శ్రీమదాంజనేయ కల్యాణము

0
676

*శ్రీమదాంజనేయ కల్యాణము* 🌹

*శ్రీ ఆంజనేయ స్వామి అజన్మ బ్రహ్మచారి.. యజ్ఞోపవీతము ధరించే పుట్టినవాడు. ఘోటక బ్రహ్మచారి* అయినా వివాహము చేసుకున్నాడు.. వివాహము చేసుకున్నా కూడా బ్రహ్మచారిగానే మిగిలిపోయినాడు.. లోక కల్యాణము కోసము హనుమంతులవారు మొదట తన కల్యాణము చేసుకోవలసి వచ్చింది.. పరాశర సంహితలో ఆసక్తికరమైన ఈ ఉదంతము ఉంది.

ఒకప్పుడు సూర్యదేవుడు , విశ్వకర్మ కూతురైన సంజ్ఞాదేవిని పెళ్ళాడతాడు. అయితే , సంజ్ఞా దేవికి సూర్యుని తాపమును తట్టుకొను శక్తి లేదు..ఖిన్నురాలై , తన తల్లికి తన కష్టాన్ని చెప్పుకుంటుంది.. కూతురి సమస్యను అర్థము చేసుకున్నదై, ఆమె తల్లి , విశ్వకర్మకు సంగతి విశదీకరిస్తుంది. విశ్వకర్మ , సూర్యుడి ప్రకాశమును కొంత తీసివేస్తాడు. సూర్యునినుండీ బయట పడ్డ ఆ ప్రకాశము , ఒక సుందరమైన కన్యగా మారుతుంది. ఆమె రూప లావణ్యములను చూసి దేవతలే భ్రాంతి చెందుతారు. సంగతేమిటో తెలుసుకోవాలని ఇంద్రుడు , బ్రహ్మ దేవుని వద్దకు వెళ్ళి , ” ఆ కన్య ఎవరు ? ” అని అడుగుతాడు. ఇంద్రుడి ఉద్దేశము కనిపెట్టిన బ్రహ్మ ,ఆమెకు కాగల పతి శివాంశ సంభూతుడైన హనుమంతుడు తప్ప వేరొకరు కారు అని చెబుతాడు.

బాల హనుమంతుడు తల్లి అంజనా దేవి దగ్గర అల్లారు ముద్దుగా పెరిగి , ఆమె అనుజ్ఞ మేరకు సూర్యుని దగ్గర విద్యాభ్యాసము చేస్తాడు. శిక్షణ పూర్తికాగానే గురువు వద్దకు వచ్చి వినమ్రుడై , ” గురుదేవా , నా శిక్షణ పూర్తయిందని తమరి అనుజ్ఞ అయినది , నాకు ఇక వెళ్ళుటకు అనుమతినీయండి , మీకు గురు దక్షిణగా ఏమివ్వవలెనో చెప్పండి ” అంటాడు. ” శివాంశతో పుట్టినవాడవు , ఆంజనేయా , నిన్ను నేనేమని కీర్తించను ? సాగర మథనములో పుట్టిన గరళాన్ని జగద్రక్షణ కోసము మింగిన సాక్షాత్తూ ఆశివుడవే నువ్వు. నువ్వు వాయు దేవుడి పుత్రుడవు కూడా.. అగ్నికి పుత్ర సమానుడవు. మనము గురుశిష్యులమన్నది కేవలము ఔపచారికము మాత్రమే.. అయిననూ , అడిగినావు గనక , విను… విశ్వకర్మ , నాలోని ప్రకాశమును కొంత వేరుపరచినాడు. ఆ నాయొక్క ప్రభ ఇప్పుడు నా కూతురు రూపములో ఉన్నది. నా కాంతి నుండీ పుట్టిన నా కూతురు సువర్చలా దేవిని నీకిచ్చి వివాహము చేయవలెననునది నా కోరిక. ఇదే నువ్వు నాకు ఇవ్వవలసిన గురు దక్షిణ ” అంటాడు సూర్యుడు. హనుమంతుడు వినీతుడై సూర్యునికి తలవంచి , రెండు చేతులూ జోడించి నమస్కరించి , ” దేవా , నేను బ్రహ్మచర్యమును పాలించవలెనని తీర్మానించుకున్నాను.. అది మీకు తెలిసినదే కదా .. నా జీవన లక్ష్యము అదే. నేనీ వివాహము ఎలా చేసుకోగలను ? ” అని అడుగుతాడు.

సూర్యుడు ఉత్తరమిస్తాడు , ” *సువర్చల దైవాంశ సంభూతురాలు. నేను నీకొక వరమునిస్తాను. నువ్వు ఆమెను పెళ్ళాడిననూ , ప్రాజాపత్య బ్రహ్మచారిగనే మిగిలిపోతావు*. నీ ఈ వివాహము కేవలము జగత్కల్యాణము కోసమే తప్ప , నీ వ్రత భంగానికి కాదు. నువ్వు యజ్ఞోపవీతము ధరించియే పుట్టినవాడవు కాబట్టి పుట్టిన క్షణమునుండే నువ్వు బ్రహ్మచారివి. భవిష్యత్తులో , కలియుగానంతరము , ప్రళయానంతరము తరువాత తిరిగి జరగబోయే సృష్టికి నువ్వే బ్రహ్మవవుతావు. నువ్వు బ్రహ్మదేవుని పదవిని అలంకరించిన తరువాత , సువర్చలాదేవి వీణాపాణియైన ఆ వాణి స్థానములో ఉంటుంది.

సందేహ నివృత్తి అయిన హనుమంతుడు , *సూర్యుని ఆజ్ఞమేరకు సువర్చలా దేవిని వివాహమాడుతాడు. హనుమంతుని కల్యాణమైన దినము జ్యేష్ఠ శుద్ధ దశమి*. హనుమ పూజలో అగ్ని సూక్తముతోను , [ పంచామృతములతోను కూడా ] హనుమంతుడికి అభిషేకము [ విగ్రహ శోధన ] చేస్తారు. సువర్చలా పూజనుకూడా తమలపాకులపై సువర్ణ సహిత పుష్పాక్షతలతో చేస్తారు.

భక్తులందరూ ఈ హనుమ కల్యాణ గాథను చదివి తరింతురు గాక || శుభమస్తు ||* 🌹

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.