాంతో ఎస్.వి.ఆర్.ని హరిశ్చంద్రునిగా ఎంపికచేశారు. 1956 మే 31న విడుదలై ఈ చిత్రం ఘన విజయం సాధించింది. సికింద్రాబాద్ ప్యారటైజ్ థియేటర్లో ఈ చిత్రం 50 రోజుల వేడుక నిర్వహించడాన్ని ఆ రోజుల్లో విశేషంగా చెప్పేవారు.

ఎస్ వి ఆర్ సత్య హరిశ్చంద్ర లో కాటికాపరి సన్నివేశంలో హరిశ్చంద్రుడు తాను ఎలాంటి చక్రవర్తిగా ఉండి ఈనాడు కాటి కాపరి అయ్యాడో అన్నట్లు పాట ఉంటుంది. అయితే ఎన్ టి ఆర్ నటించిన సినిమాలో నేపధ్య గానం గా అటువంటి చక్రవర్తి ఈ నాడు కాటి కాపరి అయ్యాడని చక్కగా తీసారు దర్శకులు కె వి రెడ్డి గారు.

అలాగే సత్యానికి కట్టుబడితే అన్నీ కష్టాలే అన్న తప్పుడు మెసేజ్ వెళ్ళకూడదని నిర్మాతలు, మూల కధతో పాటు, రేలంగి గిరిజల హాస్యం పాలు పెంచారు. ఇది సినిమా టెంపోని కొంత దెబ్బ తీసింది.

1965 సంవత్సరం ఎన్టీఆర్‌కు స్వర్ణయుగ సంవత్సరంగా చెప్పవచ్చు. ఆ సంవత్సరంలో ఎన్టీఆర్ 12 సినిమాల్లో నటిస్తే 8 సినిమాలు శతదినోత్సవాన్ని జరుపుకున్నాయి. దొరికితే దొంగలు, విశాల హృదయాలు, ప్రమీలార్జునీయం సినిమాలతోబాటు సత్య హరిశ్చంద్ర కూడా శతదినోత్సవానికి నోచుకోలేదు. సత్య హరిశ్చంద్ర సినిమా విడుదలకు ముందు నెల, వెనుక నెలలలో విడుదలైన ఎన్ టి ఆర్ సినిమాలు మంగమ్మ శపధం, తోడూ నీడా విజయవంతమయ్యాయి.

సత్య హరిశ్చంద్ర సినిమాకుగాని, నాటకానికిగానీ పద్యాలే ఆయువుపట్టు. ముఖ్యంగా బలిజేపల్లి లక్ష్మీ కాంత కవి రచించిన వారణాసి సన్నివేశ పద్యాలు, గుర్రం జాషువా రాసిన కాటి సీను పద్యాలు పండిత పామరులను అలరింపజేసి, వారి హృదయాలను దోచుకున్నవి కావడం జగమెరిగిన సత్యం. సత్య హరిశ్చంద్ర అనగానే ఏ ప్రేక్షకుడైనా ఆశించేది ఆ పద్యాలు వినాలనే. డివి సుబ్బారావు, వై గోపాలరావు, కెవి రామారావు, పి శేఖరబాబు, అక్కలనాయుడు, బొబ్బిలి సావిత్రి వంటి స్టేజి కళాకారులు ఈ పద్యాలను ఎంతో శ్రావ్యంగా ఆలపించి పాపులర్ చేశారు. కానీ విజయావారి సత్య హరిశ్చంద్ర లో బలిజపల్లి, జాషువా రాసిన పద్యాలు మచ్చుకైనా కానరావు. వాటి స్థానంలో పింగళి రాసిన పద్యాలు పెట్టడంతో ప్రేక్షకులు నిరాశ చెందారని, చిత్ర పరాజయానికి అది ఒక కారణమని ఆ రోజుల్లో విళ్లేషకులు భావించేవారు. అయితే పెండ్యాల స్వర పరచిన పాటలు అద్భుతంగా అమరాయి.

ముఖ్యంగా ‘హే చంద్రచూడ మదనాం తక శూలపాణే.. నమో భూతనాధ−నమో దేవదేవ’ అనే యుగళగీతం నేటికి హరికథల్లో దేవాలయ భజనల్లో వినిపిస్తూనే ఉంటుంది. దర్బారి కానడరాగంలో పెండ్యాల స్వరపరచిన ఈ యుగాళగీతాన్ని ఘంటశాల, యస్ వరలక్ష్మి హృద్యంగా పాడారు.

వీరబాహు కోసం రాసిన ‘కులములో ఏముందిరా సోదరా − మతములో ఏముందిరా’’ అనే వేదాంత సారాన్ని గుర్తు చేసే ఘంటసాల పాట బాగా హిట్టయింది.

మాతంగ కన్యలు హరిశ్చంద్రుని ఏకపత్నీవ్రతాన్ని భగ్నం చేయడం కోసం నాట్యం చేస్తూ జానపద శైలిలో ఆలపించే పాట ‘నీవు మాకు చిక్కినావులే రాజా − మేము నీకు దక్కినాములే రాజా’’ను రాజశ్రీ, మీనాకుమారిల మీద చిత్రీకరించారు.

యస్ వరలక్ష్మి పాడి నటించిన ‘‘అందాల తనయా ఆనంద నిలయా − ఇనవంశ మణి నీవేరా’’ పాట తిలక్ ఆమోద రాగంలో ఇమిడిపోయి వరలక్ష్మీ స్వర పుష్టికి నిర్వచనంగా నిలిచింది.

మరొక వరలక్ష్మి పాట శ్రీ మన్మహా దివ్యతేజో విరాజీ కృపాళూ జగజ్జాల రక్షా’’ అంటూ అగ్నిదేవుని స్మరించే పాటను పెండ్యాల మాయామాళవగౌళరాగంలో స్వరపరచారు. ఇది కూడా మంచిపాటే

సావేరి− ఆనందభైరవి స్వర సమ్మేళనంలో వచ్చే ‘ఈశ్వరా జగదీశ్వరా యేమి కర్మము పట్టెరా’’ పాటను నక్షత్రకుడి కోసం ఘంటసాల ఆలపించారు.

స్వర్ణలత మధ్యమావతి రాగంలో పాడిన ‘ఆడ నీవూ యీడ నేనూ − సుసుకుంటూ కూసుంటే’ పాటను వాణిశ్రీ మీద చిత్రీకరించారు. ఇది కూడా బాగా ప్రాచుర్యం పొందింది.

మాయాబజార్ సినిమాలో ‘‘వివాహ భోజనం’’ తరహా పాట ఈ చిత్రంలో ఒకటి ఉంది. ‘‘తద్దినంపు భోజనం తలచుకుంటే చాలురా’’ అంటూ సాగే ఈ సరదా పాటను హిందూస్తానీ బిలావర్ రాగంలో స్వరపరిస్తే, నల్లా రామ్మూర్తి, బాలకృష్ణ, రామకోటి, రాజబాబులపై చిత్రీకరించారు.

విధి విపరీతము

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.