వేద వ్యాసుని జన్మదినమే గురుపౌర్ణమి.. 27 జులై 2018 శుక్రవారం

0
937

వేద వ్యాసుని జన్మదినమే గురుపౌర్ణమి.. 27 జులై 2018
శుక్రవారం

వేదవ్యాసుల వారు గురుపరంపరలో ప్రముఖుడిగా కీర్తిగడించారు. సప్త చిరంజీవులలో ఈయన కూడా ఒకరు. ఈయన జన్మించిన ఆషాఢ శుద్ధ పౌర్ణమినే ‘వ్యాస పౌర్ణమి’గా ‘గురుపౌర్ణమి’గా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది.

గురువు అన్నమాటకు చాలానే అర్థాలు వెతుక్కోవచ్చు. చీకటిలాంటి అజ్ఞానాన్ని పారద్రోలేవాడనీ, అధికుడనీ… ఇలా ఎన్ని తాత్పర్యాలనైనా విడదీయవచ్చు. ఎవరే అర్థాన్ని అన్వయించుకున్నా మానవులకు అవసరమైన జ్ఞానాన్ని అందించేవాడు గురువు అనడంలో ఎవరికీ ఏ సందేహమూ ఉండదు. అలాంటి గురువులలో ఉత్తమమైనవారు ఎవరంటే వేదవ్యాసుడూ , దక్షిణామూర్తి ఉదంతమూ జ్ఞాపకం రాక మానదు.

వ్యాసుడు: పరాశరుడు అనే రుషికీ సత్యవతి అనే జాలరి కన్యకీ పుట్టినవాడు వ్యాసుడు. అలా వ్యాసుని జననమే కులరహితంగా ఏర్పడింది. నిజానికి వ్యాసుని అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. నలుపు రంగులో ఉన్నవాడు కాబట్టి కృష్ణ అనీ, ద్వీపం (ద్వైపాయనము) మీద జన్మించినవాడు కాబట్టి ద్వైపాయనుడు అనీ ఆయనకు ఆ పేరు స్థిరపడిందంటారు. అప్పటివరకూ ఉన్న వేద సాహిత్యాన్ని క్రోడీకరించి, నాలుగు భాగాలుగా విభజించాడు కాబట్టి ఈ కృష్ణద్వైపాయనుడు ‘వేదవ్యాసుడు’గా మారాడు. వేదవ్యాసుడు అనగానే మహాభారతం గుర్తుకు వస్తుంది. వ్యాసుడు మహాభారత రచయితే కాదు, అందులో ఒక ముఖ్య పాత్ర కూడా! ఇంకా చెప్పాలంటే వ్యాసుడు లేనిదే భారతం లేదు. ఎందుకంటే వ్యాసుని కారణంగానే దృతరాష్ట్రుడు, పాండురాజు, విదురులు జన్మించారు. మరి వ్యాసుడు లేకపోతే కౌరవపాండవుల ఉనికే ఉండేది కాదు కదా!
వ్యాసుడు కేవలం భారతాన్నే కాదు, భాగవతం సహా అష్టాదశ పురాణాలనీ రాశాడనీ… యోగసూత్రాలకు భాష్యాన్ని అందించాడనీ చెబుతారు. ఇక బ్రహ్మసూత్రాలను రాసిన బాదరాయణుడు మరెవ్వరో కాదు, వ్యాసుడు అని నమ్మేవారు కూడా లేకపోలేదు. అంటే హైందవ సంస్కృతికి మూలమైన వాఙ్మయమంతా వ్యాసుడు వల్ల ఒక కొలిక్కి వచ్చిందన్నమాట. అలాంటి వ్యాసుని గురుపరంపరకు ప్రతినిధిగా భావించి, ఆయన పుట్టినరోజుని గురువులను ఆరాధించుకునే పండుగగా జరుపుకోవడంలో ఆశ్చర్యం ఏముంది!

ఆదియోగి శివుడు: గురువుద్వారా ఎంతో కొంత జ్ఞానాన్ని ఆర్జించి, దానిని ఆచరణలో పెట్టినవాడే యోగిగా మారగలడు. కానీ ఎలాంటి గురువూ అవసరం లేకుండానే నిర్వికల్ప స్థితిని సాధించినవాడు ఆ పరమేశ్వరుడు ఒక్కడే! అందుకనే ఆయనను ఆదియోగిగా కొలుచుకుంటున్నారు. అలాంటి ఆదియోగి నుంచి జ్ఞానాన్ని పొందుదామనుకుని ఎందరో ప్రయత్నించి విఫలమైనారట. కానీ ఒక ఏడుగురు మాత్రం పట్టు విడువకుండా ఆయన చెంతనే ఉండిపోయారు. తమతో ఆయన ఒక్క మాట మాటలాడకున్నాగానీ సంవత్సరాల తరబడి ఆయన కరుణ కోసం వీక్షిస్తూ తపించిపోయారు.

శివుడు వారి పట్టుదలను పరీక్షించేందుకు దశాబ్దాల తరబడి వారికి ఎటువంటి బోధా చేయలేదు. అయినా వారి పట్టు సడలనేలేదు. శివుని దివ్యసముఖంలో తపస్సుని ఆచరిస్తూ ఉండిపోయారు. చివరికి ఒకరోజున వారిని గమనించిన శివుడు, జ్ఞానాన్ని స్వీకరించేంతటి తేజస్సు వారిలో ప్రకాశించడాన్ని గమనించాడు. అటుపై దక్షిణదిక్కుగా కూర్చుని వారికి ఉపదేశాన్ని అందించాడు. అలా శివుడు దక్షిణామూర్తిగా, జ్ఞానానికి అధిపతిగా మారాడు. ఆయన నుంచి యోగాన్ని అభ్యసించిన ఆ ఏడుగురూ సప్తర్షులు అయ్యారు. శివుడు దక్షిణ దిక్కుగా ఎందుకు కూర్చున్నాడు అనడానికి ఒక హేతువు కనిపిస్తుంది. దక్షిణదిక్కు యమస్థానం! అంటే మృత్యువుకి సంకేతం. ఆ మృత్యువుకి అతీతమైన జ్ఞానాన్ని, సంసార బంధనాలను ఛేదించే యోగాన్ని అందించేందుకే పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా మారి ఉంటాడు.

మరిన్ని విశేషాలు:

– గురుపౌర్ణమి చాతుర్మాస సమయంలో వస్తుంది. యతుల అటూఇటూ తరగకుండా ఒకచోట ఉండి జ్ఞానబోధ చేసే సమయమే ఈ చాతుర్మాసం. ఈ కాలంలోని తొలి పౌర్ణమి గురుపౌర్ణమే. అంటే తమకు సమీపంగా నివసిస్తున్న తపస్సంపన్నులను సమీపించి, పూజించి… వారి నుంచి జ్ఞానాన్ని సాధించే ఆచారానికి గురుపౌర్ణమి భూమికగా నిలుస్తుందోన్నమాట.

– గురుపౌర్ణమి సాధారణంగా దక్షిణాయనంలో వస్తుంది. పగటివేళలు తగ్గి, చీకట్లు త్వరగా కమ్ముకునే ఈ నిశికాలంలో శరీరమే కాదు, మనసు కూడా మత్తుగానే తూగుతుంది. అజ్ఞానానికీ, చీకటికీ పెద్ద తేడా ఏముంటి! అలాంటి సమయంలో జ్ఞానం గురించి, గురుమహిమ గురించి తలుచుకునేందుకు గురుపౌర్ణమి గొప్ప సందర్భంగా మారుతుంది.

– వేదవ్యాసుడు అనేవాడు కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదనీ, అది ఒక బిరుదమనీ అంటారు. వేదాలను సంరక్షించే ప్రయత్నం ఎవరు చేసినా వారు వేదవ్యాసునిగా పిలువబడతారట. బహుశా అందుకనే కావచ్చు… వేదవ్యాసుని మరణం లేనివాడుగా చెబుతారు. వేదం అంటే జ్ఞానానికి ప్రతిరూపం కదా!

బుద్ధుడు జ్ఞానోదయాన్ని పొందిన తరువాత ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజునే తొలి బోధను చేశాడని బౌద్ధగాథలు పేర్కొంటున్నాయి. ఈ తొలి ఉపన్యాసంలోనే ఆయన నాలుగు ఆర్యసూత్రాలను (Four Noble Truths) తన వెంబడి వచ్చిన శిష్యులకు అందించారు.

కాబట్టి… మనకు విద్య, జ్ఞానాన్ని బోధించిన గురువులను తలుచుకునేందుకూ, ఎదుట ఉన్న జ్ఞానులను గౌరవించుకునేందుకూ ఇంతకంటే గొప్ప తిథి మరేముంటుంది. అందుకనే సాక్షాత్తూ ఆ ఆదిశంకరులవారే ఈ పర్వదినాన్ని ప్రారంభించారని చెబుతారు.

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.