1970 సంవత్సరం లో తెలుగు సినిమాలు, ఎవరు ఎన్ని చిత్రాలు?

0
1192

1970 సంవత్సరం లో తెలుగు సినిమాలు, ఎవరు ఎన్ని చిత్రాలు?

నాలుగు పుష్కరాల క్రితం 1970 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాల వివరాలు.

తెలుపు నలుపు చిత్రాలకు ఇంచుమించు ఆఖరి సంవత్సరం 1970.

అంతవరకూ హాస్యం పేరిట హాస్య నటీ నటులకు మాత్రమే పరిమితమైన నాట్యాలు, ద్వంద్వార్ధాలా మాటలూ పాటలూ 1971 నుండీ హీరో హీరోయిన్లకు ప్రాకేయని విమర్శకుల అభిప్రాయం.

1970 సంవత్సరంలో 49 తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. సగటున వారానికి ఒక సినిమా చొప్పున. ఎన్ టి ఆర్, ఏ ఎన్ ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కాంతారావు, హరనాధ్, కృష్ణం రాజు, చంద్రమోహన్ హీరోలుగా వాణిశ్రీ, రాజశ్రీ, విజయ నిర్మల మొదలైన వారు హీరోయిన్లగా నటించారు.

అక్కినేని 5 చిత్రాలలో, ఎన్ టి ఆర్ 10 చిత్రాలలో నటించారు. అక్కా చెల్లెలు (1 కేంద్రం), ధర్మదాత (11 కేంద్రాల్లో), ఇద్దరు అమ్మాయిలు (1 కేంద్రం) , తల్లా పెళ్ళామా (4 కేంద్రాలు), పెత్తందార్లు (3 కేంద్రాలు), చిట్టి చెల్లెలు, కోడలు దిద్దిన కాపురం (13 కేంద్రాలు), ఒకే కుటుంబం శత దినోత్సవాలు జరుపుకున్నాయి.

కోడలు దిద్దిన కాపురం రజతోత్సవం కూడా జరుపుకుంది.

లక్ష్మీ కటాక్షం, ఆలీబాబా 40 దొంగలు, విజయం మనదే, మాయని మమత, మారిన మనిషి, జై జవాన్, మరో ప్రపంచం యావరేజ్ గా నడిచాయి.

ఇవి కాక ఇతరులు నటించిన చిత్రాలు భలే గూడచారి (శోభన్ బాబు), సంబరాల రాంబాబు (చలం), మా నాన్న నిర్దోషి (కృష్ణ), మళ్ళీ పెళ్ళి (కృష్ణ), కధా నాయిక మొల్ల (హరనాధ్), యమలోకపు గూడచారి (హరనాధ్), మెరుపు వీరుడు (కాంతారావు), విధి విలాసం (కృష్ణ), అమ్మకోసం (కృష్ణ), తాళి బొట్టు (కృష్ణ), పెళ్ళి సంబంధం (కృష్ణ), పెళ్ళి కూతురు (కృష్ణ), మా మంచి అక్కయ్య (కాంతారావు), పసిడి మనసులు (శోభన్ బాబు), పగ సాధిస్తా (కృష్ణ), ఖడ్గ వీర (కాంతారావు), జగత్ జెట్టీలు (శోభన్ బాబు), అగ్ని పరీక్ష (కృష్ణ), తల్లిదండ్రులు (శోభన్ బాబు), అఖండుడు (కృష్ణ), జన్మ భూమి (కాంతారావు), పచ్చని సంసారం (కృష్ణ), ఇంటి గౌరవం (శోభన్ బాబు), ఆడ జన్మ (హరనాధ్), భలే ఎత్తు చివరకు చిత్తు (కాంతారావు), బాల రాజు కధ, సుగుణ సుందరి కధ (కాంతారావు), శ్రీ దేవి (హరనాధ్), దేశమంటే మనుషులోయ్ (శోభన్ బాబు), ఎవరిని నమ్మాలి (హరనాధ్), రౌడీ రాణి (విజయ లలిత), రెండు కుటుంబాల కధ (కృష్ణ), అల్లుడే మేనల్లుడు (కృష్ణ), రైతే రాజు (కాంతారావు), బస్తీ కిలాడీలు (హరనాధ్), ద్రోహి కూడా (జగ్గయ్య) 1970 లో విడుదలయ్యాయి.

ఎన్ టి ఆర్ నటించిన 200 వ చిత్రంగా ఎన్ టి ఆర్ ఎస్టేట్స్ పతాకంపై 21-10-1970 బుధవారం నాడు ఆంధ్ర దేశమంతటా కోడలు దిద్దిన కాపురం విడుదలై ఘన విజయం సాధించింది. 13 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుని రజతోత్సవ చిత్రంగా 1970 లో విడుదలైన తెలుగు చిత్రాలలో సూపర్ డూపర్ హిట్ గా నిలచింది.

కోడలుదిద్దినకాపురం సినిమాలో ఉజ్జ్వల భారతీయ చరిత్రని తలుచుకునే

నీ ధర్మం నీ సంఘం నీదేశం నువు మరవొద్దు
రచన: సి నారాయణ రెడ్డి, సంగీతం టీ వీ రాజు, గానం: పి సుశీల, దర్శకుడు యోగానంద్, తెరపై సావిత్రి పై చిత్రీకరించిన దేశ భక్తి గీతం. ఈ పాటను ప్రాధమిక పాఠశాలల్లో విధిగా పాడుకునేవారు.

నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు
సత్యం కోసం సతినే అమ్మినదెవరూ … హరిశ్చంద్రుడూ
తండ్రి మాటకై కానల కేదినదెవరూ … శ్రీరామచంద్రుడూ
అన్న సేవకే అంకితమైనది ఎవరన్నా … లక్ష్మన్నా
పతియె దైవమని తరించిపోయిన దెవరమ్మా … సీతమ్మా
ఆ పుణ్యమూర్తులు చూపిన మార్గం అనుసరించుటే ధర్మం అనుసరించుటే నీ ధర్మం
నీ ధర్మం మరవద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు

చాపకూడుతో సమతను నేర్పెను నాటి పలనాటి బ్రహ్మన్నా
మేడి పండులా మెరిసే సంఘం గుట్టు విప్పెను వేమన్నా
వితంతువుల విధి వ్రాతలు మార్చి బ్రతుకులు పండించే కందుకూరి
తెలుగు భారతిని ప్రజల భాషలో తీరిచిదిద్దెను గురజాడ
ఆ సంస్కర్తల ఆశయరంగం నీవు నిలిచిన సంఘం నీవు నిలిచిన ఈ సంఘం
నీ సంఘం మరవద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు

స్వతంత్ర భారత రథసారథియై సమరాన దూకె నేతాజీ
సత్యాగ్రహమే సాధనమ్ముగా స్వరాజ్యమే తెచ్చె బాపూజీ
గుండు కెదురుగా గుండె నిలిపెను ఆంధ్ర కేసరీ టంగుటూరీ
తెలుగువారికొక రాష్ట్రం కోరి ఆహుతి ఆయెను అమరజీవీ
ఆ దేశభక్తులు వెలసిన దేశం నీవు పుట్టిన భారతదేశం
నీవు పుట్టిన ఈ దేశం

నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు
మహనీయులనే మరవద్దు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.