సగ్గుబియ్యం

0
194

సగ్గుబియ్యం..

ఇప్పుడంటే మనోళ్లు పాయసం అంటే సేమ్యాల చుట్టూ పరిగెడతన్నారు గానండీ ఒకప్పుడు పండగొత్తేనో, ఒంట్లో వేడి జేత్తేనో సగ్గుబియ్యం జావ కాసుకుని తాగీవోరండి.. పందారతో జేసిన ముత్యాల్లాగా తెల్లగా మెరిసిపోతన్నట్టు ఉండే ఈ సగ్గుబియ్యం గింజలు ఎక్కడ్నించి వత్తాయో తెల్సాండీ ఎవరికన్నా..

భూమిలో మూడు నాలుగు అంగుళాల కింద మొదలయ్యి అడుగు లోతు వరకు పెరిగే ఒక రకం కఱ్ఱపెండలం దుంపనించి తయారుజేత్తారండీ సగ్గుబియ్యం గింజల్ని.. మనం ఈ కఱపెండలం దుంపల్నించి సగ్గుబియ్యం, మైదా, గ్లూకోజ్, గంజిపౌడర్ తయారుజేస్తాం ఇంకోరకం దుంపల్ని ఉండకబెట్టుకుని తింటాం తప్పించి వంటల్లో వాడం.. మలయాళీలైతే ‘కప్పా’ అని ఓ రకం వంటకం వొండుకుని తింటారు కూడా.. మా కోలీగ్ దగ్గర జూసేను.. మనవేపు చిన్నప్పుడు బెల్లంగానుగ దగ్గర ఉడికే బెల్లంలో కఱ్ఱపెండలం దుంపల్ని ముంచి తిప్పుడు బెల్లంగానో, కర్రబెల్లంగానో తినీవొళ్ళం చిన్నప్పుడు..

అయితే తూర్పుగోదావరి జిల్లాలో అదీ మెట్టప్రాంతంలోనే మటుకు వేసే ఈ కర్రపెండలం పంటల్ని మీరు వేరే చోటెక్కడా చూసుండరు మన దగ్గర.. దాదాపు 70 వేల ఎకరాల్లో జేత్తన్నారీ పంటని ఈ ఏరియాల్లో..

అన్ని పక్కలా కాలవ పారుతూ వరి, చెరుకు లాంటి ప్రధాన పంటలేస్కునే డెల్టా పొలాలు కాకుండా సాగునీటి వసతి లేకుండా తేలికపాటి ఇసుకతో ఉండే ఎర్ర ఒండ్రు నేలల్ని గరువులు అంటాం మా సైడు.. దీన్నే మెట్ట ప్రాంతం అంటారండీ.. మా అమ్మమ్మ గారి ఊరు కట్టమూరు ఊళ్ళో కూడా జగ్గంపేటేళ్లే సైడుని జేర్చి కొంతమేర ఉన్న గరువుల్లో వేస్తారీ పంటని..

వర్షాలు పడే జూన్ జులై సీజన్లో ముందే చెక్కేసి ఉంచుకున్న మూడు-నాలుగు అంగుళాల దుంప కాండం ముక్కల్ని భూమిలో పాతితే మట్టి తగిలి ఆ ముక్కల్నించి పాలు కారడం మొదలవ్వుద్దండీ. ఆ కారిన పాలే కర్రపెండలం దుంపవ్వుద్ధి..

నా చిన్నప్పుడు వేసంగి సెలవుల్లో అమ్మమ్మగారింటికెళ్లినప్పుడల్లా వీధిలో తల్లమ్మ గారింటికి ఎదురుగా ఉండే బొల్లోరి అరుగు మీదో, అరిమిల్లోరి చావిట్లోనో కర్రపెండలం దుంపల్ని కత్తిపీఠతో చెక్కు తీస్కుంటా కనబడివోరు ఆడోళ్లు.. ఒకళ్ళు తియ్యడం మొదలెట్టగానే ఇంట్లో చాకిరీ చల్లారబెట్టుకున్న మిగతా ఆడోళ్లు కూడా కత్తిపీటల్తో ఆ అరుగుమీదకి జేరి తలో చెయ్యి యేసీవోరు.. చూడ్డానికి చాలా బొంటాయండీ అలాంటి సాయాలు..

ఎవరింట్లో పొయ్యి జూసినా ఉడుకునీళ్లు కాసుకోడం దగ్గర్నించి బియ్యం ఎసరు దాకా అన్నీ దుంపకర్రల మీదే మంటెట్టీవోరు.. గేదెలు, ఆవులు ఉన్నోళ్లు దుంపతోటలోకెళ్లి దుంపమొక్కనించి మొత్తం కొమ్మలు గాకుండా చివర్న సుతలు మాత్రం తెంపుకునొచ్చి దూడలకేసేవోళ్లు.. ఆ దుంపరొట్టని ఎంతో ఇష్టంగా తినే గేదెలు ఆ పూటకి పాలు పల్చగా ఇచ్చినాగానీ ఎక్కువిచ్చెయ్యి..

వర్షాలు పడే జూన్-జులైలో గరువులున్నవోళ్ళ ఎవరింట్లో జూసినా మాంచి హాడావుడిగా ఉండేది ఆ సీజన్ మొత్తం.. ఏం చిన్నమ్మా.. అప్పారావు చిన్నాన్న లేడా అని పలకరించబోతే ‘తిమ్మాపురం గరువులో దుంపతోట ఏత్నారమ్మా..!! పాలెకాపు ఉప్పుడే ముంతట్టుకెళ్ళేడు..’ అని సమాధానం వొచ్చేది ఆ సావిత్రి చిన్నమ్మ నించి..

ఆ రెండు నెలలు ఆగిన తర్వాతోచ్చే శ్రావణ మాసంలో ‘మీ మాయ్య దుంపతోటలో గొప్పు తవ్వింతన్నారమ్మా.. అందుకే ఒకద్దాన్నీ వొచ్చేను’ అని ఏదో భోజనాల ఫంక్షన్లో కనబడ్డ ఇంకో గుణ్ణంవోరి అన్నపూర్ణ అత్తయ్య జెప్పేది.

ఎన్నో రకాల చెదలు పట్టే తెగుళ్లు నించి, దాడి చేసే అడవి పందుల్నించి, వర్షం ఎక్కువైతే ఊటెక్కిపోద్దేమ్మో అన్న భయాల్నించి జార్తగా పంటని కాపాడుకుని ఫిబ్రవరి వొచ్చేనాటికి తీతకొచ్చేసిన దుంపల్ని భూమిలోంచి లంకెబిందెలంతా భద్రంగా తీసి అటేప్పక్కన మేడపాడు, వేట్లపాలెం మొదలెట్టి ఇటేపక్క పెద్దాపురం దాటాక సూరంపాలెం దాకా చుట్టుపక్కల్నున్న సగ్గుబియ్యం ఫ్యాక్టరీలకి ఎడ్లబళ్లమీద గాని, ట్రాక్టర్ల మీద గానీ తొలీవోళ్లు.. కాండాల్ని మటుకు మళ్లీ పంటకోసం జార్త చేసీవోళ్లు..

ఇంతా జేశాకా అక్కడ మిల్లర్ ఏ రేటు జెప్తే ఆ రేటుకే దుంప అమ్ముకోవాలి.. అలా కాదని మొండికేసే పరిస్థితి ఉండదండీ సిండికేట్లాగా జట్టు కట్టేసిన మిల్లర్ల దగ్గర.. కాదూ, కూడదంటే జొన్ననించి వొచ్చే అదొరకం వేస్టుని కలిపేసి నకిలీ సిగ్గుబియ్యం తయారుజేసేయ్యడానికి రెడీగా ఉంటారు తప్ప రైతుకిచ్చే రేటు మాత్రం పెంచరండీ మిల్లర్లు.. అందుకే ఒకప్పుడు 60 దాకా ఉన్న శాగో ఫేక్టరీలు ఇప్పుడు 15 దాకా పడిపోయినియ్యనుకోండి అది వేరే విషయం..

అలా అక్కడ జెప్పే గిట్టని రేటుకొప్పుకుని రైతు కన్నీటితో కాటాల దగ్గరికెళ్తే అక్కడ దుంపకి మట్టి అంటుకుందని, చెత్త ఉందని లాంటి మనసుని ఇంకా కష్టపెట్టే కారణాలు జెప్పి మనసు పెట్టి కష్టపడి పెంచిన పంటకి ప్రతీ క్వింటాలుకి ఓ పాతిక్కేజీలు చొప్పున తరుగు కింద తగ్గించి ఇస్తారండీ లెక్క.. ఎంత దారుణమో కదా అసలు… ఇన్ని దిగమింగుకుని సరేనని గొంతు పెగల్చుకునేలోపు పొలంలో టన్నుల్లెక్కన మాట్లాడుకున్న బేరాలు పుట్లులోకి మారిపోయేసరికి రైతు గొంతు కూడా మూగబోద్దండీ..

ఇంకో చేదు నిజం ఏంటంటే ఆ కాటా తాలూకూ ఛార్జీ కూడా రైతులేనండీ పెట్టుకోవాల్సింది.. అన్ని కత్తిరింపులు భరించిన కష్టజీవికి ఇదొకటి భారమేంటండీ.. అందుకే ఏం మాట్లాడడు..

ఆఖర్లో కనీసం ఎకరానికి పదిహేనేలైనా మిగులుద్దిలే అనుకునేటప్పటికి తను జేసిన పొలం కౌలు భూమని గుర్తొస్తాదండీ రైతుకి.. ఆ కౌలుశిస్తు తాలూకు పడమూడేలు కట్టెయ్యగా ఇక చేతిలో ఆడేది ఒక రెండువేల రూపాయలు నోటు, కళ్ళ ముందు మెదిలేది ఇంటావిడ మెళ్ళో మాయమైన పుస్తెలతాడు..

ఆ టైంలో కౌలురైతు కళ్ళల్లోంచి కన్నీరు కూడా రాదండీ.. రక్తం తప్ప..

ఆ మిల్లర్లు ఇంతన్యాయం జేస్తుంటే గవర్నమెంటోళ్లు ఏంజేత్తన్నారని మీకు డౌట్ రావొచ్చు..

దశాబ్దాల్నించీ చేస్తన్నా గానీ ఈ పంటని ఇప్పటికీ అధికారిక పంటగా గుర్తించలేదండీ వ్యవసాయ, ఉద్యానశాఖలోళ్లు.. అది మన దురదృష్టం.. అందుకే దీనికి సంబంధించిన యే రుణమాఫీ గవర్నమెంట్ నించి జరగదు, ఏ వ్యవసాయ ఆఫీసరూ వొచ్చి ఏ రకమైన అభివృద్ధి సలహాలివ్వరు.. అంతా దైవాధీనం..

మన పక్కనున్న తమిళనాడోళ్ళు, కేరళవాళ్ళు ఈ పంటని అందిపుచ్చుకుని రకరకాల ప్రయోగాలు జేసి మరీ లాభాలు గడింతా ఉంటే మనోళ్ళకి మాత్రం అసలు పట్టట్లేదు..

ప్రభుత్వాలు పట్టించుకున్నా, కోకపోయినా ఈ భూమినే నమ్ముకుని బతికీవోళ్ళు, యవసాయం మీద ఆశ చంపుకోలేనోళ్లు ఇంకా ఉన్నారండీ.. అందుకే ఏదో గుడ్డినమ్మకంతో సొంతభూములున్నోళ్లు ఇంకా యేస్తానే ఉన్నారు.. కౌలు జేసుకునోవోళ్లు మాత్రం కూలిపన్లు జేసుకుంటా మంచిరోజులెప్పుడొత్తాయా అని ఎదురుజూస్తానే ఉన్నారు..

మరి మన ఒంటికి చలవజేసే సగ్గుబియ్యం పంటకి ఆ మంచిరోజులు వొస్తాయంటారా..

#కట్టమూరుకబుర్లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.