Sapindus

0
704

నమస్కారం…!
మీకోసం ఒక్క ఆరోగ్య సూత్రం…

కుంకుడు

కుంకుడు (Sapindus) ఒక రకమైన వృక్షం. ఇది సపిండేసి కుటుంబానికి చెందిన చెట్టు. దీని నుండి లభించే కుంకుడు కాయల కోసం పెంచుతారు. సపిండస్ ప్రజాతిలోని 13 జాతులలో దక్షిణ భారతదేశంలో సా.లారిఫోలియస్ మరియు సా.ఎమర్జినేటస్ లను మనం ఉపయోగిస్తున్నాము.

ఉపయోగాలు

కుంకుడు కాయల్ని దంచి వేడి నీటిలో కషాయాన్ని తయారుచేసి తలస్నానం కోసం సబ్బు క్రింద ఉపయోగిస్తారు. వీటిలోని సెపోనిన్ వలన నురుగ తయారై తలపైనున్న మలినాలు తొలగిపోయి వెండ్రుకలు శుభ్రపడతాయి. ఈ రసం సూక్ష్మక్రిమి సంహారిణిగా పనిచేస్తుంది.

తలలో కురుపులు, చుండ్రు మొదలైన చర్మ సమస్యలు ఉంటే దీనిని వాడడం ఇంకా మంచిది.

కుంకుడు గింజల నుండి లభించే నూనె కీటక సంహారిణిగా పనిచేస్తుంది.

కుంకుడు కర్ర పసుపు రంగులో చేవకలిగి కలపగాఉపయోగపడుతుంది.

పట్టు మరియు సిల్క్ చీరలను శుభ్రపరచటానికి కుంకుడు రసం ఎంతో మేలైనది.

తలనొప్పికి కుంకుడు ఆకులను మెత్తగా నూరి నూనెతో వేయించి గోరువెచ్చగా తలకు పట్టీ క్రింద వేస్తే ఎంతో ఉపశమనం కలుగుతుంది.

తల స్నానానికి

కుంకుడుకాయలను వాడాలంటే కొంత శ్రమ ఉంటుంది. ఆ కాయలను చితక్కొట్టి, వాటిలో గింజలను తీసెయ్యాలి. వాటిని వేడి నీటిలో నానపెట్టి… ఆ రసంతో తలరుద్దుకునేవారు. ఆ తర్వాత శీకాకాయపొడి మార్కెట్లో లభించడం ఆరంభమయింది. ఆ పొడిని నీటిలో తడిపి, ఆ ముద్దతో తలరుద్దుకునేవారు. అయితే, ఈ రోజుల్లో శీకాకాయపొడి కాకుండా కుంకుడుపొడి కూడా లభిస్తోంది. చాలామంది, కుంకుడుకాయలను ఈ రోజుల్లో వాడటం లేదు. నిజానికి తలంటుకి కుంకుడుకాయలను వాడటమే మంచిది. దీనివల్ల వెండ్రుకలు ఆరోగ్యంగా ఉండటమే కాక పేలు, చుండ్రులాంటి సమస్యలు రావు. వేసవిలో కుంకుడుకాయలను బాగా ఎండబెట్టి పొడిచేసుకుని నిల్వ చేయొచ్చు. దీనివల్ల తలస్నానం చేసిన ప్రతీసారీ కుంకుడుకాయలను కొట్టుకునే శ్రమ తప్పుతుంది.

ఎండబెట్టిన కమలాతొక్కలు, నిమ్మతొక్కలు, మందారాకులు, మందారపూలు, మెంతులను పొడిచేసి కుంకుడు పొడిలో కలపవచ్చు. వీటన్నిటినీ కలిపిన పొడితో తలస్నానంచేస్తే వెండ్రుకలు నల్లగా ఉంటాయి. త్వరగా నెరవవు. జుట్టు ఊడదు. బిరుసెక్కకుండా మెత్తగా ఉంటుంది. కుంకుడుకాయలతో తలస్నానం చేయడం వల్ల కేశాలు జిడ్డులేకుండా శుభ్రపడతాయి. పైగా వీటిలో ఎటువంటి రసాయనికాలు కలువవు. కనుక జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది.

కుంకుళ్ళు తలస్నానానికి కాక, చర్మ సౌందర్యానికీ, మృదుత్వానికీ, చర్మ ఆరోగ్యానికీ తోడ్పడతాయి. చర్మానికి ఏర్పడే దురదలను ఎలర్జీలను పోగొడ్తాయి. కుంకుడు రసంలో ఖరీదయిన పట్టుచీరలను నానపెట్టి ఉతికితే అవి ఎంతో మెరుస్తాయి. కుంకుడురసంలో బంగారు ఆభరణాలను నానబెట్టి, మెత్తని బ్రష్‌తో మృదువుగా రుద్దితే… అవి శుభ్రపడి ధగధగా మెరుస్తుంటాయి. బాణాలి, పెనంవంటి జిడ్డుపాత్రలను కుంకుడు పిప్పితో శుభ్రపరచవచ్చు.

కుంకుడు కాయలే శ్రేష్ఠమని తెలుసుకోవాలి. మన సాంప్రదాయపు అలవాట్లలో కూడా కుంకుడు కాయలను వాడతారు.

ప్రసవమయిన బాలింతరాలికి పదకొండో రోజు పురిటి స్నానం చేయించబోయేముందురోజు ఇరుగుపొరుగు వారికి కుంకుడుకాయలు, నూనె, సున్నిపిండి పసుపు, కుంకుమతో పాటు మిఠాయిని పంచుతారు.

పూర్వపు రోజులలో పెళ్ళికి వచ్చిన వియ్యాలవారి విడిదిలో కుంకుడుకాయలు, కొబ్బరి నూనె, పౌడరు, అద్దం ఉంచడం సాంప్రదాయం. అందువల్ల, కుంకుడు కాయలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

-రుషో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.