పెండ్యాల నాగేశ్వరరావు (06-03-1917 & 31-08-1984) గారి 35 వ వర్ధంతి సందర్భంగా వారికిదే ఘన నివాళి

0
581

పెండ్యాల నాగేశ్వరరావు (06-03-1917 & 31-08-1984) గారి 35 వ వర్ధంతి సందర్భంగా వారికిదే ఘన నివాళి.

ఏ రచనలోని పదాలనైనా తన బాణీలతో పంచదార పలుకులుగా మార్చగల శక్తి పెండ్యాల నాగేశ్వరరావు గారి సొంతం. పెండ్యాల స్వరకల్పనలో రూపొందిన పాటలు ఈ నాటికీ జనాన్ని పరవశింపచేస్తూనే ఉన్నాయి. ఆయన స్వరకల్పనతోనే తమ చలనచిత్ర యానం చేసిన వారూ ఉన్నారు. తన దరికి చేరిన ప్రతీ అవకాశాన్నీ అమృతమయం చేయాలనే పెండ్యాల తపించారు. సందర్భం ఏదయితేనేం జనాన్ని ఇట్టే కట్టిపడేసేలా బాణీలు కట్టి మెప్పించారు.

నాటి మేటి నటీనటులు, దర్శకనిర్మాతలు పెండ్యాల సంగీతంతో పరవశించిపోయారు. పెండ్యాల స్వరకల్పనలో రూపొందిన ఎన్నో చిత్రాలు నిర్మాతదర్శకులకు పేరుతో పాటు గల్లాపెట్టెలు నింపాయి. ఇక మహానటుల అభినయవైభవానికీ పెండ్యాల బాణీలు తోడయి భళా అనిపించాయి. అందుకే పెండ్యాల సంగీతంలో రూపొందిన పాటలు ఈ నాటికీ పరవశింప చేస్తూనే ఉన్నాయి.

సుశీల, జానకి అనే ఇద్దరు అద్భుతమైన గాయనీమణులను తెలుగు సినిమాకు అందించారు. అంతే కాదు చక్రవాక కానడ రాగాలను మిళితం చేసి విజయానంద చంద్రిక అనే కొత్తరాగాన్ని సృజించారు. జయభేరి చిత్రం కోసం చేసిన ఈ ప్రయోగం రసిక రాజ తగువారము కామా… గా వినిపిస్తుంది. విజయానంద చంద్రిక అనే పేరు పెట్టింది మాత్రం మల్లాది వారు.

పెండ్యాల, ఘంటసాల అనగానే ఠక్కున గుర్తొచ్చే మరో అజరామర గీతం జగదేకవీరుని కథలో వినిపించే శివశంకరీ. పింగళి నాగేంద్రరావు సాహిత్యానికి పెండ్యాల అందించిన స్వరం తెలుగు సినిమా సంగీతాభిమానులను ఒక్కసారి ఆనందపరవశులను చేసింది.

బృందావన సారంగతో శుద్ధ సారంగను కలిపి వెంకటేశ్వర మహత్యం సినిమా కోసం ఓ గీతం కంపోజ్ చేశారు పెండ్యాల. ఆత్రేయ సాహిత్యం అందించిన ఈ గీతాన్ని సుశీల తో కలసి ఘంటసాల ఆలపించారు. ఎవరో అతడెవరో అంటూ సాగుతుంది సాహిత్యం.

అసావేరి ఠాట్ పద్దతికి దగ్గరగా అనిపించేలా ఉండే స్వరం అన్నపూర్ణా వారి దొంగరాముడు కోసం కూర్చారు పెండ్యాల నాగేశ్వరరావు. అనురాగము విరిసేనా అంటూ సాగే సముద్రాల వారి సాహిత్యం నటభైరవికి దగ్గరగానే సాగుతుంది.

కర్ణ తర్వాత ఎన్టీఆర్ తీసిన చాణక్య చంద్రగుప్తలో బృందావన సారంగ రాగంలో స్వరపరచిన ఓ యుగళగీతం ఉంటుంది. నారాయణరెడ్డి రాసిన చిరునవ్వుల తొలకరిలో చక్కటి మెలోడీగా విజయం సాధించింది.

పెండ్యాల నాగేశ్వరరావుగారే స్వరపరచిన అనిసెట్టి సుబ్బారావుగారి గీతం ఒకటి భట్టి విక్రమార్కలో వినిపిస్తుంది. అది కూడా నటభైరవికి దగ్గరగానే స్వరపరిచారు పెండ్యాల. నటించనా…జగాలనే జయించనా అంటూ సాగే ఈ గీతాన్ని లీల, సుశీలలు కలసి ఆలపించడం విశేషం.

సిద్దాంతం ప్రకారం మోహనలో మధ్యమ స్వరం ఎక్కడా రాకూడదు అంటారు. అయితే మహామంత్రి తిమ్మరుసు చిత్రం కోసం పెండ్యాల వారు మోహనలో ఓ పాట ట్యూను చేశారు. భావ ప్రకటన కోసం మధ్యమాన్ని విరివిగా వాడారు. పాట మాత్రం శ్రోతల్ని విపరీతంగా ఆకట్టుకుంది. మోహనరాగమహా అనిపించేలానే ఉంటుంది. పింగళి నాగేంద్రరావు సాహిత్యం అందించారీ గీతానికి.

జగదేకవీరుని కథ చిత్రం కోసం పెండ్యాల స్వరపరిచిన అయినదేమో అయినదీ పాట కూడా మోహనలో స్వరపరిచిన హిట్ డ్యూయట్టే. మనసుకు హాయిగా తాకే రాగం మోహనం. అందుకే ఆహ్లాదకరమైన సందర్భం వస్తే వెంటనే మోహనలో ట్యూను కట్టేస్తూంటారు. పెద్దగా డీవియేట్ కాకుండా పద్దతిగా స్వరపరిచిన పాట ఇది. పింగళి వారి రచన ఘంటసాల సుశీల యుగళంలో అద్భుతంగా పలుకుతుంది.

కళ్యాణి రాగంలో పెండ్యాల వారు స్వరపరచిన ఈ ఆహ్లాదకరమైన యుగళగీతం వెలుగు నీడలు లో వినిపిస్తుంది. హాయి హాయిగా జాబిల్లి తొలి రేయి … అంటూ సాగుతుంది శ్రీశ్రీ సాహిత్యం.

శాస్త్రీయ సంగీత గాయకుడుగా అప్పటికే చాలా పాపులర్ అయిన బాలమురళితో ఉయ్యాల జంపాల కోసం ఓ కెమేరా సాంగ్ పాడించారు పెండ్యాల. ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవూ … ఆరుద్ర రాశారీ గీతాన్ని.

ఇష్టం లేని వివాహం రద్దు చేసుకుని మనసిచ్చిన వాడి చెంతకి చేరుకునే ఓ యువతి కథతో తీసిన చిత్రం ఈడూ జోడూ…మళ్లీ జమున, జగ్గయ్యలే జోడీ. ఇదేమి లాహిరీ…ఇదేమి గారడీ…ఎడారిలోన పువ్వులు పూచి ఇంత సందడి…అంటూ సాగే ఆరుద్ర కవిత్వానికి పెండ్యాల అందమైన బాణీ కట్టారు. ఘంటసాల సుశీల పాడిన టాప్ హిట్ డ్యూయట్స్ లో ఇదీ ఒకటి.

ఖమాస్ రాగంలో ఓ గమ్మత్తేమిటంటే…లాలింపుకు…బతిమలాడడానికీ అనువైన రాగంగా చెప్తారు. శ్రీ కృష్ణ తులాభారం కోసం పెండ్యాల ఖమాస్ రాగంలోనే ఓ గీతాన్ని కంపోజ్ చేశారు. శ్రీ కృష్ణుడు సత్యభామాదేవిని ప్రసన్నురాలిని చేసుకోడం ఈ పాట లక్ష్యం. ఓ చెలీ కోపమా? అంతలో తాపమా అంటూ సాగుతుందీ గీతం. దాశరథి కృష్ణమాచార్యుల వారు రాశారీ గీతాన్ని.

శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కథ సినిమా కోసం పెండ్యాల వారు కూర్చిన గీతం కళావతిలోనే సాగుతుంది. బాలమురళి జానకి కలసి పాడిన యుగళం వసంతగాలికి వలపులు రేగ అంటూ సాగే పింగళివారి సాహిత్యం … ఇప్పటికీ కొత్తగానే ఉంటుంది

పెండ్యాల గారు సినీ జీవితాన్ని ప్రారంభించిన మొదట్లో తల్లిప్రేమ (1941), సతీ సుమతి (1942) చిత్రాలకు హార్మోనిస్టుగా, సహాయ సంగీతదర్శకుడిగా పనిచేశారు. ద్రోహి 1948 ఆయన సంగీత దర్శకత్వం వహించిన్ మొదటి సినిమా. అక్కడినుండి దొంగ రాముడు 1955, పెంకి పెళ్ళాం 1956, భాగ్య రేఖ 1957, జయ భేరి 1959, శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం 1960, మహా కవి కాళి దాసు 1960, భట్టి విక్రమార్క 1960, భక్త శబరి 1960, వెలుగు నీడలు 1961, వాగ్దానం 1961, బావా మరదళ్ళు 1961, జగదేక వీరుని కధ 1961, మహా మంత్రి తిమ్మరసు 1962, శ్రీ కృష్ణార్జున యుద్ధం 1962, పరువు ప్రతిష్ఠ 1962, ఈడు జోడు 1963, అనురాగం 1963, రాముడు భీముడు 1964, శభాష్ సూరి 1964, ఉయ్యాల జంపాల 1965, సత్య హరిశ్చంద్ర 1965, ప్రమీలార్జునీయం 1965, శ్రీకాకుళాంధ్ర మహా విష్ణు కధ 1966, శ్రీ కృష్ణ తులాభారం 1967, భాగ్య చక్రం 1968, ఉమా చండీ గౌరీ శంకరుల కధ 1968, పంతాలు పట్టింపులు 1968, పాపకోసం 1968, బంధిపోటు దొంగలు 1968, మా నాన్న నిర్దోషి 1970, శ్రీ కృష్ణ విజయం 1971, మనసు మాంగల్యం 1971, శ్రీ కృష్ణ సత్య 1971, ఆనందనిలయం 1971, కోడె నాగు 1974, భూమికోసం 1974, దీక్ష 1974, వేములవాడ భీమ కవి 1974, శ్రీ రాజ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ 1976, దాన వీర శూర కర్ణ 1977, చాణక్య చంద్ర గుప్త 1977, శ్రీ రామ పట్టాభిషేకం 1978, శ్రీ తిరుపతి వేంకటేశ్వర కల్యాణం 1979 సినిమాలలో చక్కని బాణీలు సమకూర్చారు.

1987 లో విడుదలైన ప్రేమ దీపాలు (శరత్ బాబు, భాను ప్రియ) పెండ్యాల సంగీత దర్శకత్వంలో వచ్చిన ఆఖరి సినిమా.

భాగ్య రేఖ, నీవుండేదా కొండపై
https://www.youtube.com/watch?v=MYlz6NIOYMw

శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం, శేష శైలా వాసా
https://www.youtube.com/watch?v=p9KmMVxLjzo

భట్టి విక్రమార్క, ఓ నెల రాజా
https://www.youtube.com/watch?v=0lSUGGmKpYU

జగదేక వీరుని కధ, శివ శంకరీ
https://www.youtube.com/watch?v=RRZxCNNr-RQ

మహా మంత్రి తిమ్మరసు, మోహన రాగ మహా
https://www.youtube.com/watch?v=gn0uua34DA4

శ్రీ కృష్ణార్జున యుద్ధం, అలిగితివా సఖీ
https://www.youtube.com/watch?v=j0YNLzwbbpE

పరువు ప్రతిష్ఠ, ఆ మబ్బు తెరలోనా
https://www.youtube.com/watch?v=TzfqYyT7CFg

రాముడు భీముడు, తెలిసిందిలే
https://www.youtube.com/watch?v=7njBOrk3Vsc

శభాష్ సూరి, ఈ వెన్నెల
https://www.youtube.com/watch?v=oG9VP_vPz78

సత్య హరిశ్చంద్ర, నమో భూత నాధ
https://www.youtube.com/watch?v=ZIgwOPDfoAU

ప్రమీలార్జునీయం, అతి ధీరవే గాని
https://www.youtube.com/watch?v=JcLwXdryH4w

శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కధ, వసంత గాలికి
https://www.youtube.com/watch?v=oJdkRfYdxgU

శ్రీ కృష్ణ తులాభారం, ఒహో మోహన రూపా
https://www.youtube.com/watch?v=LuTZq6UQ3OQ

భాగ్య చక్రం, నీవు లేక నిముషమైన
https://www.youtube.com/watch?v=5cSJnlF70V8

ఉమా చండీ గౌరీ శంకరుల కధ, నీ లీలలోనే
https://www.youtube.com/watch?v=WB9kPgm9K-E

శ్రీ కృష్ణ విజయం, జోహార్ శిఖి పించమౌళి
https://www.youtube.com/watch?v=1Rx_sFz9MZE

శ్రీ కృష్ణ సత్య, ప్రియా ప్రియా మధురం
https://www.youtube.com/watch?v=SJxMsfsdUuY

దీక్ష, మెరిసే మేఘ మాలికా
https://www.youtube.com/watch?v=29f-OXp4Wpw

దాన వీర శూర కర్ణ, చిత్రం భళారే విచిత్రం
https://www.youtube.com/watch?v=caTTYSOQRt8

చాణక్య చంద్ర గుప్త, చిరు నవ్వుల తొలకరిలో
https://www.youtube.com/watch?v=iFVcpXy81Xw

శ్రీ రామ పట్టాభిషేఖం, ఈ గనగకెంత గుబులు
https://www.youtube.com/watch?v=U_sm3fhpC1Y

శ్రీ తిరుపతి వేంకటేశ్వర కల్యాణం , ఈ పల్లె రేపల్లె
https://www.youtube.com/watch?v=gQmaww8du0s

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.