పల్లెటూరు 16-10-1952

0
183

అపురూప చిత్రాలు -120

పల్లెటూరు 16-10-1952

1952 లో 24 చిత్రాలు విడుదల కాగా ఎన్ టి ఆర్ నటించిన మూడు చిత్రాలు తప్ప మరి ఏ చిత్రమూ శత దినోత్సవానికి నోచుకోకపోవడం అత్యంత ఆసక్తికరమైన అంశం.

ఎన్ టి ఆర్ నటించిన మన దేశం (24-11-1949), షావుకారు (07-04-1950), పల్లెటూరి పిల్ల (27-04-1950), మాయా రంభ (15-09-1950) , సంసారం (29-12-1950) , పాతాళ భైరవి (15-03-1951) , మల్లీశ్వరి (20-12-1951) సినిమాల తర్వాత 1952 లో ఎన్ టి ఆర్ నటించిన పెళ్ళి చేసి చూడు (29-02-1952), పల్లెటూరు (16-10-1952), దాసి (26-11-1952) న విడుదలయ్యాయి.

1952 లో అక్కినేని ఇతరులు నటించిన 21 తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. అవి సావాసం, శాంతి, ప్రియురాలు, ప్రేమ, ఆడ బ్రతుకు, ధర్మ దేవత, టింగు రంగా, రాజేశ్వరి, కాంచన, చిన్న కోడలు, అత్తింటి కాపురం, ముగ్గురు కొడుకులు, సింగారి, మరదలు పెళ్ళి, సంక్రాంతి, ఆకలి, పేద రైతు, చిన్నమ్మ కధ, సవతి పోరు, ప్రజా సేవ, ఆదర్శం.

ఆ ఏడాది ఎన్ టి ఆర్ నటించినవి 3 సినిమాలైతే, రెండు రజతోత్సవాలు, ఒకటి శత దినోత్సవం జరుపుకోవడమూ, మిగిలిన నటులు నటించిన 21 సినిమాలఓ ఏదీ 100 రోజులు ఆడక పోవడంతో ఎన్ టి ఆర్ టాక్ ఆఫ్ ది హీరో అయ్యారు.

16-10-1952 న విడుదలైన పల్లెటూరు సినిమా విశేషాలు:-
ఇది ఎన్ టి ఆర్ నటించిన 9 వ తెలుగు సినిమా.

దర్శకత్వం : టి.ప్రకాశరావు & పి.శివరామయ్య
రచన : సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు

పాత్రలు పాత్రధారులు: చంద్రం – ఎన్ టి ఆర్, గణపతి : ఎస్ వి ఆర్, సాంబయ్య : కోడూరు అచ్చయ్య, కొండయ్య : నాగభూషణం, శంకరం : రమణా రెడ్డి, సుబ్బన్న : సి హెచ్ కుటుంబరావు; పిచ్చన్న : పెరుమాళ్ళు, ప్లీడరు : మిక్కిలినేని; ఇన్స్పెక్టర్: ఆర్ డి ప్రసాద్; డాక్టర్ : పాలడుగు సుబ్బారావు.

సుగుణ : సావిత్రి; శాంత : టి జి కమలాదేవి; లలిత : పి ఎల్ కృష్ణవేణి; పిచ్చమ్మ : శసెషమాంబ; సీతమ్మ : కొమ్మూరి పద్మావతీదేవి; నాగులు : వసుంధర; అనసూయ : హేమలత; నర్తకి : తులసి

సంగీతం: ఘంటసాల వెంకటేశ్వరరావు

పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారు తయారు చేసిన తొలి సాంఘిక చిత్రం “పల్లెటూరు”

వరుసగా 3 సంక్రాంతి పండుగలు వచ్చి వెళ్ళేలోగా ఒకానొక పల్లెటూరి వాతావరణంలోనూ, ముఖ్యంగా ఆ పల్లెటూరికి చెందిన 3 కుటుంబాలలోనూ ఎన్నెన్నో మార్పులు వచ్చాయి. తొలి సంక్రాంతికి కలిమి లేకపోయినా కళకళలాడుతున్న చంద్రం సంసారం, కొండయ్య సంసారం మలి సంక్రాంతికి వీధి వాకిలి వూడ్చి ఇంత ముగ్గైనా వేసే దిక్కు లేకుండా తయారు అవుతాయి. ఇదంతా ఆ వూరిలోని పెద్ద రైతు గణపతి చలువే. మూడో సంక్రాంతినాటికి గణపతి తాను తీసిన గోతిలో తానే పడిపోయి ఆ రెండు కుటుంబాలలోనూ కష్టాలు తొలగిపోయి తొల్లింటి చైతన్యం తొంగి చూస్తుంది. మొదటి సంక్రాంతికి, ఈ మూడో సంక్రాంతికి మధ్య జరిగిన ముఖ్యమైన మార్పులు, అంగ బలం, అర్ధ బలం చూసుకుని విర్ర వీగి పరుల కాపురంలో చిచ్చు పెట్టిన గణపతి జైలుకు వెళ్ళటం, తన కడుపున పుట్టిన బిడ్డలకే కాక, తల్లీ తండ్రీ లేని శాంతమ్మకు పెద్ద అండగా వుంటున్న సీతమ్మ (చంద్రం తల్లి) కష్టాలు భరించలేక చనిపోవటం, మొదటి సంక్రాంతినాడు మనసులోని మరులు అణచుకోలేక బాధ పడుతున్న చంద్రం, సుగుణలు (ఇరుగు పొరిగుల పెరిగిన యువతీ యువకులు) మూడో సంక్రాంతినాటికి భార్యా భర్తలు కావడం, భార్య శాంతమ్మను అనుమానించి ఇంట్లోనుంచి తరిమివేసిన కొండయ్య కామందుగారు చేసిన ద్రోహం ఫలితంగా జైలుకు వెళ్ళి తిరిగి వచ్చి ఆలిని సగౌరవంగా తెచ్చుకోవడం.

కధా సంగ్రహం: నింగినంటు మంటలతో , బంగారపు పంటలతో, రంగు రంగు ముగ్గులతో, వింత వింత కాంతులతో, సంక్రాంతి పండుగ వస్తుంది. పల్లెటూరు యువకుల ముఖాల్లో ఆన్నదం తొణికిసలాడుతుంది. ఒక నూతనోత్సాహం పొంగి పొరలుతుంది. కోడి పందేలకూ, గొర్రె పందాలకూ స్వస్తి చెప్పి యువకులు ఒక నూతన పంధా నవలంబిస్తారు. విజ్ఞానప్రదములైన వైజ్ఞానిక ప్రదర్శనలద్వారా గ్రామ జీవితాన్ని ఆదర్శప్రాయంగా ప్రదర్శిస్తారు. “తెలుగోడా” లాంటి పాటలు, ” పొలాలనన్నీ హలాలదున్నీ ” లాంటి నృత్యాలు ప్రజా హృదయాన్ని ఊగించి వేస్తాయి.

కాని ఈ నూతనభావాలు ఆ గ్రామానికి పెత్తందారైన గణపతికి కిట్టవు. యువకుల వైజ్ఞానిక ప్రదర్శనలకు పోటీగా గణపతి ఒక హరి కధ పెట్టిస్తాడు. కాని అది ఒక పాత చింతకాయ పచ్చడిలాగ అవుతుంది. అంతటితో గణపతి ఆగ్రహోదగ్రుడై యువకులకు నాయకుడుగా ఉన్న చంద్రాన్ని అణగద్రొక్కడానికి ఎత్తు మీద ఎత్తు వేస్తాడు.

ఈ ప్రయత్నంలో అగ్నికి గాలి తోడైనట్లు గణపతికి శంకరం తోడవుతాడు. శంకరం గణపతి పినతల్లి కొడుకు. వెలిగి ఆరిపోయిన దీపం. మంచి మాటకారి. పాచికలు వేయడంలో శకునిలాంటివాడు.

గణపతి తన ప్రజా వ్యతిరేక చర్యలను కప్పి పుచ్చుకోవడానికి పైకి పరమ భక్తుడులాగా నటిస్తుంటాడు. ఒకవైపు కొంగ జపం చేస్తూనే తన నౌకరు కొండయ్య భార్య శాంతను చెరబట్టడానికి ప్రయత్నిస్తాడు. ఆమె తప్పించుకోవడంతో, శంకరం చేత చంద్రానికీ శాంతకూ సంబంధం ఉందని కొండయ్యను నమ్మిస్తాడు. ఆ మాటలు నమ్మి కొండయ్య శాంతను ఇంట్లోనుండి తరిమి వేస్తాడు.

చంద్రానికి శాంత మేనమామ కూతురు. తనమీద బడిన అపనింద ఏమిటో తెలియని కారణాన తల దాచుకోవడానికి శాంత చంద్రం ఇంటికి వెడుతుంది. అనటితో కొండయ్య అనుమానం మరింత బలబడుతుంది. శంకరం వేసిన పాచిక పారింది. గణపతి రొట్టె విరిగి నేతిలోబడింది.

గణపతి అట్టహాసానికి చంద్రం లొంగిపోయే మనిషి కాదు. న్యాయంకోసం పోరాడతాడు. కష్టాలన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటాడు. గ్రామ సౌభాగ్యంకోసం తన జీవితం అంకితం చేస్తాడు. యువకుల విజ్ఞానాభివృద్ధికి ఒక చిన్న గ్రంధాలయాన్ని స్థాపించి ఆంధ్ర రాష్ట్రం, ఆహార సమస్య మొదలైన అనేక విషయాలపై యువకులను విజ్ఞానవంతులుగా తయారు చేస్తాడు. చంద్రం చిత్తశుద్ధినీ, పరోపకారబుద్ధినీ చూచి సాంబయ్య కూతురు సుగుణ చంద్రాన్ని ప్రేమిస్తుంది.

సాంబయ్య ఒక మధ్య తరగతి రైతు. చంద్రానికీ, గణపతికీ మధ్య జరిగే సంఘర్షణలో గణపతివైపు మొగ్గు చూపుతాడు. తన కూతురు సుగుణను గణపతికి ఇచ్చి పెండ్లి చేయడానికి అంగీకరిస్తాడు. తన బొందిలో ప్రాణం ఉండగా గణపతిలాంటి నీచుడిని పెళ్ళి చేసుకోనని సుగుణ అంటుంది. నిన్ను గొంతు పిసికి నూతిలోనైనా పారేస్తానుగాని, కొండయ్య భార్యను ఇంట్లో ఉంచుకున్న చంద్రానికి ఇచ్చి పెండ్లి చేయనని సాంబయ్య ఖచ్చితంగా చెపుతాడు. ఈ మాట చెవిలోబడి శాంత దుఖాన్ని భరించలేక అర్థ రాత్రిపూట చేచి ఎక్కడికో వెళ్ళిపోతుంది.

గణపతి ధాన్యం బ్లాక్ మార్కెట్ చేస్తుంటాడు. కొండయ్య గణపతిని గుడ్డిగా నమ్మి అతని మోసానికి గురై చివరకు జైలులోబడతాడు.

జైలులోబడ్డ కొండయ్య తిరిగి వచ్చి పశ్చాత్తాపంతో నిజం తెలుసుకుని భార్య శాంతను సగౌరవం గా ఇంటికి తీసుకు రావడం, ప్రగతి శక్తులకూ ప్రతీప శక్తులకూ ప్రతినిధులుగా ఉన్న చంద్రానికీ గణపతికీ మధ్య జరిగే సంఘర్షణలో విజయ లక్ష్మి చంద్రాన్ని వరించడమూ, సాంబయ్య నిజం తెలుసుకుని చంద్రానికీ సుగుణకూ వివాహం జరిపించడంతో కధ సుఖాంతమవుతుంది.

ఈ చిత్రాన్ని నిర్మించడానికి పూనుకున్నవారిలోనైతేనేమి, ఆయా పాత్రలు ధరించినవారిలోనైతేనేమీ గొప్ప పట్టుదల ఉందని అచ్చు గుద్దినట్లు చిత్రంలో ఎక్కడికక్కడ కనిపిస్తుంది. పాత్రధారులందరూ ఏ భావాన్ని ఎంత మోతాదులో ప్రదర్శిస్తే బాగుంటుందో అంతవరకే ప్రదర్శించడం గమనించ వచ్చు. దర్శకునికి ఈ గౌరవంలో అధిక భాగం చెందుతుంది.

ఫొటోగ్రఫీ బాగుంది. కధలో నిమగ్నమైన ప్రేక్షకుడి మనస్సును పట్టి బలవంతాన ఫొటోగ్రఫీవైపుకి మరలించే కెమెరా ఫీట్స్ ఉండవు. ఘంటసాల సంగీతం చక్కగా అమరింది. ఎద్దుల మెడలోని మ్రువ్వల మ్రోతలు వాటి కదలికలతో వినిపిస్తాయి. సంభాషణలలో అర్ధం కాని భావాలు కానీ, బరువైన పదాలు కానీ లేకుండా సహజంగా ఉన్నాయి.

శ్రీ శ్రీ పాట, చేయెత్తి జైకొట్టు తెలుగోడా పాటలు నిర్మాతల అభిరుచిని తెలియ చేస్తాయి. పాటలన్నీ వినసొంపుగా ఉన్నాయి.

చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా, వి శ్రీ కృష్ణ రచన

పొలాలనన్నీ హలాల దున్నీ, శ్రీ శ్రీ రచన.

ఓ మిఠారి

రాజును కాని రాజునురా, సుంకర వాసి రెడ్డి రచన

ఆ సంక్రాంతి ఈ సంక్రాంతి, సుంకర వాసి రెడ్డి రచన

ఆ మనసులోన, సుంకర వాసి రెడ్డి రచన

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.