స్వాగతం

0
257

స్వాగతం

పరమానందయ్య గారి శిష్యులు పదిమంది ఓసారి ఒక నదిని దాటారట. ప్రవాహవేగం ఎక్కువగా ఉందేమో, అందరూ జాగ్రత్తగా దాటవలసి వచ్చింది నదిని. తీరా అవతలి తీరం చేరుకున్న తర్వాత వారికి అనుమానం కలిగింది – `అందరం గట్టున పడ్డామా లేదా?’ అని!

ఏం చేయాలి?

ఇక లెక్కపెట్టక తప్పలేదు. ప్రతివాడూ మిగతావాళ్లందర్నీ లెక్కపెట్టి చూశాడు. అందరూ తొమ్మిదిమందే ఉన్నట్లు లెక్క తేల్చారు. ఉండాల్సినవారేమో పదిమంది. అంకెలేమో తొమ్మిదే వస్తున్నాయి. ప్రతివాడూ తనను తాను ఒదిలి మిగిలిన తొమ్మిదిమందినీ లెక్కపెడుతున్నాడు! చివరికి ఇక అందరూ ఏడవటం మొదలుపెట్టారు – కొట్టుకుపోయిన పదోవాడిని తలుచుకొని.

అప్పుడో పంతులుగారు వచ్చారు అటువైపు. తనూ లెక్కపెట్టిచూశారు. పదిమందీ ఉన్నారని నిర్ధారణ చేసుకొని చిరునవ్వు నవ్వారు. ఒక్కొక్కడినీ పిలిచి వీపుమీద బలంగా చరిచారు. దెబ్బపడిన ప్రతివాడినీ తను ఎన్నవవాడో అరవమన్నాడు. ఒకటోవాడినుండీ మొదలెడితే పదోవాడివరకూ అందరూ అరిచారు. పదిమందీ ఉన్నారని అందరూ మహా సంతోషపడ్డారు.

అయినా వాళ్లకో సందేహం మిగిలిపోయింది. “పంతులుగారు పదోవాడిని ఎలా రక్షించి తెచ్చారు?” అని.

ఈ కథ మనలో చాలామందికి తెలిసే ఉంటుంది.

అయినా, మనమూ వీళ్లలాగానే ఉంటాం: సమాజం గురించి ఆలోచించేటప్పుడు మనల్ని మనం లెక్కపెట్టుకోం. ’ఆ సమాజంలో మనమూ ఒకళ్లం’ అని మరచిపోతూ ఉంటాం. సామాజిక బాధ్యతని విస్మరించటం చాలా సుళువు. సమాజంలోని ప్రతి చెడువెనకా మనందరి బాధ్యతా ఎంతోకొంత ఉందని గుర్తించగలిగిననాడు మన జీవితాలే కాదు; సమాజం యావత్తూ పురోగమించగలదు. అప్పుడుగానీ మన సమాజంలోని హింసకు సరైన ప్రత్యామ్నాయాలు లభించవు.

ఏమంటారు?

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.