అమ్మతో మాట్లాడుతున్నారా?

0
906

అమ్మతో మాట్లాడుతున్నారా?

అమ్మ…. రెండు అక్షరాలు.. నిఘంటు అర్థాలకు అతీతమైనవి… మనిషి పుట్టుకకు మరో పేరు అమ్మ. నిశ్శబ్దంలోనూ వినిపించే ఒకే ఒక్క శబ్దం అమ్మ.. అమె తనువు బిడ్డలది.. ఆమె తపన తీరనిది.. ఆమె మమత కాలం కంటే వేగంగా హృదయాలను తాకేది.. అమ్మ గురించి ఎందరు ఎన్ని రాసినా ఏం చాలుతుంది.. సృష్టే ఆమె అయినప్పుడు ఆమెను సంపూర్ణంగా చూసేందుకు ఎన్ని కళ్లు చాలుతాయి? మీరు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారా? భయంతో వణికిపోతున్నారా? జీవితంలో అన్నీ కోల్పోయానన్న ఆందోళనలో ఉన్నారా? ఏం చేయాలో తోచక.. దారి కనిపించక.. జీవితంపై విరక్తి కలిగినప్పుడు మీరేం చేస్తారు.. అర్థం కావటం లేదా? ఒక్కసారి మీ అమ్మతో మాట్లాడండి.. ఒక్క క్షణం ఆప్యాయంగా ఆమె పలుకులు వినండి.. ఆమె మాట మీకు స్వాంతన చేకూరుస్తుంది.. అన్ని టెన్షన్లూ మటుమాయమవుతాయి.. ఎందుకంటారా? ఆమె అమ్మ కాబట్టి.. కాలంతో పోటీ పడి గెలిచే వాళ్లు ఎవరైనా ఉన్నారా? అంటే టక్కున చెప్పగలిగే ఒకే ఒక్క జవాబు అమ్మ.. జన్మనిచ్చినప్పటి నుంచీ అమ్మకు పిల్లలే లోకం.. పిల్లలే తనువు.. పిల్లలే సర్వస్వం… అన్నం తినటం దగ్గర నుంచి అక్షరాలు నేర్చే దాకా ఆదిగురువు అమ్మ.. మాట నేర్పేది అమ్మ.. మంచి నేర్పేది అమ్మ.. తన కళ్లతో లోకాన్ని చూపించేది అమ్మ.. బుడిబుడి అడుగులతో నడవటానికి ప్రయత్నిస్తూ బిడ్డ తడబడ్డప్పుడు ఆ తడబాటును సరిదిద్దేది అమ్మ.. పెద్దగా పెరిగాక తప్పు చేస్తే, ఆ తప్పును కాచి బిడ్డను తన చాటున ఉంచుకుని కాపాడుకునే ఆత్మబంధువు అమ్మ మోకాలిపైదాకా చీర కట్టి ఎంత కష్టమైనా పడుతుందేమో కానీ, కన్నబిడ్డ కష్టాన్ని ఒక్కక్షణం కూడా చూడలేదు అమ్మ.. తీవ్రమైన ఆందోళనలో ఉన్నప్పుడు ఆమె స్పర్శ మనకు కలిగించే స్వాంతన ఎంత గొప్పది.. మనం ఆందోళనలో ఉన్నప్పుడు తలలో వేళ్లు ఉంచి సున్నితంగా నిమురుతూ అమ్మ ఇచ్చే ఓదార్పు మరెక్కడ లభిస్తుంది? ఇవాళ ఉద్యోగాల కోసమో..వ్యాపారం కోసమో ఎక్కడెక్కడికో వలసలు వచ్చి బతుకుతున్న వాళ్లు ఎందరో ఉన్నారు.. ఎక్కడో సుదూరంగా ఊళ్లో ఉన్న తల్లి.. ఇంకెక్కడో నగరాల్లో క్షణమైనా తీరిక లేని సంతానం.. ఇద్దరి మధ్య పలుకే కరవైన పరిస్థితి.. ఈ దశలో ఒక్కసారి ఫోన్‌లోనైనా ఆమ్మ మాట వింటే ఎంత ఆనందంగా ఉంటుంది? ఎంత ఉల్లాసంగా ఉంటుంది? ఇది ఎవరికి వారికే కలిగే అనుభవం… విస్కాన్సన్‌ యూనివర్సిటీ దీనికోసం ఓ పెద్ద పరిశోధన చేసి మన ఒత్తిళ్లనుంచి దూరం చేసేది అమ్మ మాట అని తేల్చింది… ఇందుకోసం ఇంత పరిశోధన దేనికో అర్థం కాదు.. మన కల్చర్‌లోనే నరనరానా జీర్ణించుకుని పోయిన పదం అమ్మ… ఇంత గొప్ప సంస్కృతి ప్రపంచంలో మరెక్కడా కనిపించదు.. ఇక్కడ అమ్మ అన్న మాట అత్యంత సాధారణంగా వినిపించేది.. కాస్త పక్కకు జరుగమ్మా.. ఏమ్మా బాగున్నావా అలా కాదమ్మా ఇలా చేయి.. అనే మాటలు మన దగ్గర ఎక్కడైనా వినిపించేవి.. చిన్న దెబ్బ తగిలితే మొదట మన నోటి వెంట వచ్చే మాట అమ్మ.. అమ్మ ఆప్యాయతకు ఇంతకంటే అర్థం ఏం కావాలి.. అమ్మ.. తొలి అక్షరంతో పెదవి విచ్చుకుంటే.. మలి అక్షరంతో పెదవులు కలిసిపోతాయి.. మధ్యలో ఉన్న సమస్త సృష్టి రహస్యమే అమ్మ… అందుకే టెన్షన్‌లో ఉన్నప్పుడు అమ్మతో మాట్లాడండి.. హాపీగా ఉండండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.