వారసత్వం (19-11-1964)

0
245

అలనాటి చిత్రాలు -97

వారసత్వం (19-11-1964)

1964 లో విడుదలైన గుడిగంటలు (14-01-1964) , రాముడు భీముడు (21-05-1964) , అగ్గి పిడుగు (31-07-1964), దాగుడుమూతలు (21-08-1964), బొబ్బిలి యుద్ధం (04-12-1964), సమీక్షలు ఇదివరకూ ముచ్చటించుకున్నాము. ఈ రోజు సాయంకాలం 7 గంటలకు ఈ టీ వీ సినిమా (టాటా స్కై చానెల్ 1447) లో 19-11-1964 న విడుదలైన వారసత్వం సినిమా వస్తోంది. ఆ చిత్ర వివరాలు:-

అసలు కధలో జిగి అంతగా లేకుండా కేవలం కధనకారిత్వంతోనూ దర్శకత్వంలోనూ బిగి ఉన్నప్పుడు ఆ పరిస్థ్తుల్లో అప్పటికదే బాగు. కానీ ఈ రెండూ సమానంగా ఉన్న సందర్భంలో ప్రేక్షకులకు సంతృప్తి లభిస్తుంది. కధకుడు లక్షించినదానిని దర్శకుడు ప్రేక్షకులకు చక్కగా అందించడాన్నిబట్టి కధకుని రచనా శక్తి , కధనకారిగా దర్శకుని ప్రజ్ఞా శక్తి ఉభయం వెల్లడవుతుంది.

వారసత్వం సినిమాలోఅ అలా రెండు శక్తులు కలిసాయి. దర్శకుడుగా చాణక్య ప్రతిభకీ చిత్రం మరొక ఉదాహరణ. కాగా రచయితగా బరంపురం కొల్లాడిగారు అటు కధ, ఇటు సంభాషణల రచనలో కనబరచిన ప్రతిభ స్పష్టమౌతుంది. ఒకొక్కప్పుడు సూటిగాను, మరొకప్పుడు వ్యంగ్యాత్మకంగా ఉన్న అతని సంభాషణలనుబట్తి కధ తెరునుబట్టి సమాజంలో జరుగుతున్న అక్రమాలపట్ల అధమ చర్యలపట్ల అతనికి గల కినుక ద్యోతకమౌతుంది. ఎవరిలో ఎలాంటి శక్తి నిక్షిప్తమై ఉంటుందో, అవకాశం కలిగినప్పుడు కాని బయటకు రాదు కదా.

సంపద మనిషిలోని సౌజన్య సంపదను క్రమంగా ఎలా నాశనం చేస్తుందో కధకుడు శక్తివంతంగా తెలుపుతాడు. “ఏదో ఇంత తినే ఇంటికి, సుఖపడే ఇంటికి పిల్లనిద్దాం” అనే ఆదుర్దాలో వయసు అంతరాన్ని దాటవేయడంతో మొదలై “అంతటికీ తానే అధికారి” కావాలనేందుకు మనుషులు తయారౌతారు. ఆ ప్రయత్నంలో తనకంటే ఘటికులైన వారివల్ల విఫలమైనప్పుడు తమ తప్పు తెలుసుకుంటారు.

మరికొందరు పదవి కొరకు ఎన్ని దుర్మార్గాలకైనా తయారు. విద్య, రూపం కలిగిన భార్య కంటే కట్నం కింద మోటారు సైకిలును, ఇంకా అలాంటి బహుమతులను ముఖ్యమనుకునే వారు కొందరు.

నిష్కారణంగా నిందలకు గురయ్యేవారు కొందరు. ఇలా సమాజంలోని పాత్రలు, ఘటనలే ఈ కధలోని పాత్రలు, ఘటనలు.

కధ, మాటలు: బరంపురం కొల్లాడి

పాటలు: ఆరుద్ర, నార్ల చిరంజీవి

సంగీతం : ఘంటసాల

చాయాగ్రహణం : ఎన్ ఎన్ వరం

శబ్దం: రంగ స్వామి

కూర్పు : మార్తాండ్

మేకప్ : హరిబాబు, భద్రయ్య, నాగేశ్వర రావు, వీర్రాజు, సత్యం, చిరంజీవి.

నృత్యం; పసుమర్తి, చోప్రా

దర్శకత్వం: తాపీ చాణక్య

నిర్మాణం : రంగారావు & శాస్త్రి

తారాగణం : నందమూరి తారక రామారావు (రఘు), రేలంగి (సంజీవి), గుమ్మడి (వెంకట్రావు), రాజనాల (నర సింహం) , నారాయణ స్వామి (వల్లభ రాయడు), డాక్టర్ శివ రామ కృష్ణయ్య (చిట్టి బాబు), పేకేటి శివరాం (గిరి), వై వి రాజు (పురుషోత్తం), అంజలీదేవి (శాంత), గిరిజ (సీత) , బాల సరసవతి (స్వరాజ్యం), నిర్మల (కాంతమ్మ), హేమలత, రాధా కుమారి, వంగర, సీతారం, రాజబాబు, అల్లు రామలింగయ్య , జ్యోతి (నృత్యం) వగైరా.

సైకిల్ రిపైర్ షాప్ చిట్తిబాబు (డాక్టర్ శివ రామ కృష్ణయ్య) కు రఘు (ఎన్ టి ఆర్) , స్వరాజ్యం (బాల సరస్వతి) బిడ్డలు. అతని మేనకోడలు సీతను (గిరిజ) కూడా పెంచి పెద్ద చేస్తాడు. ఏ ఆధారమూ లేని సీతను రఘుకిచ్చి పెండ్లి చేద్దామని చిట్టిబాబు తలంపు. తన చెల్లెలితోపాటు సీతను కూడా చెల్లిగానే చూస్తున్నందున ఆమెను వివాహమాడలేనని రఘు అన్నందుకు , దమ్మిడీ ఆదాయం లేకుండా ఇలా తన సంకల్పాన్ని ఎదిరించినందుకు చిట్టిబాబు తన కొడుకును ఇంటినుండి వెళ్ళగొడతాడు.

ఆస్థికొరకు కన్ను వేసి ఉంచిన రౌదీ నరసింహం (రాజనాల) జమీందారు వల్లభరాయుడు (నారాయణ స్వామి) ని హత్య చేసేందుకు చేసిన ఏర్పాట్లను రఘు త్రోవలో భగ్నం చేస్తాడు.

పట్నంలో స్నేహితుడు గిరి (పేకేటి) పెండ్లికి హాజరౌతాడు రఘు. మోటారు సైకిలు తెచ్చి ఇస్తే కాని తాళి కట్టనని భీష్మించుకు కూచున్న ఆ పెండ్లికొడుకు తోటి పెండ్లికి నిరాకరించిన శాంత (అంజలీ దేవి) ని రఘు మనసులో మెచ్చుకుంటాడు.

శాంత కంట్రాక్టరు వెంకట్రావు (గుమ్మడి) కి మొదటి భార్య కూతురు. చదువూ, చక్కదనమూ కలిగిన శాంతపై వెంకట్రావు రెండో భార్య (నిర్మల) తమ్ముడు రౌడీ నరసింహం కన్ను వేసి, ఎత్తులు వేస్తూ, అక్క ద్వారా కూడా పోరుసాగిస్తాడు.

ఇంట్లో ఈ పోరు, బహిరంగంగా పెండ్లి పీటలమీదనుండి ఆ పెండ్లి నిరాకరించి తనకు “చిన్నదనం” కలిగించిందన్న కోపం కలిగిన తండ్రి వలన శాంత చీవాట్లు తింటుంది. ఇంటినుండి వెళ్ళిపోయిన శాంత ఆవేశంతో ఆత్మహత్య చేసుకోబోగా రఘు కాపాడతాదు. వెంకట్రావు గారి ప్రశంసా పాత్రుడై ఆయన కాంట్రాక్టు కంపెనీలో నౌఖరీ సంపాదించుకుంటాడు. అంతే కాక సర్వలావణ్య శోభిత, సద్గుణ సంపన్న, సరస్వతీ ప్రసన్న అయిన శాంతకి రఘుకి మధ్య ప్రగాఢ ప్రణయమేర్పడుతుంది.

రఘుకి పట్నంలో సంజీవి (రేలంగి) అనే వ్యక్తితో సాంగత్యమేరప్దుతుంది. రఘుదగ్గరున్న చెల్లెలు స్వరాజ్యం ఫొటో చూసి ప్రధమ చూపుల్లోనే ప్రణయానికి గురవుతాడు సంజీవి.

వారసులు లేని జమీందారు దత్తతకు సిద్ధమౌతున్నా, సంతానయోగముందని పెండ్లిండ్ల పేరయ్య (వంగర) పురెక్కించి ఒప్పిస్తాడు. చిట్టిబాబు తన కూతురుని ఇవ్వాలని ఉబలాట పడుతున్నా, జమీందారు సీతను కోరినందువల్ల “అదీ పరవాలేదులే” అన్నట్లు పెండ్లి చేశాడు.

సీత కొడుకును కన్నదన్న మాటను విన్న ఆనదంలో జమీందారు చనిపోయాడు. సైకిల్ షాపును అవతల పారేసి సంపదపై అధికారిగా కూచున్నాడు చిట్టి బాబు.

ఒక ఎత్తుగడగా సంపదపై చిట్టి బాబును కూచోబెట్టిన నరసింహం విజృంభిస్తాడు. పిల్లవాడిని చంపెయ్యాలన్న ప్లానుకు వీలుగా నష్ట జాతకుడని తల్లినుండి పిల్లవాడిని వేరు చేస్తాడు. చిట్టిబాబు చర్యలు చూపించి తండ్రీ కొడుకులు ఏకమై డబ్బులు కాజేస్తున్నారని నిందలు మోపి చిట్టిబాబుకు ఉద్వాపన పలికించి సీతవలన తాను ఆస్థిపై అధికారం సంపాదిస్తాడు నరసింహం. శాంత కొరకు ఆస్థిని, అధికారాన్ని వినియోగించనారంభించాడు.

పిల్లవాడిని చంపించడానికి నరసింహం రౌడీలనుపయోగించాడు కానీ పని జరగలేదు. పిల్లవాడు రఘు చేతుల్లో పడ్డాడు.

“ఈ పిల్లవాడెవరు? వానిపై రఘుకు ఇంత మమకారమేమిటి? ఇంతకీ ఈ పిల్లవాడు రఘుకు ఏమి కావాలి?” ఈ ప్రాశ్నలే రఘుకు శాంతకూ మధ్య అపోహలకు కారనమయ్యాయి.

అపోహపడిన శాంతకూడా నరసింహం పిల్లవాడిపై కత్తి కట్టడాన్ని చూచాయగా గ్రహించింది. ఆఖరుకు అన్నీ బయట పడతాయి. నరసింహాన్ని పోలీసులు పట్టుకుంటారు. రఘు శాంతలకు వివాహమౌతుంది.

ఘంటసాల సంగీత దర్శకత్వం చాలా బాగుంటుంది. నేపధ్య సంగీతం కొన్నిచోట్ల ఇంకా బాగుంటుంది. పాటలన్నీ సంగీతం, సాహిత్యం, నటన అన్నీ తీరుగా హాయిగా ఉంటాయి.

ప్రేయసి మనోహరి వరించి చేరవే ప్రేయసీ – ఘంటసాల,సుశీల – రచన: ఆరుద్ర

చిలిపి కృష్ణుని తోటి చేసేవు పోటీ, ఆ స్వామితో నీవు అన్నింట సాటి జోజో జోజో – ఘంటసాల, పి.లీల – రచన: నార్ల చిరంజీవి

పేరైనా అడుగలేదు ఊరైనా అడుగలేదు వెతలన్నీ అతనికి – సుశీల – రచన: నార్ల చిరంజీవి

సుడిగాలీలో చిరుదీపము మనజాల లేదోయి – పి.లీల – రచన: ఆరుద్ర

ఇచటనే ఇచటనే విరసె మొదటి ప్రేమ ఇపుడే వేడికంటి నీరు – జిక్కి – రచన: ఆరుద్ర

మనగుట్టే నిలుపుకోవాలి నీ మారము గుణమే – సుశీల,ఘంటసాల – రచన: నార్ల చిరంజీవి

నీ మీద మనసాయెరా నా ముద్దు చెల్లించరా – కె.రాణి – రచన: ఆరుద్ర

రఘుగా ఎన్ టి ఆర్, శాంతగా అంజలీదేవి ముఖ్యపాత్రల్లో కధకు ఆలంబనమని వేరే చెప్పనక్కరలేదు.

శాంతగా అంజలీదేవి గోముగా ముద్దుగా నటించారు. సుమారు ఏడాదిన్నరకు పైన “లవ కుశ, పరువు ప్రతిష్ట” తర్వాత అంజేఎదేవి కనిపించినది వారసత్వం చిత్రంలోనే. సావిత్రి, అంజలి మొదలైన వారికి ఎంత ప్రతిభ ఉన్నా, కేవలం గ్లామర్ మోజులో పడి కొత్త కొత్త నాయకీమణులతో సినిమాలు తీయడం ప్రారంబమైంది 1964 నుండి. అక్కినేని అంజలి తో జంటగా 1964 తర్వాత వేసిన సినిమాలున్నట్లు నాకు గుర్తు లేదు. ఎన్ టి ఆర్ మాత్రం సావిత్రి, అంజలి, జమున వంటి తారలతో జంటగా నటించిన సినిమాలు 1974 వరకూ కూడా ఉన్నాయి.

రేలంగి, బాల సరస్వతి జంట చక్కని హాస్యం అందించారు.

నర్తకి జ్యోతి నీ మీద మనసాయెరా పాటకు హుషారుగా నృత్యం చేసింది.

కధలోని పాత్రలు గాలిలోనివి కావు. సమాజంలోని మంచి చెడ్డలకు స్పష్తమైన సంకేతాలని, సంపదో, సామ్రాజ్యాధికారమో ఏదో ఒకదానిని ఆస్రయించుకుని ఎన్నో అఘాయిత్యాలు జరిగాయి. జరుగుతున్నాయి. “వార్సత్బ్వం” సినిమా లోని పాత్రలు వీటినే ప్రతిఫలిస్తాయి. ఆ అఘాయిత్యాల ఫలితాన్ని మన్ముందుంచి మన్లో తద్వ్యతిరేక భావాన్ని కలుగచేయడానికి ప్రయత్నిస్తాయి.

సంపద చుట్టూ పరిభ్రమించే సమాజంలోని కల్మష వాతావరణాన్ని , అందులోనే వున్న కొందరు నిష్కల్మషుల ఇబ్బందుల్నీ వారసత్వం సినిమా ద్వారా కధకుడూ, కధనకారీ మనముందు శక్తివంతంగా వుంచడానికి ప్రయత్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.