ఆశ్చర్యం గొలిపే విధంగా సస్పెన్సును పోషించిన లక్షాధికారి (27-09-1963)

0
659

అలనాటి చిత్రాలు -92

ఆశ్చర్యం గొలిపే విధంగా సస్పెన్సును పోషించిన లక్షాధికారి (27-09-1963)

1963 వ సంవత్సరం లో 30 తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. ఎన్ టి ఆర్ 13 సినిమాలలో, అక్కినేని 4 సినిమాలలో , ఇతరులు 13 సినిమాలలో నటించారు. ఎన్ టి ఆర్ నటించిన శ్రీ కృష్ణార్జున యుద్ధం (13 కేంద్రాలలో 100 రోజులు) , లవకుశ (62 కేంద్రాలలో 100 రోజులు) , నర్తనశాల (17 కేంద్రాలలో 100 రోజులు) , బందిపోటు (5 కేంద్రాలలో 100 రోజులు), తిరుపతమ్మ కధ (1987 సంవత్సరం లో విజయవాడలో ) , పరువు ప్రతిష్ట (విజయవాడ రాజకుమారి టాకీసు) శతదినోత్సవాలు జరుపుకున్నాయి.

అక్కినేని నటించిన పూజా ఫలం (2 కేంద్రాలలో 100 రోజులు), చదువుకున్న అమ్మాయిలు (5 కేంద్రాలలో 100 రోజులు) , పునర్జన్మ, నిరపరాధి ఆ సంవత్సరం విడుదలయ్యాయి.

1963 వ సవత్సరం సంక్రాంతికి శ్రీ కృష్ణార్జున యుద్ధం విడుదలయ్యింది. పరిశ్రమలోనూ ప్రేక్షకులలోనూ శ్రీ కృష్ణ పాత్ర సంచలన కారకమయింది. 13 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుంది. ఈ సినిమా విడుదల తర్వాత ఏ ఎన్ ఆర్ తన భార్య అన్నపూర్ణ , ఎన్ టి ఆర్ ఉన్న పౌరాణికాలలో నటించవద్దని చెప్పేరని, స్వయంగా ఆయనే చెప్పుకున్నారు.

ఆ తర్వాత ఉగాదికి విడుదలైన లవకుశ సినిమా చరిత్ర సృష్టించింది. 62 కేంద్రాలలో శతదినోత్సవాలు జరుపుకుంది ఈ సినిమా.

దసరాకు విడుదలైన నర్తనశాల ప్రేక్షకులకు ఆనందాల పండగ అయ్యింది. 17 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుందీ చిత్రం.

చరిత్ర సృష్టించిన ఆ 3 అపురూప చిత్రాలతో పాటు 15-08-1963 న విడుదలైన జానపద చిత్రం బందిపోటు 5 కంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుంది.

ఆ ఏడాది విడుదలైన తిరుపతమ్మ కధ రిపీట్ రన్ లో 1987 సంవత్సరం లో విజయవాడలో శత దినోత్సవం జరుపుకోవడం ఒక విశేషం.

లక్షాధికారి హిట్ సినిమాగా నిలచింది. మంచి లాభాలనార్జించింది.. శత దినోత్సవం జరుపుకోలేదు.‘లక్షాధికారి’ చిత్రం 11 వారాలు ఆడింది. ఆ సినిమా విశేషాలు:-

లక్షాధికారి చిత్రం చూచిన తర్వాత మనకు కలిగే అభిప్రాయం “ఇంత హెచ్చు స్థాయిలో సస్పెన్సును పోషించిన చిత్రం తెలుగులో బహుశా ఇదే మొదలు”.

తెలుగులోకూడా సస్పెన్సు పై కొద్ది కొద్ది తర బేధాలతో ఆధారపడిన చిత్రాలు కొన్ని వచ్చినా అవి లక్షాధికారి అంతటి ఆశ్చర్యం గొల్పియుండవు. అదే సమయంలో నాయకీ నాయకుల శృంగార గీతాలతో , సరాగాలతో ప్రేక్షకులను ఖుషీ చేస్తూ అసహజత్వం లేకుండా కధను నడిపిస్తూ సాగిన చిత్రానికి ఉదాహరణగా లక్షాధికారి సినిమాను చెప్పేవారు అప్పట్లో.

రవీంద్రా ఆర్ట్ ప్రొడక్షన్సు వారు వి మధుసూధనరావు దర్శకత్వంలో, శ్రీ నార్ల చిరంజీవి గారి రచనతో , మాస్ అప్పీలింగును పోషించుకుంటూ చక్కని వినోదాత్మక చిత్రంగా రూపొందించిన లక్షాధికారి సినిమా 27-09-1963 అంటే 55 సంవత్సరాలక్రితం విడుదలయ్యింది.

సారథి స్టూడియోలో జనరల్ మేనేజర్గా, ముఖ్య కార్యనిర్వాహణాధికారిగా ఉంటూ 1962లో రవీంద్ర ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థను ప్రారంభించి మొదటి ప్రయత్నంగా విక్టరి మధుసూదనరావు దర్శకత్వంలో ఎన్.టి.రామారావు, కృష్ణకుమారి జంటగా నిర్మించిన ‘లక్షాధికారి’ చిత్రం 27.9.1963న విడుదలై 55 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తన సొంత బ్యానర్పై చిత్ర నిర్మాణం సాగించిన తమ్మారెడ్డి ‘‘సారథి స్టూడియో నా విశ్వవిద్యాలయం’’ అని చెబుతుంటారు. విశ్వకవి రవీంద్రుడు అంటే ఇష్టపడే తమ్మారెడ్డి తన సంస్థ లోగో మీద రవీంద్రుని రేఖాచిత్రంతో పాటు శృంఖలాలు తెంచుకున్న కార్మికుని చిత్రాన్ని కూడా ఉంచారు. ‘‘స్వాతంత్య్రం, శాంతి, అభ్యుదయం’’ అనే సందేశం లోగోలో కనిపిస్తూ తమ్మారెడ్డి ఆశయాలను గుర్తుచేస్తుంటుంది. అటు ‘లక్షాధికారి’ చిత్రానికే కాదు, ఇటు రవీంద్ర ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థకూ ఇది గోల్డెన్ జూబిలీ దాటడం కూడా ఒక విశేషం.

లక్షాధికారి రంగయ్య (నాగయ్య) వజ్రాల వ్యాపారం చేస్తుంటాడు. అతనికి ఒకే ఒక కొడుకు ప్రసాద్ (ఎన్టీఆర్). సీతయ్య (గుమ్మడి) రంగయ్య వద్ద గుమస్తాగిరి చేస్తూ, వ్యాపారంలో నమ్మినబంటుగా, కుటంబంలో ఒక సభ్యుడిగా కలిసిపోతాడు. సీతయ్య భార్య రుష్యేంద్రమణి ఉత్తమురాలు. వీరి కూతురు పద్మ (కృష్ణకుమారి). పానకాలు (మిక్కిలినేని) రంగయ్య ఇంట్లో కాపలాదారు.

పచ్చితాగుబోతు. రంగయ్య బావమరిది శివం (కె.వి.ఎస్.శర్మ) అవిటివాడు. బంగారం తయారీలో నష్టపోయి, డబ్బు సాయం కోసం రంగయ్య వద్దకు వచ్చి డబ్బు అర్థిస్తాడు. న్యాయసమ్మతం కాని దొంగ బంగారం వ్యాపారం మంచిది కాదని, తన బంగళాలలోనే ఉంటూ కాలక్షేపం చెయ్యమని సలహా ఇచ్చిన రంగయ్యను కాదని, శివం ఆ రాత్రి ఖజానాలో డబ్బు దొంగిలించాలని పన్నాగం పన్నుతాడు.

అదే రోజు వ్యాపార పని నిమిత్తం ఒక వజ్రాల వ్యాపారి రంగయ్య ఇంటి వద్దకు వజ్రాలు తీసుకొస్తాడు. వాటి కోనుగోలుగు అంగీకరించిన రంగయ్య హోటల్లో బసచేస్తే, ప్రమాదమని తన ఇంట్లోనే అతనికి ఆ రాత్రి వసతి కల్పిస్తాడు. శివం డబ్బు దొంగతనానికి వచ్చిన సమయానికి వజ్రాల వ్యాపారి హత్యకు గురవుతాడు. హంతకుడెవరన్నది సస్పెన్స్. ఆ హంతకుణ్ని కళ్లారా చూసిన సీతయ్య భార్య షాకుకు గురై మాట కోల్పోతుంది. లక్షాధికారి రంగయ్యమీదే హత్యానేరం పడుతుంది. కోర్టు అతనికి జీవితఖైదు విధిస్తుంది. జైలులో ఉన్న రంగయ్య తన చిన్నారి కొడుకు ప్రసాద్ను, ఆస్తిని సంరక్షించే బాధ్యతను నమ్మకస్తుడైన సీతయ్యకు, అతని భార్యకు అప్పగిస్తాడు.

ఇంతలో సీతయ్య సంరక్షణలో వున్న రంగయ్య కొడుకు ప్రసాద్ అపహరణకు గురై కృష్ణానది తీరంలో స్పృహలేనిస్థితిలో ఉండగా, సంతానం కోసం పుణ్యతీర్థాలు సందర్శిస్తూ, నదీస్నానం చేస్తున్న రమణారెడ్డి (పిచ్చయ్య), అచ్చమ్మ (సూర్యాకాంతం) దంపతులకు ఆ బాలుడు దొరకుతాడు. దైవమిచ్చిన బిడ్డగా ఇంటికి తెచ్చుకున్న వేళావిశేషం చేత వారికి ఒక అమ్మాయి లీల (గిరిజ) పుడుతుంది. ప్రసాద్రాకతోనే ఈ అదృష్టం వచ్చిందని పిచ్చయ్య దంపతులు అతనికి వరప్రసాద్ అని పేరు పెడతారు.

లీల, సీతయ్య కూతరు పద్మ కాలేజీలో స్నేహితులు. ప్రసాద్ ఫార్మసీ విద్యార్థి. గుండెజబ్బు నివారణకు మందు కనుగొని డాక్టరేటు సంపాదిస్తాడు. సీతయ్య పెట్టుబడితో పరిశ్రమ స్థాపించి వ్యాపారాన్ని వృద్ధి చేస్తాడు. వ్యాపారంలో వచ్చిన లాభాలను సీతయ్య బంగారం కడ్డీల రూపంలో పిచ్చయ్యకు పంపుతాడు. ఈ లోగా ప్రసాద్, పద్మలు ప్రేమించుకుంటారు.

రావు అనిపిలువబడే సన్యాసిరావు (రేలంగి) పానకాలు కొడుకు. బుద్దిమంతుడు. అతడు అప్రయత్నంగా పరిచయమైన లీల ప్రేమలో పడతాడు. పానకాలు అభ్యర్థనతో సీతయ్య, రావుకు తన ప్యాక్టరీలో మేనేజర్ ఉద్యోగం వేయించడంతో ప్రసాద్కు రావు దగ్గరవుతాడు. లీల, రావుల ప్రేమ వ్యవహారం తెలిసి వాళ్లిద్దరికి పెళ్లి చెయ్యాలని ప్రసాద్ ప్రయత్నించగా, కోపించిన అచ్చమ్మ దుర్భషలాడే తొందరలో అతడు తమకు దొరికినబిడ్డ అనే నిజం చెబుతంది.

పెంచిన తండ్రి పిచ్చయ్య ద్వారా తన తండ్రి రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నాడని తెలిసి ప్రసాద్ అక్కడికెళ్తే, ఒక నెల ముందుగానే విడుదలయ్యాడని తెలుస్తుంది. రంగయ్య ఈలోగా సీతయ్యను కలుస్తాడు. తనింట్లో బసచేసిన రాత్రే రంగయ్యమీద హత్యాప్రయత్నం జరుగుతుంది. ప్రసాద్ రంగయ్యను కాపాడుతాడు. కల్తీ బంగారం అమ్మే ముఠాను పట్టుకొనే ప్రయత్నంలో, తమకున్న సమాచారం మేరకు పోలీసులు అమాయకుడైన పిచ్చయ్య, అచ్చమ్మలను అరెస్ట్ చేస్తారు.

ఈ రహస్య ఛేదనలో ప్రసాద్ ఉండగా హత్యా రహస్యం తెలిసిన పానకాలు నిజం ఎక్కడ చెప్పేస్తాడోనని, పాడుబడిన కోట వద్ద పానకాలుని విలన్ కాల్చి చంపేస్తాడు. ప్రసాద్కు తెలియకుండా అతని వెనకే కోట వద్దకు వచ్చిన రంగయ్యను హంతకునిగా భావించి పోలీసులు జైలుకు పంపుతారు.

ఇక మారువేషాల్లో ప్రసాద్ హంతకుడిని వేటాడుతాడు. ఈ వేటలో అసలు హంతకుడు బయటపడతాడు. శివంని విలన్ గృహనిర్బంధంలో వుంచి అతడి ముసుగులో ఈ హత్యలన్నీ చేస్తాడు. ఆ విలన్ ఎవరో కాదు. రంగయ్య నమ్మినబంటుగా ఉన్న సీతయ్యే! అలా సస్పెన్స్వీడి రంగయ్య బయటకు, సీతయ్య జైలుకు వెళ్తాడు. ప్రసాద్, పద్మలకు, రావులకు పెళ్లి జరుగుతుంది. కథ సుఖాంతం.

పైకి ఉత్తములుగా ఉంటూ కాల సర్పాలుగా ఎలా కొందరు వ్యవహరిస్తారో స్వయంగా గ్రహించినప్పుడే మీరు ముక్కుపై వేలు వేసుకుంటారూ.

దొంగలకు బాస్ గా ఒకడుంటూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, ఆర్డర్లు వేస్తూ వ్యవహారం నడుపుతుండగా, “అసలు బాస్” వేరే ఇంకొకడుంటాడన్నది ప్రేక్షకులు ఊహించరు. ఆ అవకాశం అసలు ఇవ్వకుండానే ఆఖరున ఆశ్చర్యంలో ముంచి వేయడం తో తెలుగువారు కూడా ఘటికులేననిపించుకున్నారు.

కధ క్రైం సబ్జెక్ట్ కనుక అసహజత్వాలకు కొంత మార్జిన్ ఉంటుంది. ఆ మార్జిన్ దాటితే “అసహజత్వం” క్రింద లెక్క అనుకుంతే అటువంటి అసహజత్వం ఏర్పడనీయలేదు.

ఉదాహరణకు రిక్షా స్టాండ్ లో లో సీతయ్యకు ప్రసాద్ చెప్పినదానినిబట్టి ప్రసాద్ తన కొడుకేనా అని సీతయ్యకు సూచనప్రాయంగా తెలియచేయడం, ప్రసాద్ ను చంపివేసి రమ్మనగా ఆ ప్రకారం కృష్ణా నదిలో పానకాలు పారవేయగా, పిల్లవాడు కొట్టుకు రావడం పిచ్చయ్యకు దొరకడం వంటివి తీసుకోవచ్చు. కొట్లాటలుండాలి కాబట్టి కొట్లాటలు కల్పింపలేదు. తగిన కారణం కధలో భాగం గా చేయడం వల్ల ప్రేక్షకులు వాటిని అవసరమైనవిగా తీసుకున్నారు.

ఇలా కధనంలో, ఘటనల మూలంలో అసహజత్వం నివారించడం లో దర్శకుడూ, రచయితా మంచి కృషి చేశారు. సంభాషణలు కధకు సరిగ్గా సరి పోయాయి.

ప్రసాద్ గా ఎన్ టి ఆర్, పద్మ గా కృష్ణ కుమారి, సీతయ్యగా గుమ్మడి ప్రశంసనీయంగా నటించారు.

లక్షాధికారి విడుదలైన వారం రోజులకు తిరుపతమ్మ కధ, మరొక నెల రోజుల లోపలే నర్తనశాల సినిమాలు విడుదలయ్యాయి. అప్పటికి ఇంకా అన్ని వూళ్ళల్లో లవ కుశ సినిమా రజతోత్సవాలతో వీర విహారం చేస్తోంది. లక్షాధికారి మంచి లాభాలార్జించి హిట్ చిత్రంగా నిలచింది. మొత్తమ్మీద మంచి వినోదంగా కాలక్షేపం చేయించే మాస్ అప్పీల్ చిత్రం “లక్షాధికారి”.

లక్షాధికారి’ చిత్రం ఒక రకంగా అపరాధ పరిశోధాత్మక చిత్రమని చెప్పవచ్చు. ఈ కోవలో వచ్చిన మొదటి చిత్రం బహుళా ఇదే కావచ్చు. ఎందుకంటే ఇందులో సెప్సెన్స్ ఉంది. సైన్సు ఉంది. తరువాత వచ్చిన ‘దొరికితే దొంగలు’ (1965), ‘గూఢచారి 116’ (1966) చిత్రాలకు ఈ చిత్రం పేరణ కూడా కావచ్చు. ఈ చిత్రంలో సప్సెన్స్ అడుగడుగునా కనిపిస్తుంది. హత్య, దొంగతనం వంటి సంఘటనలు జరగబోతున్నాయనేందుకు సంకేతంగా క్లాక్ టవర్ అర్థరాత్రి 12 గంటలు సూచిస్తుంది. తరువాత నక్కల, గుడ్లగూబల అరుపులు వినిపిస్తాయి. కెమెరా గుడ్లగూబల కళ్లమీదికి దూరంగా ఫోకసై తెరముందుకు వచ్చి భయపెడుతుంది. చిత్రం విడుదలైన కొత్తలో చిన్న పిల్లలు ఈ సన్నివేశాన్ని చూసి జడుసుకునేవారు. కె.వి.ఎస్.శర్మ కొయ్యకాలుతో పోటు వేసుకుంటూ వచ్చే ఘట్టం కూడా భయానకమే! చిత్రం చివరిదాకా గుమ్మడి విలన్ అని ఎవరికీ అనుమానం రాదు.

రచయిత నార్ల చిరంజీవి సినిమాలో కొన్ని క్లూస్ జొప్పించినా వాటిని మనం గుమ్మడికి అన్వయించలేము. ఉదాహరణకు కె.వి.ఎస్.శర్మ ముసుగులో విలన్ వజ్రాల వ్యాపారిని హత్యచేసి వజ్రాలు చేజిక్కించుకొని పారిపోతున్నప్పుడు అతని భార్య అడ్డుపడితే ఆమెను కొట్టినప్పుడు, హంతకుడు పారిపోయినప్పుడు పానకాలు కాపలా ఉండి కూడా పోలీసుల వద్ద నోరు మెదపకుండా ఉన్నందుకు ప్రతిఫలంగా, రేలంగిని విలన్ తన ఫ్యాక్టరీ మేనేజర్ చేసినప్పుడు, రంగయ్య జైలుకు వెళ్లగానే అతి నిరాడంబరంగా ఉండే సీతయ్య ఒక్కసారి జమీందారుగా మారినప్పుడు, లాభాల సాకుతో దొంగ బంగారం కడ్డీలు పిచ్చయ్య ఇంటికి పంపినప్పుడు, హీరో రంగయ్య కొడుకునే నిర్ధారణకు రావడానికి అతనిపై కాఫీని కావాలని వొలకపోసి హీరో చేతిమీద ఉండే పుట్టుమచ్చను గుర్తించినప్పుడు, జీవితఖైదు అనుభవిస్తున్న రంగయ్య విడుదల కాకూడదనే భ్రమించి కొత్త ఇల్లు, తోటతోసహా కట్టించినప్పుడు మనకు గుమ్మడే విలన్ అనే సందేహం కలగదు.

విలన్ స్థావరం కూడా సీతయ్య కట్టించిన ఇంట్లోనే ఉందనే ఊహ కూడా రాదు. వీటన్నింటికి కారణం గుమ్మడి నటనలో సందేహం కలిగించే అంశాన్ని ప్రేక్షకుని రానీయకుండా జాగ్రత్త పడిన దర్శకుని ప్రతిభే! అంతే కాదు యాభైఐదేళ్ల కిందే ‘‘రోబో’’ యంత్రాల వంటి కరెంటు మనుషుల్ని మనిషిని చంపేందుకు వినియోగించడం కూడా దర్శకుని ప్రతిభే!

కె.వి.ఎస్.శర్మ గంభీరపు గొంతుతో పలికే సంభాషణలు అతడే విలన్ అని మనకు అనుమానం కలిగించేలా చేస్తుంది.

ఈ చిత్రంలో గొప్ప హాస్యనటులు రేలంగి, రమణారెడ్డి ఉన్నా, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం కావడం చేత, హాస్యరసానికి చిన్నపీటే వేశారు.

నారాయణ రెడ్డి గీత రచన, చలపతిరావు గారి సంగీతం , సి నాగేశ్వర రావు కెమెరా పనితనం, మధుసూధన రావు దర్శకత్వం మెచ్చుకోదగ్గవి.

పి.చంద్రశేఖరరెడ్డి ఈ చిత్రానికి అసోసియేట్గా పనిచేశారు. వాహిని, విజయ స్టూడియోల్లో ఈ చిత్ర నిర్మాణం జరిగింది.

తాతినేని చలపతిరావు సంగీతం చిత్ర వేగాన్ని పెంచి సస్పెన్స్ని చివరిదాకా కొనసాగించేందుకు వీలు కలిపించింది.

ఇక పాటల విషయానికొస్తే, సినారె గతంలో ఒక పత్రిక కోసం రాసిన ‘మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది’ పాటను యధాతధంగా వాడుకున్నారు. మధ్యమావతి రాగంలో బాణీకూర్చిన ఈ పాటను ఘంటసాల, సుశీల పాడగా తిరువణ్ణామలై దగ్గరలో ఉన్న చెన్నకేశవ హిల్స్ వద్ద ఎన్.టి.ఆర్ – కృష్ణకుమారిల మీద చిత్రీకరించారు. ప్రశ- సమాధానంతో కూడిన సినారె మార్కుపాట ఇది.

మబ్బులో ఏముంది

ఎన్.టి.ఆర్ కథనాయిక చిత్తరవును గీసి ఆమెకు చూపకుండా దాచినప్పుడు ఆమె పాడే ‘‘దాచాలాంటే దాగదులే..దాగుడు మూతలు చాలవులే’’ అనే సుశీల గీతానికి సీక్వెల్గా ఘంటసాల గీతం కూడా ఉంది. సముద్రపు ఒడ్డున సాగే ఈ టీజింగ్ పాట కొబ్బరి, సరుగుడు చెట్ట మధ్య సాగుతుంది. ఈ పాటలో ‘‘నీ సన్నని మీసంలో విలాసం వన్నెలు చిలికింది..నీ నున్నని బుగ్గలపై పున్నమి మెరిసింది’’ అనే ప్రయోగం అద్భుతం. ఘంటసాల పాడే సీక్వెల్ పాటకు ముందు సాకీ వస్తుంది. కానీ సుశీల పాటకు లేదు.

దాచాలంటే దాగవులే

నా చెంప తాకగానే చెలీ నీ చేయి కందెనేమో..నా చూపు సోకగానే అరెరె నాజూకు తగ్గనేమో..’’ అంటూ కవ్వించే ఈ పాటలో ‘‘నీ కులుకు నడక చూచీ రాజహంసలకు సిగ్గు కలిగే నీ తళుకు మోము చూచీ నింగి జాబిలికినిగ్గు తరిగే – నీ నల్లని వాల్జెడలో విరిసిన మల్లెలు రమ్మనెను..నీ ఎర్రని బుగ్గలపై సిగ్గులు ఎదురై పొమ్మనెను’’ అనే సినారె పద ప్రయోగాలు ఆ రోజుల్లో ప్రేక్షకుల్ని ఎంతో అలరించాయి.

నా చెంప తాకగానే

ఎలాగో ఎలాగో ఎలాగో ఉన్నది.. ఇలాగే ఉంటుందా తొలిప్రేమ అన్నది.. అలాఅలాఅలా మనసు తేలిపోవుచున్నది’’ అంటూ ఆరుద్ర రాసిన నాయకానాయికల పరిచయ ప్రభావ గీతాన్ని సాతనూర్ డ్యాం వద్ద గార్డెన్స్లో కృష్ణకుమారి మీద చిత్రీకరించారు.

ఎలాగో ఎలాగో

మరో అందమైన పాట కూడా సినారేదే. ‘‘అద్దాల మేడ ఉంది అందాల భామ ఉంది. మత్తైన మందు వుంది రారారా.. మనసైతే రమ్మంది రారా’’ పాట సన్నివేశపరంగా పానకాలు ద్వారా రహస్యం రాబట్టే పక్రియలో మారువేషాల్లో ఉంటూ ఎన్.టి.ఆర్, రేలంగి, కృష్ణకుమారి పాడేది. జమునారాణి, స్వరం ఈ పాటలో విలక్షణంగా ఉంటుంది. పాట మధ్యలో రేలంగి బూరవూదే సన్నివేశం కూడా ఆకట్టుకుంది. ఈ పాట ఇంటర్లూడ్ వద్ద వాడిన బిట్ ‘భార్యాభర్తలు’ (1961) చిత్రంలో ‘జోరుగా హుషారుగా షికారు పోదామా’ మ్యూజిక్ బిట్ని గుర్తుచేస్తుంది.

అద్దాల మేడ వుంది

మరో రెండు పాటలు అప్రధానమైనవే! ‘‘ఇటు చూడు ఒక్కసారి హరిలో రంగ హరి.. హెల్లో మై డార్లింగ్ ఐ లవ్ యు’’ అంటూ రేలంగికి మాధవపెద్ది పాడే కొసరాజు పాటలో రేలంగి చాకిరేవు మీదుగా చిన్న ఒంటెద్దు బండిమీద వచ్చే సన్నివేశం నవ్వు తెప్పిస్తుంది.

ఒహో అందమైన చిన్నదాన

అచ్చమ్మకు శ్రీమంతము

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.