పట్టిసం

0
327

*పట్టిసం*

????????

పట్టిసం, పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరం మండలానికి చెందిన గ్రామము. నిజానికి ఇది ఒక గ్రామముగా లెక్కలలో ఉన్నా ఇది ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రము. ఈ క్షేత్రము కొవ్వూరుకు 25 కి.మీ. దూరంలో ఉంది. చారిత్రకంగానూ, ఆధ్యాత్మికంగానూ విశేషమైన స్థానం కలదీ పట్టిసం. పాపికొండల మధ్య సాగే గోదావరి ఒడ్డున దేవకూట పర్వతంపైన వీరభద్రస్వామి వారి ఆలయం, భావనారాయణ స్వామివార్ల ఆలయాలు ఉన్నాయి. గోదావరి మధ్యనున్న చిన్న లంక మాదిరి ప్రదేశంలో శ్రీ వీరభధ్రస్వామి దేవస్థానం ప్రకృతితో సుందరంగా ఉంటుంది. ఇక్కడ మహాశివరాత్రికి బ్రహ్మాండమైన ఉత్సవాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి. ఈ తీర్ధము లేదా తిరునాళ్ళకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు.
పురాణం

పూర్వం దక్ష ప్రజాపతి తాను చేస్తోన్న యజ్ఞానికి తన అల్లుడైన శివుడిని ఆహ్వానించకుండా అవమాన పరుస్తాడు. ఆ విషయమై తండ్రిని నిలదీసిన సతీదేవి, తిరిగి శివుడి దగ్గరికి వెళ్లలేక అగ్నికి తన శరీరాన్ని ఆహుతి చేస్తుంది. దాంతో ఉగ్రుడైన రుద్రుడు . వీరభద్రుడిని సృష్టించి, దక్షుడి తల నరకమని ఆజ్ఞాపిస్తాడు. శివుడి ఆదేశం మేరకు దక్షుడి యజ్ఞ వాటికపై వీరభద్రుడు విరుచుకుపడతాడు. తన ఆయుధమైన ‘పట్టసం’ ( పొడవైన వంకీ కత్తి ) తో దక్షుడి తల నరికి దానిని గోదావరిలో కడిగాడు. ఈ కారణంగానే ఈ ప్రాంతాన్ని పట్టసమనీ . పట్టిసీమనీ . పట్టసాచల క్షేత్రమని పిలుస్తుంటారు.
శ్రీవీరభద్రస్వామి ఆలయం

శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి కొలువుదీరిన ఈ దివ్య క్షేత్రానికి, శ్రీ భూ నీలా సమేత భావనారాయణస్వామి క్షేత్ర పాలకుడు. కనకదుర్గ అమ్మవారు . శ్రీ మహిషాసుర మర్ధిని అమ్మవారు ఇక్కడ గ్రామదేవతలుగా దర్శనమిస్తారు. ఇక అనిస్త్రీ . పునిస్త్రీ అనే దేవతలు సంతానాన్ని ప్రసాదించే దేవతలుగా ఇక్కడ పూజలందుకుంటూ వుంటారు.
దేవకూట పర్వతం

దక్షుడి తల నరికిన వీరభద్రుడు ఆవేశం చల్లారక ‘దేవకూట పర్వతం’ పై ప్రళయతాండవం చేయసాగాడు. ఆ సమయంలో ఆయన త్రిశూలం నేలకి గుచ్చుకోవడంతో, ఆ గుండం నుంచి ‘భద్రకాళి’ ఆవిర్భవించింది. దక్షుడి తల నరకడానికి ముందే వీరభద్రుడిని నిలువరించడానికి భావనారాయణ స్వామి చక్రాయుధాన్ని ప్రయోగించాడు. అయితే ఆయన ఆ చక్రాన్ని నోట కరుచుకుని నమిలి మింగేశాడు. దాంతో ఈ స్వామిని శ్రీ భావనారాయణుడు సహస్ర కమలాలతో పూజించి శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. అయితే ప్రతిసారి ఒక కమలం తక్కువ అవుతూ ఉండటంతో, తన వామ నేత్రాన్ని ఒక కమలంగా భావించి సమర్పించాడట. ఈ సందర్భంలోనే భావనారాయణుడికి వీరభద్రుడు తిరిగి చక్రాయుధాన్ని ఇచ్చినట్టు స్థలపురాణం చెబుతోంది.
వీరభద్ర భద్రకాళీస్వరూప భీకరరౌద్ర నాట్యాన్ని ఆపడానికి దేవతలకోరిక మీద అక్కడకు వచ్చిన అగస్త్యమహర్షి వీరభద్రుడిని వెనుక నుండి గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు వీరభద్రుడి ఆవేశం చల్లారి లింగరూపంలో దేవకూట పర్వతం మీద భద్రకాళీమాతతో వెలిసాడు.ఇక్కడ వెలసిన వీరభద్రుడిని వీరేశ్వరుడిగా ఆరాధించి భద్రకాలళితో ఆ స్వామి వివాహం జరిపించాడు అగస్త్యుడు. అలాగే శ్రీ భూ నీలా సమేత భావనారాయణ స్వామికి కూడా వివాహం జరిపించాడు. ఈ సమయంలోనే అగస్త్యుడు శ్రీ వీరేశ్వరస్వామిని భక్తితో ఆలింగనం చేసుకున్నాడు. శివలింగంపై ఇప్పటికీ అగస్త్యుడి చేతిగుర్తులు కనిపిస్తుంటాయని అంటారు.

?????????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.