ఓంకారం ప్రణవ స్వరూపం

0
2400

ఓంకారం ప్రణవ స్వరూపం

‘” ఓం ” అనేది ప్రణవ స్వరూపం, శబ్దమయం.

1. అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న విశ్వంలో ఆకాశ తత్వంతో నినదించిన తొలి రుక్కు, బ్రహ్మవాక్కు- ఓంకారం! అది అకార, ఉకార, మకారాలనే బిందు సంయుక్తంగా ఏర్పడిన మొట్టమొదటి శబ్దం.

2. అకారం సృష్టికి, ఉకారం పోషకత్వానికి, మకారం లయకారకత్వానికి చిహ్నాలు.

3. ఓంకారం- బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వం.

4. అది కేవలం ఓ మంత్రం కాదు; అన్ని మంత్రాలకూ అదే- బలం, జీవం, శక్తిరూపం.

5. ‘ఓంకారం లేని మంత్రం ప్రాకారం లేని గుడి వంటిది’ అని పెద్దల మాట.

6. మంత్రాలకు పరిపుష్టినిచ్చేది, రక్షణ కల్పించేది ఓంకారం. ఓం అనేది ఒక మతానికి సంబంధించినది కాదు.

7. అది ప్రార్థనా మందిరం లోని ఘంటానాదం.

8. ప్రతి మనిషి గుండె చప్పుడూ అదే.

9. నిత్యమూ యోగులు, మహర్షులు జపించేది, మోక్షదాయకమైనది ఓంకారం అని వేదం ప్రకటించింది.

10. ప్రతి నిత్యం 21 మార్లు ఓంకారం జపించడం వల్ల, మనిషి శరీరంలోని 21 తత్వాలు- అంటే, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కోశాలు, పంచ ప్రాణాలు, మనసు ఉత్తేజితమవుతాయని యోగ శాస్త్రం చెబుతోంది. మనిషి జన్మ ‘సోహం’తో ప్రారంభమవుతుంది. సో అని వూపిరి పీల్చడం, హం అని వదలడంతో జన్మ ప్రారంభమవుతుంది. సో నుంచి హం వరకు- అంటే గాలి పీల్చి జీవితాన్ని ప్రారంభించి ‘హం’ అంటూ వదిలి నిర్గుణత్వానికి మళ్లేవరకు, ‘కోహం’లోనే జీవిత అన్వేషణ సాగాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. కోహం అంటే, నేనెవరు అని ప్రశ్నించుకోవడం. తానెవరో, ఎందుకు జన్మించాడో, ఏ మార్గంలో వెళ్లడానికి ప్రయత్నించాలో మనిషి తెలుసుకోవడం; చివరకు ఎక్కడికి చేరుకోవాలో బోధించేవే

11. వేదాలు, ఉపనిషత్తులు, ఇతర పురాణాలు. వీటిన్నింటికీ ఓంకార సాధనే మూలాధారం.
విమానం దూరంగా ఉన్నప్పుడు శబ్దం తక్కువగా ఉంటుంది. దగ్గరకు వచ్చేకొద్దీ, ఆ శబ్దం పెద్దదిగా మారుతుంది. విమానం తిరిగి దూరంగా వెళ్లిపోయినప్పుడు, శబ్దం చిన్నగా మొదలై, సాగి, ఆ తరవాత ఆగిపోతుంది. అలాగే ఓంకార శబ్దాన్ని మొదట చిన్న శ్రుతిలో మొదలుపెట్టి, తారస్థాయికి చేర్చి, చివరకు హం అనే శబ్దంతో ముగించాలి. నాభి నుంచి శబ్దాన్ని ప్రారంభించి, గొంతులో కొనసాగించి, పెదవులతో ముగించాలని యోగశాస్త్రంలోని ‘ఓంకారోపాసన’ తెలియజేస్తుంది.
ఓంకార శబ్దసాధనకు, సంగీత సాధనకు దగ్గరి సంబంధం ఉంది. మంద్ర స్థాయి, తారస్థాయి- రెండూ సంగీత శ్రుతిలో మేళవించి ఉన్నట్లే, ఓంకార నాదమూ ఉంటుంది. అది లయబద్ధంగా సాగినప్పుడు- వ్యాధుల నుంచి ఉపశమనంతో పాటు శరీరానికి జవసత్వాలు లభిస్తాయని చెబుతారు. మానవుడు సత్వ, రజో, తమోగుణాలతో ఉంటాడు.

12. అతిశయం, అహంకారం అతణ్ని వశం చేసుకున్నప్పుడు- పూర్తిగా సత్వగుణంలోకి మనసును నడిపించి సత్య ధర్మ శాంతి ప్రేమలను అందజేసే ఔషధమే ఓంకారం!

13. సత్యాన్వేషణలో మనిషికి సహకరించేది, ఆధ్యాత్మిక చింతన వైపు అతణ్ని మళ్లించేది, ఆవేశాన్ని అణచి అహింసా మార్గం వైపు నడిపించేది ఓంకారోపాసన- అని మహాత్మాగాంధీ అనేవారు.
సీతను రావణుడు అపహరించడంతో, శ్రీరామచంద్రుడు దుఃఖితుడయ్యాడు.ఆమె జాడ కనుగొనే యత్నంలో, సుగ్రీవుడితో మైత్రి సాగించాడు. అనంతరం సీతాన్వేషణకు ఆంజనేయుణ్ని దక్షిణ దిక్కు వైపు పంపించాడు. శత యోజనాల సముద్రాన్ని లంఘించడానికి సిద్ధమయ్యాడు హనుమ. మహేంద్ర పర్వతం మీద నుంచి ఎగరడానికి ఆయన సన్నద్ధమైన తీరు ఓంకార తత్వాన్ని తెలియజేస్తుంది. ఆకాశమార్గాన వెళ్లాలని నిశ్చయించుకొన్న మారుతి, వూపిరి దీర్ఘంగా పీల్చి వదులుతూ కొంతసేపు ప్రాణాయామ స్థితిలో ఉన్నాడు. ఒక్కసారిగా శక్తినంతా కూడదీసుకొన్న ఆయన, ప్రణవ నాదం(ఓం శబ్దం)తో కుప్పించి ఆకాశవీధిలోకి ఎగిరాడని సుందరకాండ వెల్లడిస్తుంది.

14. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల పునరుద్ధరణకు; మంత్ర జపాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు, ఆత్మశక్తితో జీవిత లక్ష్యాన్ని సాధించేందుకు అనువైన సాధనే- ఓంకారం. యోగులు సంకల్పాలను నెరవేర్చుకొనే క్రియ.

15. ఓంకార సాధన అందరికీ ఆరోగ్యకరం, ఆనందదాయకం.

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.