అడవి రాముడు (28-04-1977)

0
422

అపురూప చిత్రాలు-94

అడవి రాముడు (28-04-1977)

సరిగ్గా 41 సంవత్సరాలక్రితం ఇదే రోజు 28-04-1977 న విడుదలైన ఆ “అడవిరాముడు” సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రను మార్చేసింది. ఇందులో నటించినవారందరికి stardom నిచ్చింది. . సాంకేతిక నిపుణులు కూడా పెద్ద ధరలకు ఎదిగిపోయారు. సత్య చిత్ర నిర్మాతలు అంతకుముందు శోభన్ బాబు తో తాశీల్దార్ గారి అమ్మాయి తీసి విజయం చవిచూసారు. ఎలాగైనా ఎన్ టి ఆర్ తో తీద్దామనే యోచనలో పడ్డారు. అప్పటికి ఎన్ టి ఆర్ రాఘవేంద్ర రావు కాంబినేషన్‌తో చిత్రం ఎవరు తీయలేదు. ఆపని మనం చేద్దామని ఎన్ టి ఆర్ ను కలుసుకుని డేట్స్ అడిగారు. అప్పుడు ఎన్ టి ఆర్ దాన వీర శూర కర్ణ చిత్రం నిర్మాణంలోఉన్నారు. ఇచ్చిన డేట్స్ కేన్సిల్ చేసుకుని
మరోసారి 35 రోజులు మధుమలై అడవుల్లో ఏకంగా ఉండి పోయారు. ఎన్ టి ఆర్ అలా out door లో ఉండడమనేది ఈ చిత్రంతో ఆరంభం అయ్యింది. స్కోప్ లో అడవి అందాలతో నిండిన చిత్రంగా రాఘవేంద్రరావు చిత్రీకరించారు.

కథ కన్నడ రాజకుమార్ నటించిన హిట్ చిత్రం గంధడ గుడి ఆధారం. ఈచిత్రం తెలుగులోకి డబ్ చేసి విడుదల చేసారు. అడవి దొంగలుగా వచ్చింది. కొద్దిమార్పులు చేర్పు లతో తయారుచేయమని జంధ్యాలకు అప్పగించారు. కథ తయారు అయ్యింది. అడవిసొత్తును అక్రమంగా అమ్ముకునే నాగభూషణం ఇందులో విలన్ గా చేసారు. వారి ఆటకట్టించడానికి వచ్చిన ఆఫీసర్ గా ఎన్ టి ఆర్ అక్కడ గిరిజనులలో మార్పు తీసుకు రావడం వంటివి చిత్రంలో కన్పిస్తాయి. వేటూరి ఎన్ టి ఆర్ కు అన్నిపాటలు రాసిన చిత్రం. కె.వి.మహాదేవన్ అద్బుతమైన ట్యూన్లు ఇచ్చారు. ఇద్దరు హీరోయిన్లు జయప్రధ, జయసుధలు ఎన్ టి ఆర్ తో తొలిచిత్రం ఉత్సాహంగా నటించారు.

అటవీ ప్రాతంలో నాగభూషణం, కొడుకు సత్యనారాయణతో కలిసి కలప స్మగ్లింగు, అక్రమ జంతు రవాణా వంటి వ్యాపారాలు చేస్తూ అక్కడి ప్రజల్ని దోపిడీ చేస్తుంటాడు. రాము (రాముడు, ఎన్.టి.ఆర్) ప్రజల పక్షాన నాగభూషణాన్ని ఎదుర్కుంటాడు. అక్కడి ప్రజలలో చైతన్యం తెస్తాడు. అటవీ శాఖాధికారి కూతురు జయప్రద అతన్ని ప్రేమిస్తుంది. అక్కడి గూడెంలో ఉండే యువతి (జయసుధ) రామూను అన్నగా ప్రేమిస్తుంది. మొదట అపార్ధం చేసుకున్న జయప్రద తర్వాత నిజం తెలుసుకుంటుంది. రాము అడవిలో ఉంటే తమకు ఇబ్బంది అని నాగభూషణం బృందం రాము ని అడవి నుంచి పంపించి వేయటానికి గూడెంలోఉన్న శ్రీధర్ ను వాడుకుంటారు. ఐతె రాము అక్కడి విషయాలు తెలుసుకోవడానికి మామూలు వ్యక్తిగా వచ్చిన ఫారెస్ట్ ఆఫీసరని వారెవరికి తెలియదు. చిత్రం రెండవ సగంలో కథ రాము ఫ్లాష్ బాక్, ఇంకా విలన్ల ఆట కట్టించడం.

అప్పటి వరకు ఉన్న ఎన్ టి రామారావు ఇమేజిని మారుస్తూ, ఆహార్యం, దుస్తులు మార్పులు చేసి రాఘవేంద్రరావు కొత్త ఎన్ టి రామారావును చూపించారు. రామారావు ఇంట్రడక్షన్ నుండి హీరోఇజమ్ ప్రదర్శితమౌతూ వస్తుంది.

అడవుల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎన్ టి ఆర్ దృష్టిలో కారా కిల్లీ డబ్బా కన్పించింది. దాన్ని అందుకుని పది పదిహేను కిళ్లీలకు సరిపడా మసాలాలు అన్ని బంగలా ఆకుల్లో కలిపి చుట్టేసి నోట్లోవేసుకుని నమిలేస్తుంటే యూనిట్ ఠారెత్తి పోయింది. అప్పటికే ఎన్ టి ఆర్ వయస్సు 54. తిన్నదేమో పండా సుబుద్ది కారాకిళ్లీ . అదివాసన చూస్తేనే కళ్లు తిరిగి మైండ్ బ్లాక్ అయిపడి పోవాలి. అలాంటిది పది పదిహేను కిళ్లీల పట్టును పట్టేసారు. ఎన్ టి ఆర్ నములుతూనే లేచినిలబడి పచార్లు చేస్తుంటే పడిపోగలరని పక్కకు కొందరు చేరారు. ఒకరిద్దరు నీళ్లు అందించారు. నమిలేసిన వ్యర్దం ఉమ్మేస్తాడనుకుంటే చక్కగా మింగేసి చెంబుడు నీళ్లుతాగేసి షాట్ రెడీయా అని అడిగే సరికి యూనిట్ బిక్కముఖాలు వేసారు. ఇలా ఎన్ టి ఆర్ సరదా సందడిగా షూటింగ్ లో పాల్గొ న్నారు. ఎన్ టి ఆర్ పారితోషికం ఈ చిత్రంతోనే 12 లక్షలకు ఎదిగారు.

నాగభూషణం, సత్యనారాయణ, రాజబాబు, శ్రీధర్ ఇతర నటులు నటించారు. ఇక్కడే ఎన్ టి ఆర్ శ్రీధర్ ను చూసి తనుతీస్తున్న శ్రీరామ పట్టాభిషేకంలో గుహుడుగా వేయమన్నారు. నేను హీరోగా ఎదగాలనుకుంటున్నానని చెప్పుకుంటే గుహుడుకి ఒకపాట ఉంటుంది. అలాగే డ్రయవర్ రాముడులో సెకెండ్ హీరో ఇస్తామన్నారు. ఒప్పుకోక తప్పలేదు.

జయప్రదకు ఈ చిత్రంతో వెనక్కి చూడకుండా ముందుకు సాగిపోయేలా చిత్రపరంపర వచ్చి పడింది. ఆమె ఉంటే చాలు చిత్రవిజయం తేలిక అవుతుం దనేంత ఎత్తుకు ఎదిగిపోయింది. జయసుధ పరిస్థితి అదే. రాఘవేంద్రరావు సూపర్ డూపర్ హిట్ డైరెక్టర్ గా నమోదు అయ్యింది ఈ చిత్రంతోనే.

28-4-77లో విడుదలయిన ఈ చిత్రం 100 రోజులు 32 కేంద్రాలు కలెక్షన్స్‌తో ఆడింది. అలాగే 175 రోజులు 16 సెంటర్లు, ఏడాదిపాటు 4సెంటర్లు రికార్డులు సృష్టించాయి. 4 కోట్లులాభాలు తెచ్చిపెట్టాయి.

అడవి రాముడు సినిమా అప్పట్లో ఒక ప్రభంజనం. వసూళ్ళలో తెలుగు సినిమా చరిత్రలోనే ఒక చరిత్ర. ఆ రోజుల్లో అడవి రాముడు సాధించిన కమర్షియల్ రికార్డులు దక్షిణాదితో పాటు, ఉత్తరాది సినీసీమ వారిని కూడా ప్రాంతీయ తెలుగు సినిమా పరిశ్రమ వైపు కళ్ళువిప్పార్చి చూసేలా చేసింది. అప్పటి దాకా తెలుగు సినిమా వసూళ్ళు కోటి మార్కును దాటింది – కేవలం రెండే రెండు సినిమాలు. మొదటిది… ఎన్ టి ఆర్ ‘లవకుశ’. రెండోది ఎన్ టి ఆర్ స్వీయ దర్శకత్వంలో మూడు పాత్రలు నటించి, నిర్మించిన ‘దాన వీర శూర కర్ణ’. రెండూ పౌరాణికాలే.

కానీ, తొలిసారిగా సాంఘిక కథా చిత్రమైన ‘అడవి రాముడు’ ఏకంగా 4 కోట్ల గ్రాస్ సాధించి, అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఏకంగా ఏడాది పాటు ఏకధాటిగా ఆడింది. జనం క్యూలు కట్టి, ఆ సినిమా చూశారు. తెలుగు సినిమా స్టామినా ఎంత ఉందో తొలిసారిగా బాక్సాఫీస్ వద్ద రుచి చూపించింది. ఎన్ టి ఆర్ ‘అడవి రాముడు’ ఇచ్చిన ఆ భరోసాతో భారీగా సినిమాలు తీయడానికి దర్శక, నిర్మాతలు ధైర్యం చేశారు. తెలుగు సినిమాల వసూళ్ళూ ఆ దామాషాలో భారీగా పెరిగాయి. అలా తెలుగు సినిమాల్లో నిర్మాణవ్యయం, దానికి తగ్గట్లే వసూళ్ళూ పెరగడానికి కూడా ‘అడవి రాముడు’ మూలమైంది.

41 ఏళ్ళ క్రితం అప్పటి తెలుగు జనాభా, టికెట్ రేట్లు, రూపాయి విలువ లెక్కల్ని ఇప్పటి లెక్కలతో పోల్చి చూస్తే, అడవి రాముడు ఇవాళ దాదాపు 500 కోట్ల వసూల్ సినిమా అని సినీ వ్యాపార వర్గాల అంచనా. అన్నట్లు సినిమా రిలీజై ముప్ఫై ఏళ్ళు గడిచిన తరువాత కూడా మొన్న మొన్నటిదాకా దాదాపు 15 సరికొత్త ప్రింట్లతో రిపీట్ రన్ లు ఆడిన ఏకైక పాత చిత్రమూ ఇదే. అందుకే, హాలీవుడ్ పద్ధతిలో తెగిన టికెట్లు, చూసిన ప్రేక్షకుల సంఖ్యను బట్టి చూస్తే, అత్యధిక వ్యూయర్ షిప్ సాధించిన సినిమాగా, ‘అడవి రాముడు’ది అభేద్యమైన రికార్డని ట్రేడ్ విశ్లేషణ.

ఈ చిత్రంలో షోలేలో కొన్ని సన్నివేశాలు (రోహిణిని విలన్లు చంపడం, రామును గూడెం నుండి వెళ్ళి పొమ్మని శ్రీధర్ బెదిరించే సన్నివేశం, కాకరాల రామారావును అక్కడే ఉండమనడం, జయప్రద రాము కోసం గుడిలో ప్రార్ధించడం, జయసుధ వెనకనుండి మాట్లాడటం, జయసుధ, జయప్రదలను గుర్రపు బండిమీద సత్యనారాయణ వెంటాడటం ) తీసుకున్నారు. షోలే చిత్రం మహారాష్ట్ర లో 3 సెంటర్లలో 365 రోజులు ఆడగా, అడవిరాముడు మన రాష్ట్రం లో 4 సెంటర్లలో 365 రోజులు ఆడింది.

ఆ తర్వాత ఎన్ టి ఆర్ తో లారీ డ్రయివర్ సినిమా తీయాలనుకున్నారు. అదేకథను తాను తీస్తున్నానని ఎన్ టి ఆర్ కాదనేసారు. అక్కడితో ఎన్ టి ఆర్ తో చిత్రం మరి తీయలేక పోయారు. తర్వాత ఇతర హీరోలతో తీసారు. ఈ నిర్మాతలు మొత్తం 9 చిత్రాలు తీసారు.

వేటూరి సుందర రామ మూర్తి గారు ఈ చిత్రంలో అన్ని పాటలూ వ్రాసారు. పాటలన్నీ జనరంజకమైనవే. చాలా కాలం వూరూరా మారు మ్రోగాయి.

చాలామంది ఈ సినిమా కేవలం కమర్షియల్ సినిమా అనుకుంటారు కానీ, హిందీ మిత్రులు షొలే గురించి చెప్పినట్టు, అడవి రాముడు సినిమా చక్కని వినోదాత్మక సినిమా.

ఆ సినిమా గురించిన మరిన్ని విశేషాలు : courtesy 23-04-2017 ఆంధ్ర జ్యోతి లోని నవ్య ప్రచురణ (డా: రెంటాల జయదేవ్ గారు ).

1. బాక్సాఫీస్ రాముడు

ఎన్ టి ఆర్ సాధారణంగా ఒక గిరి గీసుకొని, సినిమాలు చేస్తుంటారు. మిగిలిన చాలామంది తారల లాగా ఆయన గనక గిరి దాటి నటిస్తే… ఇక ఆ సినిమా ఒక ప్రభంజనమే! – ప్రసిద్ధ దర్శక – నిర్మాత స్వర్గీయ బి.ఎన. రెడ్డి

1970ల తొలినాళ్ళలో ఎన్ టి ఆర్ మీద ప్రత్యేక సంచిక వేస్తున్న ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ అప్పట్లో బి.ఎన్.రెడ్డి ఈ మాటలు అన్నారు.

ఆ తరువాత కొన్నేళ్ళకు…ఎన్ టి ఆర్ కు అయిదున్నర పదుల ఏళ్ళు మీద పడ్డాయి. కెరీర్ జోరుగా సాగుతున్నా… ఎక్కడో చిన్న స్తబ్ధత. నవరసాల్లో ఏదైనా పండించగల అభినయ ప్రతిభ… అపారమైన మాస్ ఇమేజ్ ఉన్న ఒక స్టార్ హీరో ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది? ఏది ప్రేక్షకులు కొత్తగా ఫీలవుతారు? సరిగ్గా అదే టైమ్‌లో కేవలం మూడే సినిమాల అనుభవమున్న ఒక యువ దర్శకుడికి ఎన్ టి ఆర్ సినిమా చేసే అరుదైన ఛాన్స్… ఇంకా చెప్పాలంటే అదృష్టం తలుపు తట్టింది. అంతే… అప్పటికి సరైన హిట్లు కూడా లేని ఆ యువకుడు బోలెడంత హోమ్ వర్క్ చేశాడు. ఒక స్టార్ హీరోకు ఎలాంటి కథ, కథనం, వాణిజ్య అంశాలున్న సినిమా అయితే కరెక్టో కసరత్తు చేశాడు. సినిమా నేపథ్యం నుంచి ఆట, పాట, డ్రెస్సులు అన్నీ మార్చాడు. ఎన్ టి ఆర్ కూడా గిరి దాటి, బాక్సాఫీస్ బరిలో గర్జించారు.

సినిమా రిలీజైంది. అంతే… ఏ థియేటర్ దగ్గర చూసినా కిటకిటలాడే జనం. ఆగకుండా వేస్తున్న షోలు వేస్తూనే ఉన్నారు… చూస్తున్న జనం చూస్తూనే ఉన్నారు… టికెట్లు దొరక్క అంతకు అంతమంది జనం వెనక్కి వెళుతూనే ఉన్నారు.

టికెట్ల కోసం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నారు. వంద రోజులు… రెండొందలు… మూడొందలు…ఏకంగా ఏడాది ఆడిందా సినిమా.
వెరసి… వసూళ్ళ సునామీ….

బాక్సాఫీస్ దగ్గర ఒక కొత్త చరిత్ర… హీరోగా ఎన్ టి ఆర్ మాస్ ఇమేజ్‌కు మరో సరికొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం…

రిలీజైన అయిదో సినిమాకే ఆ డైరెక్టర్‌కు స్టార్ స్టేటస్… ఇవాళ్టికీ జనం చెప్పుకొనే ఆ సినిమా… ‘అడవి రాముడు…’

అప్పటి ఆ యంగ్ డైరెక్టర్…. కె.రాఘవేంద్రరావు…

కట్ చేస్తే… ఇప్పుడు ఆ సినిమాకు 41 ఏళ్ళూ నిండాయి.

అయినా సరే ఆరు పాటలు, అయిదు ఫైట్లు… మాస్ మెచ్చే వినోదం… స్టార్ హోదాను పెంచే చిత్రీకరణ… ఇలా కమర్షియల్ ఫార్ములాలన్నిటికీ ఇవాళ్టికీ ఆ సినిమాయే ఓ పెద్ద బాలశిక్ష.

పాట… ఫైటు… ఇంటర్వెల్ లాక్… బ్లాస్టింగ్, ఫైట్స్‌తో యాక్షన క్లైమాక్స్… ఇలా ఆ సినిమా రీలు రీలుకీ వేసిన కొలతల గీతలు దాటి రావడం 41 ఏళ్ళూ గడిచినా తెలుగు సినిమా వల్ల కావడం లేదు.

తెలుగు సినిమా బాక్సాఫీస్ గరిష్ఠ వసూళ్ళను తొలిసారిగా నాలుగింతలు చేసి, నాలుగు కోట్ల మార్కు తాకిందా సినిమా. తెలుగు సినిమా గ్రామర్నే మార్చేసింది.

అందుకే, ఒక్క మాటలో… అది ‘అడవి రాముడు’ కాదు… అక్షరాలా తెలుగు సినిమాకు బాక్సాఫీస్ రాముడు.

2. అది అన్నగారి చలవే! – కె. రాఘవేంద్రరావు

అడవి రాముడు సినిమా అనగానే అన్నగారు ఎన్ టి ఆర్ గారు, పూర్తిగా ఔట్‌డోర్‌లో అడవిలో ఆ సినిమా చిత్రీకరణ, ఆ సినిమా అవకాశం నాకు వచ్చినప్పటి పరిస్థితులు… ఇలా ఎన్నెన్నో జ్ఞాపకాలు. అసలు సినిమా రంగంలో నా ప్రయాణం మొదలైందే… ఎన్ టి ఆర్ తో. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన మొదటి సినిమా ఎన్ టి ఆర్ భీముడిగా నటించిన ‘పాండవ వనవాసం’. కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలోని ఆ సినిమాలో హనుమంతుడి విశ్వరూపాన్ని చూస్తూ, భీముడి పాత్రలో ఎన్ టి ఆర్ ‘మనోజవం మారుతతుల్యవేగం…’ అంటూ పాడే పద్యం షాట్‌తో నా కెరీర్ మొదలైంది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఆ షాట్‌కు ఎన్ టి ఆర్ మీద తొలిసారిగా నేను క్లాప్ కొట్టిన క్షణాలు ఇప్పటికీ మర్చిపోలేను. డైరెక్టర్ అయ్యాక కెరీర్లో కిందా మీదా పడుతున్న టైమ్‌లో సత్యచిత్ర అధినేతలు నా దగ్గరకొచ్చి, ఎన్ టి ఆర్ తో సినిమాకు దర్శకత్వం చేయాలంటే, నమ్మలేదు. ఎన్ టి ఆర్ గారికి చెప్పారా, ఏమన్నారని అడిగాను. ఆయనకు చెబితే, ఓకే అన్నారన్నారు. సత్యచిత్ర బ్యానర్‌పై తీసిన తొలి చిత్రం మా నాన్న గారి ‘తాసిల్దారు గారి అమ్మాయి’. ఆ సినిమాకు నేను అసిసెంట్ డైరెక్టర్ని. అందుకని, వాళ్ళతో నాకు మంచి అనుబంధం ఉంది. అదే సమయంలో ఎన్ టి ఆర్ కు సినిమా అనగానే ఎలాంటి కథ చేయాలా అని ఆలోచించా. సాఫీగా లేని నా కెరీర్‌కు దక్కిన గోల్డెన ఛాన్స్‌ను ఎలా సద్వినియోగం చేసుకోవాలా అని కసరత్తు చేశా.

మద్రాసు నుంచి బయల్దేరి ఆంధ్రా వెళ్ళి అప్పుడు ఆడుతున్న అన్న గారి సినిమాలన్నీ చూశా. జనం పూలుచల్లి హారతులిచ్చే ఘట్టాలు గమనించాను. అప్పట్లో ఎన్టీయార్ గారికి అంత ఆరాధన. అయితే, ఆయన స్టెప్పులు అంతగా వేసేవారు కాదు కాబట్టి, సోషల్ సినిమాల్లో పాటల్లో జనాన్ని కుర్చీకి కట్టిపడేసేలా అష్టదిగ్బంధనం చేయాలనుకున్నా. స్టార్ హీరోకూ, ఆయన ఇమేజ్‌కూ తగ్గట్లు సినిమా చేస్తున్నప్పుడు ఏయే అంశాలు కథలో పెట్టాలి, ఎలాంటి సీన్లు తీసి ఇమేజ్ను పెంచి చూపించాలి లాంటివన్నీ ఆలోచించా. హీరోకు మైనస్ అనుకున్న అంశాలు ప్లస్ అయ్యేలా చేయాలి. ప్లస్‌లను డబుల్ ప్లస్ చేయాలని నిర్ణయించుకున్నా. ఎన్ టి ఆర్ తెరపై నడిచొస్తుంటూనే జనం పూలు చల్లుతున్నారంటే, అదే ఆయన గజారోహణం చేసి, ఏనుగు మీద వస్తేనో అనుకున్నా. అలా ఉండాలంటే, హీరో అడవిలో ఉండాలి. జంతువులతో సినిమాలకు ఫేమస్ అయిన దేవర్ ఫిల్మ్ సంస్థ తీసిన జంతువుల సినిమాలన్నీ చూశా. ట్రైనింగ్ అయిన సర్కస్ ఏనుగుల్ని పెట్టుకొని, అవి ఏవేం పనులు చేయగలవో చూసి, వాటికి తగ్గట్లు ఆ రకంగా సీనుల్లో రాసుకున్నాం. ఎన్ టి ఆర్ ను ఏనుగు మీద ఎక్కించడానికని ఆయనను ముందస్తుగా మానసికంగా సిద్ధం చేయడం కోసం ఆయన సెట్స్‌లోకి వచ్చే టైమ్‌కి నేను, మా అసిస్టెంట్ డైరెక్టర్లు అక్కడ ఏనుగుల మీద తిరుగుతూ ఉండేవాళ్ళం. ఎన్టీయార్ కూడా ఏనుగును సులభంగా మచ్చిక చేసుకొని, దాని మీద తిరుగుతూ, అద్భుతమైన షాట్స్ చేశారు.

ఈ సినిమాను చావో రేవో అనుకున్నా కాబట్టి, ఏమైతే అది అయిందని నాకు తెలిసిన ఫార్ములాలన్నీ ఇందులో పెట్టేశా. పౌరాణికాలకు ఎన్టీయార్ ఫేమస్ కాబట్టి, అడవి జనుల్లో గొప్పవాళ్ళయిన వాల్మీకిగా మారిన బోయవాడు, ఏకలవ్యుడు, అటవీ కాంత శబరి ఎంగిలి తిన్న శ్రీరాముడు లాంటి గెటప్పులు వేయించాలని ఫిక్సయ్యా. అలా వచ్చిందే… ‘కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు’ పాట. ఫేమస్ ఐ.పి.ఎస్. అధికారి సురేంద్రబాబు అప్పట్లో ఒకసారి నాతో మాట్లాడుతూ, ‘ఆ పాట నాకెంతో ఇష్టం. ఎప్పుడూ ఆ పాట వినేవాణ్ణి. దట్ మేడ్ మి టు కమ్ ఇన టు దిస్ ఫీల్డ్’ అని చెప్పారు. ఒక సిన్సియర్ పోలీసు అధికారిని తయారు చేయడాన్ని మించి ఒక సినిమాకూ, పాటకూ పరమార్థం ఏముంటుంది!

ఈ సినిమాకు నేను అందుకొన్న మర్చిపోలేని ప్రశంసలు రెండు. సినిమా షూటింగ్ పూర్తవుతున్నప్పుడు మళ్ళీ నాకు ఆయనతో అవకాశం వస్తుందో, రాదో అని ఎన్ టి ఆర్ తో శ్రీరాముడి గెటప్ వేయించి, ‘కృషి ఉంటే మనుషులు…’ పాటలో పెట్టా. ఆ షాట్ అయిపోయాక, ఆయన్ని కారు ఎక్కిస్తూ, కళ్ళు చెమ్మగిల్లుతుండగా ఆయన కాళ్ళకు నమస్కారం చేశాను. ఎన్ టి ఆర్ కూడా ఎమోషనల్ అయి, నన్ను భుజం తట్టి, అడవిలో 35 రోజులుగా చేసిన షూటింగ్‌ను ప్రస్తావిస్తూ, ‘ఇటీజ్ ఎ గ్రీన్ మెమరీ ఇన మై లైఫ్ బ్రదర్’ అన్నారు. ఆ ప్రశంస నేనెప్పటికీ మర్చిపోలేను. అలాగే, మద్రాసులోని మౌంట్‌రోడ్డు ఆనంద్ థియేటర్లో అడవి రాముడు ప్రివ్యూ వేశాం. దేవర్ ఫిల్మ్స్ అధినేత చిన్నప్ప దేవర్ చూసి, బయటకొస్తూనే నన్ను ఆనందంగా కౌగలించుకొని, ‘తంబీ! ఇంద మాదిరి పడం ఎన్నాల కూడ ఎడక ముడియాదు’ (తమ్ముడూ! ఇలాంటి సినిమా నేను కూడా చేయలేను) అన్నారు. ఇప్పటికీ ఆ మాటలు గుర్తే!

పాటలకు జనం లేవకూడదనే ఉద్దేశంతో ఆరేసుకోబోయి… పాటలో చెట్టు చాటు నుంచి జయప్రద చేతులు ఊపే దృశ్యం లాంటివి పెట్టాం. అది జనానికి బాగా పట్టింది. రిలీజ్ టైమ్‌కి నేను ప్రేమలేఖలు సినిమా పోస్ట్ ప్రొడక్షన పనిలో ఉన్నా. లోపల టెన్షన. ఇంతలో ఎన్నడూ లేనిది… పాటలకు జనం లేచి హుషారుగా తెరపైకి నాణాలు విసరడం చూసి, విజయవాడ నుంచి అప్సర థియేటర్ వాళ్ళు, డిసి్ట్రబ్యూటర్లు, నిర్మాతలు నాకు ఫోన చేసి మరీ అభినందించారు. అర్జంట్‌గా రావాలంటే, అపుఁడు నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు గారికి చెప్పి, ఒక రోజు బ్రేక్ తీసుకొని, విజయవాడకు వెళ్ళి చూసి వచ్చా. సినిమా శతదినోత్సవం 1977 ఆగస్టు 5న విజయవాడలోనే అప్సర థియేటర్లో చేశాం. ఏలూరు రోడ్డు అంతా ఇసకేస్తే రాలని జనం. అన్నగారిని చూడాలని అంతా గోల చేస్తుంటే, అప్పుడు నేల, బెంచీ టికెట్ కౌంటర్ మీదకు అన్నగారినీ, అందరినీ ఎక్కించి, జనానికి అభివాదం చేసేలా చూశాం.

‘అడవి రాముడు’ హిట్టయ్యాక నేను నా మొదటి కారు కొన్నా. ఆ అంబాసిడర్ కారు తీసుకొని, అన్న గారు షూటింగ్లో ఉంటే, ఆయన దగ్గరకెళ్ళా. ‘మీ దయ వల్ల కారు కొన్నా. ఫస్ట్ మీరు నడపా’లని కోరా. ఆయన చాలా ఆనందంగా అందరితో ఆ సంగతి పంచుకొని, కారులో నన్ను పక్కనే కూర్చోబెట్టుకొని, ఏ.వి.ఎం. స్టూడియో గేటు దాకా కారు నడిపారు. అది తలచుకుంటే నాకిప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. తీపిగుర్తుగా ఆ కారు ఇప్పటికీ, మా ఆఫీసు బేస్మెంట్లో భద్రంగా ఉంచుకున్నా.

‘అడవి రాముడు’ నుంచి ఎన్ టి ఆర్ రాజకీయాల్లోకి వెళ్ళే లోగా కేవలం అయిదేళ్ళలో 11 సినిమాలు ఆయనతో చేసే అవకాశం నాకు దక్కింది. ఆ తరువాత ఆయన నటించిన ఆఖరు చిత్రం ‘మేజర్ చంద్రకాంత’ మా కలయికలో ముచ్చటగా 12వ సినిమా. మా కాంబినేషనలోని 12 సినిమాల్లో 6 బ్లాక్బస్టర్లు, 7 సిల్వర్ జూబ్లీలు ఉండడం ఇప్పటికీ పెద్ద రికార్డ్ అని అందరూ చెబుతుంటారు. దీనికి బీజం వేసింది అడవి రాముడే కదా! నా కెరీర్‌ను బంగారు మలుపు తిప్పిన అడవి రాముడునీ, అన్న ఎన్ టి ఆర్ నీ ఎప్పటికీ మర్చిపోలేను. నేనిలా ఉండడడానికి ‘అడవి రాముడు’, అన్న గారే కారణం.

అడవి రాముడుకు అన్న గారి గుండెల్లో కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళి, సీఎం అయ్యాక, అబిడ్స్‌లోని ఆయన గదిలో ఆయనకు ఎదురుగా శ్రీమతి బసవతారకం గారు జ్యోతి పుచ్చుకున్న పటం, వెనకాల వెంకటేశ్వరస్వామి పటం, టేబుల్ మీద పద్మావతీ వెంకటేశ్వరుల పటం మాత్రమే ఉండేవి. ఆ పక్కనే మాత్రం ‘అడవి రాముడు’ విజయోత్సవానికి గుర్తుగా వెండి ఏనుగు మీద ఆయన కూర్చున్న షీల్డ్ ఒక్కటే ఉండేది. ఆ గదిలో మరేమీ ఉండేవి కావంటే, ఆ సినిమాకు ఆయన ఇచ్చిన స్థానం అర్థం చేసుకోవచ్చు.

3. అందుకే టైటిల్స్ లో అలా వేసాం

ఆరుమిల్లి సూర్యనారాయణ, అడవి రాముడు నిర్మాతల్లో ఒకరు

అడవి రాముడు చిత్రం నిర్మించడం… గ్రేటెస్ట్ థింగ్ ఇన మై లైఫ్ అంటాను. ఆ సినిమాకు సంబంధించి ప్రతి క్షణం, ప్రతి సంఘటన, సినిమా రిలీజయ్యాక దక్కిన అపూర్వ విజయం… ఇలా ప్రతీదీ మెమరబులే. ‘అడవి రాముడు’ తీయడానికి కొన్నేళ్ళ ముందు బెంగుళూరులో ‘గంధద గుడి’ అనే కన్నడ హిట్ సినిమా చూశా. అడవి నేపథ్యంలో అలాంటి భారీ సినిమా తీయాలని నా కోరిక. అందుకని ఆ నేపథ్యం తీసుకొని, రచయిత ముళ్ళపూడి వెంకట రమణ గారితో కలసి ఇద్దరు హీరోల కథలా ఒక అవుట్‌లైన్ తయారు చేయించా. కానీ, మా రెగ్యులర్ హీరో శోభనబాబు గారు చాలా రోజులు అడవిలో షూటింగా అని ఇష్టం చూపించలేదు. ఆ తరువాత ఎన్ టి ఆర్ ‘ఆరాధన’, మేము శోభనబాబుతో తీసిన ‘ప్రేమబంధం’ సినిమాపై రిలీజైనప్పుడు మేము దెబ్బతిన్నాం. ఆ తరువాత ఎన్ టి ఆర్ గారు పిలిచి, సినిమా చేద్దామన్నారు. అలా ఈ అడవి రాముడు ప్రాజెక్ట్ పట్టాలెక్కింది.

మద్రాసుకు వచ్చినప్పటి నుంచి మాకు మంచి ఫ్రెండ్ అయిన రాఘవేంద్రరావును దర్శకుడనుకున్నాం. ఎన్ టి ఆర్ గారూ ఒప్పుకున్నారు. అది 1976 మార్చి 31. నేను వెళ్ళి రాఘవేంద్రరావుతో చెబితే, మొదట నమ్మలేదు. ఏప్రిల్ పూల్ జోక్ అనుకున్నాడు. నిజం తెలిశాక, ఆనందించి, ఎన్ టి ఆర్ ఇమేజ్‌కి తగ్గట్లు, కథ, కథనం, పాటలు… ఇలా ప్రతిదీ ఆలోచించాడు. మొదట గొల్లపూడి మారుతీరావుతో డిస్కస్ చేశాం. సినిమాలోని ఇంటర్వెల్ పాయింట్ గొల్లపూడి కంట్రిబ్యూషనే. ఇక, సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే గుమ్మడి ఎపిసోడ్ కావిలిపాటి విజయలక్ష్మి గారి కథలోది. ఆలిండియా రేడియోలో గొల్లపూడి బిజీగా ఉండడంతో, లాభం లేదని మా ‘ప్రేమబంధం’కి పనిచేసిన జంధ్యాలను రంగంలోకి దింపా. అతుకులుగా ఉందనుకున్న కథకు హీరోయిన తండ్రి జగ్గయ్య హార్ట్ టచింగ్ ఎపిసోడ్‌తో మంచి బలం ఇచ్చింది జంధ్యాల. అంతమంది రచయితలకూ పారితోషికం ఇచ్చాం. అయితే, రాఘవేంద్రరావు సలహా మేరకు టైటిల్స్‌లో కథకు ‘సత్యచిత్ర’ అని వేసేశాం.

1976 మార్చి చివర అనుకున్న ప్రాజెక్ట్ ఇది. అడవిలో షూటింగ్‌కి ఎన్ టి ఆర్ గారి బల్క్ డేట్స్ కోసం నవంబర్ నుంచి చిత్రీకరణ అనుకున్నాం. ‘దాన వీర శూర కర్ణ’ వల్ల మాది జనవరిలో మొదలైంది. అప్పట్లో మద్రాసు హైకోర్టులో న్యాయమూర్తి అయిన జస్టిస్ నటరాజన నాకు బాగా ఫ్రెండ్. ఆయన చెప్పడంతో, అటవీ అధికారులు సరే అని మాకు ముదుమలై అడవుల్లో అన్ని రోజుల షూటింగ్‌కు అనుమతించి, బాగా సహకరించారు. ఇక, సినిమా సెన్సారింగ్ కూడా నాకు బాగా గుర్తు. సెన్సారింగ్‌లో ఆ రోజు రచయిత్రి మాలతీ చందూర్ ఉన్నారు. ఆమె చాలా టఫ్. ఏం కట్స్ చెబుతారో, ఏమిటో అని నేను కంగారుపడ్డా. కానీ, ఆవిడ బయటకొస్తూనే, ‘కృషి ఉంటే మనుషులు…’ పాట గురించి ఎంతో మెచ్చుకున్నారు. ఎంత మంచి సినిమా తీశారండీ అని ప్రశంసించారు. ఆ పాట, గెటప్స్ ఆలోచన… అంతా రాఘవేంద్రరావుదే. తరువాత ఎన్నో సినిమాలు తీసినా, ‘అడవి రాముడు’ఇచ్చిన పేరు, గుర్తింపు వేరు. ఇప్పటికీ ఆ సినిమా పేరు మీదే బతుకుతున్నా.

4. లైఫ్ టర్నింగ్ ఫిల్మ్!

విన్సెంట్ కెమెరా పనితనం సినిమాకు పెద్ద ఎస్సెట్ అయిన ‘అడవి రాముడు’ చిత్రం తెలుగు సినిమాతో పాటు చాలామంది ప్రముఖుల కెరీర్‌నే మార్చేసింది. ఈ సినిమా హిట్ తరువాత రాజకీయాల్లోకి వెళ్ళడానికి ముందు వరకు అయిదేళ్ళ పాటు ఎన్ టి ఆర్ సినిమా కెరీర్, ఆయన చేసిన ‘సర్దార్ పాపారాయుడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి’ లాంటి సూపర్ హిట్లన్నీ మరో ఉజ్జ్వల చరిత్ర. ఈ సినిమా ఘనవిజయంతో కృష్ణ, కృష్ణంరాజు లాంటి అప్పటి అగ్ర హీరోల సినిమాలకూ, భారీతనం నిండిన కమర్షియల్ సినిమాలకూ డైరెక్టర్ రాఘవేంద్రరావు కేరాఫ్ అడ్రస్ అయ్యారు. అప్పటి నుంచి అయిదేళ్ళలో ఎన్ టి ఆర్, రాఘవేంద్రరావుల కాంబినేషనలోనే ఏకంగా 11 సినిమాలు రావడం విశేషం.

అప్పటికే, బాలచందర్ ‘అంతులేని కథ’, కె. విశ్వనాథ్ ‘సిరిసిరి మువ్వ’ హిట్స్‌తో విజయప్రదగా మారిన నటి జయప్రద ఏకంగా ఎన్ టి ఆర్ తో నటించి, స్టార్ హీరోయిన్ అయిపోయారు. అలాగే, అప్పటి దాకా కథా ప్రధాన చిత్రాల్లో, చిన్న హీరోల సరసనా ఎక్కువగా కనిపిస్తూ వచ్చిన జయసుధ స్టేటస్సే ఈ సినిమాతో మారిపోయింది. ఇక సిరిసిరిమువ్వ లాంటి మ్యూజికల్ హిట్స్‌కు సంగీత, సాహిత్య ప్రధానమైన గీతాలు రాసినా, అడవి రాముడు లాంటి స్టార్ హీరో సినిమాలో అన్ని పాటలూ రాసే అవకాశం రావడం వేటూరికి అదే ఫస్ట్ టైమ్. ఆ ఛాన్స్‌ను అద్భుతంగా ఉపయోగించుకున్న వేటూరి, ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను…’ లాంటి పాటలతో తన పాళీకి రెండో వైపూ పదునేనని నిరూపించారు. అలాగే, అప్పటి దాకా సినీ రంగంలో ఘంటసాల తరువాత స్థానం గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణ తదితరుల మధ్య ఎవరిదనే దోబూచులాట ఉండేది. కానీ, ‘అడవి రాముడు’ పాటలు ఊరూ వాడా మారుమోగడంతో, విషయం స్పష్టమైంది. ఎస్పీబీ తిరుగులేని స్టార్ సింగర్‌గా అవతరించారు. అప్పటి నుంచి ఎన్ టి ఆర్ తో పాటు అక్కినేని, తదితర స్టార్ హీరోల పాటలంటే సింగర్‌గా ఎస్పీబీ ఫస్ట్ ఛాయిస్ అయ్యారు.

విలన్ నాగభూషణ నోట వచ్చే ‘చరిత్ర అడక్కు.. చెప్పింది విను….’ లాంటి డైలాగులు జనం నోట నానుడిగా మారడంతో మాటల రచయిత జంధ్యాల రాతే మారిపోయింది. ఆయన మార్కు కామెడీకీ, డైలాగ్లకూ ఒక కొత్త ఊపూ వచ్చేలా చేసిందీ సినిమా. డ్యాన్స్ మాస్టర్ సలీమ్ స్టెప్పులు కొత్త క్రేజ్ అయ్యాయి. అప్పటి దాకా చక్రవర్తి స్వరాలతో సావాసం చేసిన రాఘవేంద్రరావుకు సత్యచిత్ర సంస్థకు ఆస్థాన సంగీత దర్శకుడైన కె.వి. మహదేవనతో ‘అడవి రాముడు’ తొలి సినిమా. ఈ హిట్ బాణీలతో కె.వి. మహదేవన కొత్త తరంలోనూ దిగ్విజయ యాత్ర సాగించారు.

అటవీ నేపథ్యం, ఏనుగులు, పులులు, సింహాలు లాంటి జంతువులు, పూర్తి ఔట్‌డోర్ షూటింగ్, అగ్ర తారాగణంతో అప్పట్లో ‘అడవి రాముడు’ చాలా భారీ చిత్రం. నిర్మాణవ్యయం, ప్రింట్లు, పబ్లిసిటీ, డిస్ట్రిబ్యూషన్ కమీషన్ సహా వసూలై, సినిమా ఒడ్డున పడాలంటే 30 లక్షలు రావాలి. ఈ సినిమా విడుదల చేసే సమయానికి ప్రసిద్ధ డిస్ట్రిబ్యూషన్ సంస్థ లక్ష్మీ ఫిలిమ్స్ కూడా ఒడుదొడుకుల్లో ఉంది. అలాంటి టైమ్‌లో వచ్చిన అడవి రాముడు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 13 రెట్ల పైగా తేడాతో అధిగమించి, ఏకంగా 4 కోట్ల పైగా వసూలు చేసింది.

మూతపడే ప్రమాదంలో ఉన్న లక్ష్మీఫిలిమ్స్ సంస్థకు కనీవినీ ఎరుగని ఈ లక్ష్మీకటాక్షం ఓ పునర్జన్మ. అప్పటి నుంచి సినిమాల డిస్ట్రిబ్యూషన్ విధానం మారి, బయ్యర్ల పద్ధతి వేళ్ళూనుకొనే దాకా మళ్ళీ కొన్నేళ్ళ పాటు చలనచిత్ర పంపిణీ రంగాన్ని లక్ష్మీ ఫిలిమ్స్ ఏలింది.

అడవి రాముడు కమర్షియల్‌గా ఎంత హిట్టంటే… ఈ ప్రాంతీయ భాషా సినిమా కలెక్షన్ల గురించి జాతీయ సినీవర్గీయులు సైతం కంగారుపడి తల తిప్పి చూసేంత హిట్! ఆ రోజుల్లో సినిమా అంటే సాధారణంగా రోజుకు మూడు ఆటలే. ఆదివారాల్లో నాలుగు ఆటలు. అలాంటి రోజుల్లో ‘అడవి రాముడు’కు వస్తున్న ప్రేక్షకజన సందోహాన్ని తట్టుకోలేక నెల్లూరులోని కనకమహల్ థియేటర్లో ప్రతిరోజూ అయిదు ఆటలు వేశారు. అలా డైలీ అయిదు ఆటలతో ఆ థియేటర్లో ‘అడవి రాముడు’ ఏకంగా 102 రోజులు ఆడడం విశేషం.

వసూళ్ళ వాన ఎంతలా కురిసిందంటే, దాదాపు రిలీజైన ప్రతి కేంద్రంలోనూ ఈ సినిమా, అంతకు మునుపటి అత్యధిక వసూళ్ళ సినిమా రికార్డు కన్నా కనీసం మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ కలెక్ట్ చేసింది. ప్రతిచోటా ఈ అడవి రాముడు బాక్సాఫీస్ అద్భుతమైంది. విశేషం ఏమిటంటే, అంతకు ముందు ఎన్టీయార్ ‘లవకుశ’కూ, ఆ తరువాత మళ్ళీ ‘అడవి రాముడు’కే ఈ అద్భుతం జరిగింది. అటు పైన మళ్ళీ ఇప్పటి దాకా మరే తెలుగు సినిమాకూ ఇలా జరగలేదు.

తెలుగునాట ఉత్తరాంధ్ర, కోస్తా, తెలంగాణ, రాయలసీమ… ఇలా నాలుగు ప్రాంతాల్లోనూ ‘అడవి రాముడు’ 365 రోజులు ఆడింది. అలా తెలుగు గడ్డపై నాలుగు ప్రాంతాల్లోనూ ఏడాది ఆడిన సినిమా ఇవాళ్టికీ ఇదొక్కటే. అలాగే, ఒకే రాష్ట్రంలో ఎక్కువ సెంటర్లలో 365 రోజులు ఆడిన రికార్డు మొదట్లో హిందీ సినిమా ‘షోలే’కు ఉండేది. ఆ సినిమా మహారాష్ట్రలోని ముంబయ్, పుణే, నాసిక్… 3 కేంద్రాల్లో 365 రోజులు ఆడింది. అయితే, ఆ తరువాత వచ్చిన అడవి రాముడు ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఒకే రాష్ట్రంలో ఏకంగా 4 సెంటర్లలో (విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు) రెగ్యులర్ షోలతో 365 రోజులు ఆడి, కొత్త రికార్డు నెలకొల్పింది. విశేషం ఏమిటంటే, నలభై ఏళ్ళు గడుస్తున్నా, ఇప్పటికీ ఆ రికార్డు చెక్కుచెదరకుండా ‘అడవి రాముడు’ పేరు మీద ఉండడం! అడవి రాముడు పేరు ఇప్పటికీ చెప్పుకొనేది అందుకే!

5. కథలో సీక్రెట్ ఏమిటంటే…!

ఇవాళ్టి పరిభాషలో చెప్పాలంటే, ఈ చిత్ర కథాంశం ఆర్. నారాయణమూర్తి మార్కు గిరిజనోద్ధరణ. అమాయకుల్ని మోసం చేసి, అటవీ సంపదను దోచుకుంటున్న పెద్దల (నాగభూషణం, సత్యనారాయణ) ఆట కట్టించడానికి అడవిలోకి వచ్చిన ఒక సామాన్య కథానాయకుడు రాము (ఎన్ టి ఆర్) కథ ఇది. గిరిజనాభ్యుదయానికి పాఠశాలలు, చదువు లాంటి అంశాల్ని ప్రస్తావిస్తూనే, దానికి కథానాయకుడి తాలూకు వ్యక్తిగత జీవితంలోని పగ ప్రతీకారాల కోణం, హీరో ఇమేజ్, నిజానికి హీరో ఒక ఫారెస్ట్ ఆఫీసర్ అనే ఇంటర్వెల్ ట్విస్టు, మారువేషాలు… మాస్ మెచ్చే భారీ యాక్షన్ క్లైమాక్స్, పాటలు, ఫైట్లు, అడవి జంతువులతో విన్యాసాలు, కామెడీ లాంటి పంచదార పూతలన్నీ చేర్చి, ఫక్తు వాణిజ్య సినిమాగా అల్లడం ఈ చిత్ర దర్శక, రచయితల పనితనం. చిన్న కథను కథ కన్నా కథనబలంతో, హీరో ఇమేజ్‌నే కేంద్రంగా అల్లుకొన్న సన్నివేశాలతో దర్శకుడు అద్భుతంగా మెప్పించడం వెండితెర మేజిక్.

6. ఆల్ కూర్స్ చమా చమ్!

అడవి రాముడు కథలో కొత్తదనం కన్నా హాయిగా ఎంటర్టైన చేస్తూ, కదలకుండా కూర్చోబెట్టే లక్షణాలే ఎక్కువ. రాజ్‌కుమార్, విష్ణువర్ధన నటించిన కన్నడ హిట్ చిత్రం ‘గంధద గుడి’లోని అటవీ నేపథ్యం, అటవీ సంపదను దోచుకోవడం అనే ఎలిమెంట్స్‌ను ‘అడవి రాముడు’లో బాగా వాడుకున్నారు. అలాగే, హిందీ హిట్ చిత్రం ‘షోలే’ నుంచి టాంగాలో ఛేజింగ్ సీన్, పసివాడి మరణం సీన్ లాంటివే అచ్చు గుద్దినట్లు ‘అడవి రాముడు’లోనూ కనిపిస్తాయి. రకరకాల సినిమాలు చూసి, అందులోని సీన్ల ఇనస్పిరేషనకు ఎన్టీయార్ ఇమేజ్ను కలగలిపి, ‘అడవి రాముడు’ కథను అల్లుకున్నట్లు దర్శకుడు కె. రాఘవేంద్రరావు సైతం అంగీకరించారు. రాజబాబు నోట దర్శక, రచయితలు పలికించిన ఆల్ కూర్స్ చమాచమ్ అంటూ కొత్త వంటకం కామెడీ ఒక రకంగా ఈ కథ వండిన తీరుకు వర్తిస్తుంది.

7. అడవి రాముడు డేట్!

ఇండస్ట్రీలో ‘అడవి రాముడు డేట్’గా ఏప్రిల్ 28 పాపులరైంది. ఆ తేదీన రిలీజ్ చేస్తే పిక్చర్ హిట్టని సెంటిమెంట్.. ప్రముఖ దర్శక, నిర్మాత విజయ బాపినీడు కొన్నేళ్ళ పాటు వరుసగా సరిగ్గా అదే తేదీన తన సినిమాలు రిలీజ్ చేశారు. రాఘవేంద్రరావు ‘అడవి సింహాలు’, రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే తొలి చిత్రం చేసిన మహేశబాబు ‘పోకిరి’ రిలీజ్ డేట్ కూడా ఏప్రిల్ 28. రాఘవేంద్రరావు శిష్యుడు రాజమౌళి ‘బాహుబలి2’ కూడా అదే డేట్‌కి వచ్చింది. ఆ సినిమాకు రాఘవేంద్రరావే సమర్పకుడు కావడం విశేషం.

8. రెండు రోజులు… రెండు సూపర్ హిట్ సాంగ్స్!

ఇంత భారీ తారాగణంతో, ముదుమలై అడవుల్లో, పూర్తి ఔట్‌డోర్ సినిమాను తీయడం ఆ రోజుల్లో పెద్ద సాహసమే. అయితే, కథ, హీరో, దర్శకుడిపై నమ్మకంతో నిర్మాతలు అందుకు సై అన్నారు. నిర్మాతలు ముందుకొచ్చారు కదా అని దర్శకుడు నిర్లక్ష్యంతో పోలేదు. పైపెచ్చు, ఖర్చు చేసిన ప్రతి రూపాయీ ప్రేక్షకుడికి తెరపై వంద రూపాయల ఖర్చులా ఇనుమడించి, కనిపించేలా జాగ్రత్త తీసుకున్నారు. ఇంత భారీ సినిమాను కూడా కేవలం 35 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసేశారంటే, దర్శకుడు ఎంత ప్లానింగ్‌తో తీశారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాలో అప్పటికీ ఇప్పటికీ సూపర్ హిట్ పాటలైన రెండిటిని కేవలం మూడే రోజుల్లో చిత్రీకరించడం రాఘవేంద్రరావు మార్కు మేధకు నిదర్శనం. ‘‘ఆరేసుకోబోయి పారేసుకున్నా… పాటను కేవలం ఒకటిన్నర రోజులో షూట్ చేసేశా. అంటే, వన అండ్ హాఫ్ డే కాల్షీట్ అన్న మాట. మిగిలిన అర రోజులో పాట పూర్తి కాదు. పోనీ, మరునాడు కూడా రెండో పాట షూటింగ్ చేద్దామంటే, జయప్రద కాల్షీట్ లేదు. సుందర్‌లాల్ నహతా వాళ్ళ షూటింగ్‌కి ఆమె హాజరు కావాలి. పోనీ… వాళ్ళనే ఎలాగోలా బతిమాలుకొని, ఒక్క రోజు ఎడ్జ్స్టమెంట్ అడుగుదామనుకున్నా.

ఇంతలో మా ఆందోళన గమనించిన ఎన్టీయార్, ‘ఏం బ్రదర్… ఏంటి ప్రాబ్లమ్’ అని అడిగారు. విషయం చెప్పగానే, ‘వారెవరినో అడుక్కోవడమెందుకు? ఇవాళే షూటింగ్ పొడిగించండి. ఇవాళ మధ్యాహ్నం, నైట్‌లో పాట చేసేద్దా’మని ఆయన అన్నారు. అంతే, ఆ మధ్యాహ్నం ‘కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరి…’ పాట మొదలుపెట్టేశాం. రాత్రంతా నైట్ ఎఫెక్ట్‌లో, రకరకాల జంతువులు, పక్షుల మధ్య ఆ పాట తీసి, తెల్లవారుజాముకల్లా పూర్తి చేసేశాం’’ అని రాఘవేంద్ర రావు చెప్పారు. అంటే, వన అండ్ హాఫ్ కాల్షీట్ అన్న మాట. రెండు రోజుల్లో, 3 కాల్షీట్లలో, 2 ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ చిత్రీకరించిన ఘనత రాఘవేంద్రరావుది.

9. రాజ్ కపూర్ ఫిదా!

షో మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరున్న ప్రముఖ హిందీ సినీ నట, దర్శక, నిర్మాత రాజ్‌కపూర్ సైతం ‘అడవి రాముడు’ చూసి, ఆశ్చర్యపోయారు. అఖండ విజయం సాధించిన ఈ చిత్రానికి విజయవాడలో జరిగిన శతదినోత్సవానికి హిందీ సూపర్‌స్టార్ దిలీప్ కుమార్ వస్తే, మద్రాసు తాజ్ కోరమాండల్ హోటల్లో జరిగిన ద్విశత దినోత్సవానికి రాజ్ కపూర్ ప్రత్యేకంగా హాజరయ్యారు. ఆ సభలో రాజ్ కపూర్ మాట్లాడుతూ, సినిమాలో జననాయకుడిగా ఎదిగిన హీరో కోసం ఒక్కో గుడిసె నుంచి ఒక్కొక్కరుగా సామాన్యజనం రావడాన్ని టాప్ యాంగిల్ క్రేన షాట్లో చూపించిన వైనాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి మరీ రాఘవేంద్రరావును మెచ్చుకున్నారు. చిత్రీకరణ పద్ధతిలోనే హీరో స్థాయిని తెలిపేలా షాట్ పెట్టడంలో టెక్నీషియనగా రాఘవేంద్రరావు పనితనం కనపడిందన్నారు.

అలాగే, ఈ సినిమాలో ఎన్టీయార్, జయప్రదల మీద రకరకాల పక్షులు, జంతువుల సాక్షిగా వచ్చే సూపర్ హిట్ డ్యూయెట్ ‘కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరి…’ పాట చిత్రీకరణ విధానాన్ని కూడా రాజ్ కపూర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాసుకున్న పాటకు అంత అద్భుతంగా కుదిరేలా చిత్రీకరణ చేయడం సాధ్యం కాదని అనుకున్న ఆయన, ‘ముందుగా చిత్రీకరణ చేసిన షాట్లకు తగ్గట్లుగా ఆ తరువాత పాట రాసుకున్నారా’ అని అడిగారు. ‘అలా ఏమీ లేదు… ముందు రాసుకొని, బాణీ కట్టిన పాటకే అలా చిత్రీకరణ చేశా’మని రాఘవేంద్రరావు వివరించేసరికి, ఆశ్చర్యపోయారు రాజ్ కపూర్.

10. అయిదొందల కోట్ల సినిమా!

అడవి రాముడు సినిమా అప్పట్లో ఒక ప్రభంజనం. వసూళ్ళలో తెలుగు సినిమా చరిత్రలోనే ఒక చరిత్ర. ఆ రోజుల్లో అడవి రాముడు సాధించిన కమర్షియల్ రికార్డులు దక్షిణాదితో పాటు, ఉత్తరాది సినీసీమ వారిని కూడా ప్రాంతీయ తెలుగు సినిమా పరిశ్రమ వైపు కళ్ళువిప్పార్చి చూసేలా చేసింది. అప్పటి దాకా తెలుగు సినిమా వసూళ్ళు కోటి మార్కును దాటింది – కేవలం రెండే రెండు సినిమాలు. మొదటిది… ఎన్టీయార్ ‘లవకుశ’. రెండోది… ఎన్టీయార్ స్వీయ దర్శకత్వంలో మూడు పాత్రలు నటించి, నిర్మించిన ‘దాన వీర శూర కర్ణ’. రెండూ పౌరాణికాలే.

కానీ, తొలిసారిగా సాంఘిక కథా చిత్రమైన ‘అడవి రాముడు’ ఏకంగా 4 కోట్ల గ్రాస్ సాధించి, అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఏకంగా ఏడాది పాటు ఏకధాటిగా ఆడింది. జనం క్యూలు కట్టి, ఆ సినిమా చూశారు. తెలుగు సినిమా స్టామినా ఎంత ఉందో తొలిసారిగా బాక్సాఫీస్ వద్ద రుచి చూపించింది. ఎన్టీఆర్ ‘అడవి రాముడు’ ఇచ్చిన ఆ భరోసాతో భారీగా సినిమాలు తీయడానికి దర్శక, నిర్మాతలు ధైర్యం చేశారు. తెలుగు సినిమాల వసూళ్ళూ ఆ దామాషాలో భారీగా పెరిగాయి. అలా తెలుగు సినిమాల్లో నిర్మాణవ్యయం, దానికి తగ్గట్లే వసూళ్ళూ పెరగడానికి కూడా ‘అడవి రాముడు’ మూలమైంది. 41 ఏళ్ళ క్రితం అప్పటి తెలుగు జనాభా, టికెట్ రేట్లు, రూపాయి విలువ లెక్కల్ని ఇప్పటి లెక్కలతో పోల్చి చూస్తే, అడవి రాముడు ఇవాళ దాదాపు 500 కోట్ల వసూల్ సినిమా అని సినీ వ్యాపారవర్గాల అంచనా. అన్నట్లు సినిమా రిలీజై ముప్ఫై ఏళ్ళు గడిచిన తరువాత కూడా మొన్న మొన్నటిదాకా దాదాపు 15 సరికొత్త ప్రింట్లతో రిపీట్ రనలు ఆడిన ఏకైక పాత చిత్రమూ ఇదే. అందుకే, హాలీవుడ్ పద్ధతిలో తెగిన టికెట్లు, చూసిన ప్రేక్షకుల సంఖ్యను బట్టి చూస్తే, అత్యధిక వ్యూయర్ షిప్ సాధించిన సినిమాగా, ‘అడవి రాముడు’ది అభేద్యమైన రికార్డని ట్రేడ్ విశ్లేషణ.

11. అదీ మా గురువు గొప్పతనం! – బి. గోపాల్, ప్రముఖ దర్శకుడు

మా గురువు గారైన రాఘవేంద్రరావు గారి దగ్గర నేను పని చేసిన తొలి సినిమా ‘అడవి రాముడు’. ఇంటికి వెళ్ళిపోదామని అనుకొంటున్న టైమ్‌లో లక్కీగా గురువు గారి సినిమాకు పనిచేసే అవకాశం వచ్చింది. అది నా లైఫ్‌కి టర్నింగ్ పాయింట్. నేను అమితంగా అభిమానించే ఎన్టీయార్ గారితో అడవుల్లో అన్ని రోజులు కలసి ఉండడం, ఆయన నటన దగ్గరుండి ప్రత్యక్షంగా చూడడం థ్రిల్లింగ్ అనుభవం. ముదుమలై అడవుల్లో ఆ జనవరి చలిలో, రోజూ తెల్లవారుజామునే కారులో షూటింగ్ స్పాట్‌కు వెళుతుంటే పులులు కనిపించేవి. ముదుమలై చెక్‌పోస్ట్ దగ్గర రోజూ సాయంత్రం ముప్ఫై నలభై ఏనుగుల గుంపు నదిలో నీళ్ళు తాగడానికి వెళ్ళడం చూసేవాళ్ళం. ఏనుగులతో షూటింగ్ మరో మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఎన్టీయార్ బస చేసిన క్యాటేజ్ ఎదురుగా చిన్న కొలను లాంటిది ఉంటే, అక్కడికక్కడ ‘కోకిలమ్మ పెళ్ళికి…’ పాట నైట్ ఎఫెక్ట్‌లో మా గురువు గారు అద్భుతంగా తీశారు. ఆర్ట్ డైరెక్టర్ మద్రాసు వెళ్ళడంతో అందుబాటులో లేడు. అయినా సరే తంగవేలు అనే అసిస్టెంట్‌తో తనకు కావాల్సిన చిన్న వంతెన లాంటివన్నీ గురువు గారే చెప్పి మరీ చేయించుకున్నారు. రాత్రికి రాత్రి అద్భుతమైన పాట చిత్రీకరించేశారు. అది మా గురువు గొప్పతనం. ఆ సినిమా మీద ప్రేమతోనే ప్రభా్‌సతో తీసిన సినిమాకు నేను ‘అడవి రాముడు’ అనే టైటిల్ పెట్టాం. అలాగే, గురువు గారి పర్మిషన తీసుకొని ‘ఆరేసుకోబోయి…’ పాట రీమిక్స్ చేసి. పెట్టాం. మా సినిమాకు హైప్ రావడానికీ, బీ, సీ సెంటర్లలో మంచి వసూళ్ళు రావడానికీ ఎన్టీయార్ ‘అడవి రాముడు’ బాగా హెల్ప్ అయింది.

12. ఏనుగు మీద నుంచి పడ్డా: జయప్రద

రాఘవేంద్రరావు, వేటూరి, ఎస్పీబీ, జంధ్యాల… ఇలా ఎందరెందరి కెరీర్‌నో మలుపుతిప్పిన సినిమా… తెలుగు సినిమా బడ్జెట్నీ, బాక్సాఫీస్ కలెక్షన్లనీ కొత్త శిఖరాలకు చేర్చిన సినిమా… ఒక్క మాటలో చెప్పాలంటే ఆల్ టైమ్ సూపర్ హిట్ సినిమా… అదే మన ‘అడవి రాముడు’. ఎన్టీఆర్, జయప్రద, జయసుధ నటించిన ఈ సినిమా విడుదలై 40 ఏళ్లు కావస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర షూటింగ్ విశేషాలను ఆంధ్రజ్యోతితో పంచుకున్నారు నటి జయప్రద.. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

అప్పటికే బాపు గారితో ‘శ్రీరాజరాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్’, బాలచందర్ గారితో ‘అంతులేని కథ’, కె. విశ్వనాథ్ గారితో ‘సిరిసిరిమువ్వ…’ ఇలా ప్రముఖ దర్శకుల దగ్గర నటించాను. ఆ తరువాత ఎన్టీయార్ లాంటి స్టార్ హీరో సరసన నాకు దక్కిన తొలి అవకాశం, అతి పెద్ద అవకాశం… ‘అడవి రాముడు’. టీనేజ్ వయసులోనే సినీ రంగానికి వచ్చిన నాకు నడక, నడత… అన్నీ నేర్పిన స్కూళ్ళు ఈ పెద్దలు, వాళ్ళ సినిమాలే. ముదుమలై ఫారెస్ట్‌లో క్యాంప్ చేసి, ఈ సినిమాకు చేసిన షూటింగ్ అంతా సందడే. ఈ సినిమాలో నాకు రెండు ప్రమాదాలు తప్పిపోయాయి. ఒక సీన్ కోసం నేను, జయసుధ ఏనుగుపై కూర్చొని వస్తుంటాం. ఆ సీన్లో విలన్ మనుషులు హీరోపై దాడికి దిగుతుంటారు. తీరా ఆ షాట్లో విలన్ల అరుపులు, పేలుళ్ళు విని ఒక్కసారిగా ఏనుగు బెదిరింది. ముందుకెళ్ళేదల్లా చటుక్కున టర్న్ తీసుకొనేసరికి, ఏనుగు మీద ఉన్న మేమిద్దరం గుమ్మడికాయల్లా దొర్లిపడ్డాం. ఇద్దరం స్పృహ తప్పిపడిపోయాం. సపర్యలు చేశాక, తేరుకున్నాం. రెండో ప్రమాదం ఏమిటంటే, సినిమాలో వచ్చే ఘాట్ రోడ్డు మీద టాంగాలో ఛేజింగ్ సీన్. ఆ షూటింగ్లో గుర్రపు బగ్గీ వేగంగా వెళుతున్నప్పుడు చిలుకు ఊడిపోయి, చక్రం విడిగా వచ్చేసింది. దాంతో బగ్గీ ఒరిగిపోయి, నాకు దెబ్బ తగిలింది. అవన్నీ ఇప్పుడు తలుచుకొంటే గమ్మత్తుగా అనిపిస్తుంది.

అలాగే, ఆ సినిమాలోని పాటలు కూడా. ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ పాటను దర్శకులు చాలా గ్లామరస్‌గా తీయడం, రిలీజయ్యాక ఆ పాట వచ్చినప్పుడల్లా థియేటర్లో జనం డబ్బులు తెరపైకి వేయడం మర్చిపోలేను. నలభై ఏళ్ళవుతున్నా… ఇప్పటికీ ఎప్పుడు ఆ పాట చూసినా, అంతా ఇవాళే జరిగినట్లు చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంటుంది. పైగా, అప్పట్లో నేను హిందీ సినీ రంగానికి వెళ్ళాక, ఎప్పుడు నేను తెలుగునాటకు వచ్చి ఏ కార్యక్రమంలో పాల్గొన్నా… ముందుగా ‘ఆరేసుకోబోయి…’ పాట వేసేశారు. ఒక రకంగా ఆ మాస్ పాట నాకు పెద్ద ఐడెంటిఫికేషన్ అన్న మాట.

13. అందులో నాకెలాంటి అనుమానం లేదు: ఎన్టీఆర్

అడవి రాముడు ఒక సంచలనం అంటే బహుశా చిన్నమాట ఏమో! తెలుగు సినిమా స్థాయినీ, వాణిజ్య సామర్థ్యాన్నీ ఎన్నో రెట్లు పెంచి, ఆ రోజుల్లోనే నాలుగు కోట్ల రూపాయల వసూళ్ళు రాబట్టిన మొట్టమొదటి తెలుగు సినిమా అది. అలా చరిత్ర సృష్టించి, సినిమా చరిత్రలో నిలిచిన చిత్రం… ‘అడవి రాముడు’. అశేష తెలుగు ప్రజల నీరాజనాలు అందుకున్న ఈ చిత్రం ఆ ప్రేక్షకుల గుండెల్లో తాత గారి సుస్థిర స్థానాన్ని మరింత పదిలం చేసింది. ఆ సినిమాలో తాత గారు కనపడినప్పుడల్లా రూపాయి నాణాలతో తెర పైకి అభిషేకాలు చేసి, హారతులు పట్టిన సంఘటనలు కోకొల్లలు. ఆ సంగతులు విన్నప్పుడల్లా… ఆ మహానుభావుడి పట్ల తెలుగువారు ఎంతటి అభిమానాన్ని పెంచుకున్నారో అర్థం అవుతుంది.

నలభై ఏళ్ళు నిండినా, ఈ చిత్రంలోని సన్నివేశాలు, పాటలు ఇప్పటికీ ప్రజలను అలరిస్తున్నాయి. అంటే, కె. రాఘవేంద్రరావు గారి కమర్షియల్ దర్శకత్వ ప్రతిభకు అది నిదర్శనం. ఈ సినిమా అంటే నాకు ఎంతో ఇష్టం. ఈ చిత్రం మరో నలభై ఏళ్ళ తరువాత కూడా తెలుగు సినిమా అభిమానుల్ని ఇదే స్థాయిలో అలరిస్తుంది. అందులో నాకెలాంటి అనుమానం లేదు. ఎనీ డౌట్స్!

మనిషైపుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ – (ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కోరస్; వేటూరి, కె.వి.మహదేవన్
సాకీ :
మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ
పట్టుదలే ఉంటే కాగలడు మరోబ్రహ్మ

పల్లవి :
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారుమహాపురుషులౌతారు
తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు

చరణం : 1
అడుగో అతడే వాల్మీకి బ్రతుకు వేట అతనికి
అతిభయంకరుడు యమకింకరుడు
అడవి జంతులపాలిటి అడుగో అతడే వాల్మీకి
పాలపిట్టల జంట వలపు తేనెల పంట
పండించుకుని పరవశించి పోయేవేళ
ఆ పక్షుల జంటకు గురిపెట్టాడు
ఒక పక్షిని నేల కూల్చాడు
జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ
తన కంటిలో పొంగ మనసు కరగంగ
ఆ శోకంలో ఒక శ్లోకం పలికే ఆ చీకటి ఎదలో దీపం వెలిగే
కరకు బోయడే అంతరించగా కవిగా ఆతడు అవతరించగా
మనిషి అతనిలో మేల్కొన్నాడు కడకు మహర్షే అయినాడు
నవరసభరితం రాముని చరితం జగతికి ఆతడు పంచిన అమృతం
ఆ వాల్మీకి మీవాడు మీలోనే ఉన్నాడు
అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు
అందుకే… కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు
తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు

చరణం : 2
ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం
తిరుగులేని దీక్షకీ అతడే ప్రాణం
కులం తక్కువ ని విద్యనేర్పని గురువు బొమ్మగా మిగిలాడు
బొమ్మ గురువుగా చేసుకొని బాణ విద్యలో పెరిగాడు
హుటాహుటిని ద్రోణుడపుడు తటాలుమని తరలివచ్చి
పక్షపాత బుద్ధితో దక్షిణ ఇమ్మన్నాడు
ఎదుట నిలిచిన గురుని పదమంటి
ఏమివ్వగలవాడననే ఏకలవ్యుడు
బొటనవ్రేలివ్వమనె కపటి ఆ ద్రోణుడు
వల్లెయనె శిష్యుడు చెల్లె ద్రోణుని ముడుపు
ఎరుకలవాడు అయితేనేమి గురికల వాడే మొనగాడు
వేలునిచ్చి తన విల్లును విడిచి
వేలుపుగా ఇల వెలిగాడు
అందుకే… కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు
తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు

చరణం : 3
శబరీ… ఇంతకాలము వేచినది ఈ పిలుపుకే శబరి
ఆశ కరువిడి అడుగు తడబడి రామపాదము కన్నది
వంగిపోయిన నడుముతో నగుమోము చూడగలేక అపుడు
కనుల నీరిడి ఆ రామపాదము కడిగినది శబరి
పదముల ఒరిగినది శబరి
ప్రేమ మీరగ రాముడప్పుడు శబరి తల్లి కనులు తుడిచి
కోరికోరి శబరి కొరికిన దోర పండ్లను ఆరగించె
ఆమె ఎంగిలి గంగ కన్న మిన్నగ భావించిన
రఘురాముడెంతటి ధన్యుడో
ఆ శబరిదెంతటి పుణ్యమో
ఆమె ఎవ్వరో కాదు సుమా ఆడబడుచు మీ జాతికి
జాతిరత్నములు ఎందరెందరో మీలో కలరీ నాటికీ
అడివిని పుట్టి పెరిగిన కథలే అఖిల భారతికి హారతులు
నాగరికతలో సాగు చరితలో మీరే మాకు సారథులు
అందుకే… కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు
తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు

చిత్రం : అడవిరాముడు (1977)
రచన : https://www.youtube.com/watch?v=8HABZQsGTlU

ఆరేసుకోబోయి పారేసుకున్నాను – (పి.సుశీల, ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం)
ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి
కోకెత్తుకెళ్ళింది కొండ గాలి….
నువ్వు కొంటె చూపు చూస్తేనే చలి చలి చలి చలి…ఆ చలి చలి…
పారేసుకోవాలనారేసుకున్నావు హరి హరి హరి హరి
నీ ఎత్తు తెలిపింది కొండగాలి…
నాకు ఉడుకెత్తి పోతుంది హరి హరి హరి హరి హరి హరి
ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి….
నాలోని అందాలు నీ కన్నులా ఆరేసుకోని సందెవేళ
నా పాట ఈ పూట నీ పైటలా దాచేసుకునీ తొలిపొంగులా
నాలోని అందాలు నీ కన్నులా ఆరేసుకోని సందెవేళ
నా పాట ఈ పూట నీ పైటలా దాచేసుకునీ తొలిపొంగులా
నీ చూపు సోకాలి నా ఊపిరాడాలి
నీ చూపు సోకాలి నా ఊపిరాడాలి
ఈ జంట నా చేతి చలిమంట కావాలి
ఈ వింత కవ్వింతకే కాగిపోవాలి
నీ కౌగిలింతలోనే దాగిపోవాలి
ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి….
కోకెత్తుకెళ్ళింది కొండ గాలి….
నాకు ఉడుకెత్తి పోతుంది హరి హరి హరి హరి హరి హరి
నీ ఒంపులో సొంపులే హరివిల్లు
నీ చూపులో రాపులే విరిజల్లు
నీ రాక నా వలపు ఏరువాక
నిను తాక నీలిమబ్బు నా కోక
నే రేగిపోవాలి…నేనూగిపోవాలి
నే రేగిపోవాలి…నేనూగిపోవాలి
చెలరేగి ఊహల్లో ఊరేగి రావాలి
ఈ జోడు పులకింతలే నా పాట కావాలి
ఆ పాట పూబాటగా నిను చేరుకోవాలి
ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి
కోకెత్తుకెళ్ళింది కొండ గాలి….
నువ్వు కొంటె చూపు చూస్తేనే చలి చలి ఆహా.. చలి చలి ఆహా..చలి చలి
పారేసుకోవాలనారేసుకున్నావు హరి హరి హరి హరి
నీ ఎత్తు తెలిపింది కొండగాలి…
నాకు ఉడుకెత్తి పోతుంది హరి హరి హరి హరి హరి హరి
లా లా లా లా లా లా లా లా లా లా లా లా…..

అమ్మతోడూ అబ్బతోడూ నీ తోడూ నాతోడూ – (పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం)
పల్లవి:
అమ్మతోడు…అబ్బతోడు..నా తోడు…నీ తోడు
అన్నిటికి నువ్వే నా తోడు…ఇంకెన్నటికి నేనే నీ తోడు
అమ్మతోడు…అబ్బతోడు..నా తోడు…నీ తోడు
అన్నిటికి నువ్వే నా తోడు…ఇంకెన్నటికి నేనే నీ తోడు

చరణం 1:
ఆకలన్నదే లేదు.. హర హరా..రామ రామా
అన్నమే రుచికాదు …శివ శివా..కృష్ణ కృష్ణా..
ఆకలన్నదే లేదు.. హర హరా…
అన్నమే రుచికాదు… శివ శివా…

వెన్నెలలొస్తె వేడిరా నా దొరా…ఆ వేడిలోనే చలేసింది రా
ఆకలన్నదే నీకు లేకపోతే…ఈ కేకలెందుకే రాకపోకలెందుకే
ఒట్టిమాటలింక నీవు కట్టిపెట్టు…నీ ఒట్టు తీసి గట్టుమీద అట్టిపెట్టు
అమ్మతోడు…అబ్బతోడు..నా తోడు…నీ తోడు
అన్నిటికి నువ్వే నా తోడు…ఇంకెన్నటికి నేనే నీ తోడు

చరణం 2:
కళ్ళు కాయలు కాచే హర హరా…. ఈశ్వరా
నిన్ను చూడకమాకు శివ శివా…. శ్రీహర
కళ్ళు కాయలు కాచే …హర హరా
నిన్ను చూడకమాకు …శివ శివా

పొద్దె గడవదు మాకు ఓ దొరా…నిద్దరన్నదే లేదు రా
నిద్దరన్నదే నీకు లేకపోతే…ఈ పిలుపులెందుకే ..ఆ కులుకులెందుకే
గుట్టు బయట పెట్టకుంటే …పెద్ద ఒట్టు
గట్టు మీద చిలక వింటే గుట్టు రట్టు…

అమ్మతోడు…అబ్బతోడు..నా తోడు…నీ తోడు
అన్నిటికి నువ్వే నా తోడు…ఇంకెన్నటికి నేనే నీ తోడు

చరణం 3:
ఆ శివుడే వరమిచ్చాడే …అదిరిపడకే ఆడవి జింకా
అంబ పలికే జగదంబ పలికెనే… ఆశవదులుకో నీవింకా

ఆహాఁ భోలా శంకరుడయినా నిన్ను బొల్తాకొట్టించాడమ్మా
చిత్తైపోయావమ్మో… ఓ సిగ్గులదొరసానమ్మా

తెల్లారే తల్లో పూలు పెట్టుకురమ్మన్నాడు
తేల్లారకనే తలస్నానం చేసి రమ్మన్నాడు
చిటికెడు విబూది ఇచ్చాడు
పిడికెడు నాకు ఇచ్చాడు
అమ్మతోడు అందాల రాముడు… నా వాడన్నాడు
నా అన్నవాడు అడవి రాముడు …నా తోడన్నాడు
అందుకే వాడు నా వాడు…
కాడు కాడు …కాలేడు….
అబ్బ అమ్మా…

అమ్మ తోడు అబ్బ తోడు నా తోడు నీ తోడు
అన్నిటికి మీరే నా తోడు… ఇంకెన్నటికి నేనే మీ తోడు
అమ్మ తోడు అబ్బ తోడు నా తోడు నీ తోడు
అన్నిటికి మీరే నా తోడు… ఇంకెన్నటికి నేనే మీ తోడు
ఇంతటితో ఆపండి… మీగోడు

చిత్రం : అడవి రాముడు (1977)
సంగీతం : కె.వి. మహదేవన్
రచన : వేటూరి
గానం : బాలు, సుశీల, జానకి

కుకుకు కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరి – (పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం)
కోకిలమ్మ పెళ్ళికి
కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరి
చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి
వసంతుడే పెళ్లి కొడుకు వనమంతా సందడి
పూలన్నీ తలంబ్రాలు పున్నమి తొలిరేయి
తుళ్ళి తుళ్ళి నిన్న మొన్న తూనీగల్లె ఎగిరిన
పిల్లదానికొచ్చింది కళ…పెళ్లి కళ
తలపులన్ని వలపులైన చూపులు విరితూపులైన
పెళ్లి కొడుకు నవ్వితే తళ…తళ తళ
పూలగాలితో రేగిన పుప్పొడి పారాణిగా
చిలక పాట నెమలి ఆట కలిసి మేఘవాణిగా(2)
అందమైన పెళ్ళికి అందరు పేరంటాలే
అడవిలోని వాగులన్నీ ఆనందపు కెరటాలే…
కన్ను కన్ను కలుపుకున్న కన్నె మనసు తెలుసుకున్న
కనుల నీలి నీడలే కధ…ప్రేమ కధ
బుగ్గలలో నిగ్గు తీసి సిగ్గులలో చిలకరించు
మొగ్గ వలపు విచ్చితే కధ…పెళ్లి కధ
ఇరు మనసులకొక తనువై
ఇరు తనువులకొక మనువై
మనసులోని వలపులన్ని మల్లెల విరిపానుపులై(2)
కలిసి ఉన్న నూరేళ్ళు కలలు గన్న వెయ్యేళ్ళు
మూడు ముళ్ళు పడిన నాడు ఎదలు పూల పొదరిల్లు.

చూడర చూడర చూడర ఒక చూపూ ఓ సులెమాన్ లియా – (పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం)

ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకూ ఎన్నెల్లే తిరిగొచ్చే మాకళ్ళకూ – (పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.