పచ్చ పెసలు రోటి పచ్చడి.

మామూలుగా పెసర పచ్చడి చేసుకోవడానికి మేము చాయ పెసర పప్పు నానబోసుకుని చేసుకుంటాము .

ఇటీవల మా బంధువుల ఇంట్లో భోజనములో పెసర పచ్చడి వడ్డించారు .

పచ్చడి చాలా రుచిగా ఉందని మేము అంటే మేము పచ్చ పెసలు నానబోసుకుని చేసుకుంటామని వారు చెప్పారు .

అందువలన మేము ఈసారి పచ్చ పెసలు నానబోసి పెసర పచ్చడి చేసుకున్నాము .

చాయపెసరపప్పు తో కన్నా పచ్చ పెసలు తో చేసిన పచ్చడి చాలా రుచిగా ఉంది .

పై పొట్టు తీయకుండా ఈ పచ్చడి చేసుకుంటాము కనుక మనకు ఆరోగ్యరిత్యా కూడా మంచిది .

అందువలన తయారీ విధానము మనందరికీ తెలియ చేస్తున్నాను .

పచ్చ పెసలు తో పచ్చడి .

కావలసినవి .

పచ్చ పెసలు — 100 గ్రాములు .
ఎండుమిరపకాయలు — 10 ( వేయించనవసరం లేదు. ముక్కలుగా చేసుకోవాలి )
జీలకర్ర — స్పూనున్నర
ఇంగువ — మరి కాస్త ఎక్కువ .
ఉప్పు — తగినంత

సాధారణంగా మేము పచ్చడి పైన పోపు వేసుకోము .

మొన్న పచ్చడి పైన మా బంధువులు నేతితో పోపు పెట్టారు .

అందువలన మేము కూడా ఈసారి పచ్చడి పైన నేతితో పోపు పెట్టాము .

పులుపు ఇష్టమైన వారు ఒక కాయ నిమ్మరసం కూడా పచ్చడిలో పిండు కుని పైన పోపు పెట్టుకోవచ్చును.

పోపునకు.

ఎండుమిరపకాయలు — 4 ( ముక్కలుగా చేసుకోవాలి )
చాయమినపప్పు — స్పూను
ఆవాలు — అర స్పూను
కరివేపాకు — మూడు రెమ్మలు
నెయ్యి — మూడు స్పూన్లు

తయారీ విధానము .

ముందుగా పచ్చ పెసలు ఒకసారి కడిగి మునిగే వరకు నీళ్ళు పోసి నాలుగు గంటల పాటు నాన బెట్టు కోవాలి .

ఆ తర్వాత పెసలు విడిగా వడకట్టు కోవాలి .

ఇప్పుడు రోటిలో నానబెట్టిన పచ్చ పెసలు , ఎండుమిరపకాయల ముక్కలు ( వేయించనవసరం లేదు ) , జీలకర్ర , పచ్చి ఇంగువ మరియు సరిపడా ఉప్పు వేసి వేసి కొద్దిగా నీళ్ళు పోసుకుని , మధ్య మధ్య నీళ్ళు చిలకరించుకుంటూ పొత్రముతో మరీ మెత్తగా కాకుండా రుబ్బుకోవాలి .

తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని ఇష్టమైన వారు ఒక కాయ నిమ్మరసం పిండుకోవచ్చును .

మేము అప్పడాల పిండి రుచిలా అన్నం లోకి బాగుంటుందని నిమ్మరసం పిండుకోము .

తర్వాత స్టౌ మీద బాండీ పెట్టుకుని మూడు స్పూన్లు నెయ్యి వేసుకుని నెయ్యి బాగా కాగగానే ఎండుమిర్చి ముక్కలుగా చేసి , చాయమినపప్పు , ఆవాలు మరియు కరివేపాకు వేసి పోపు వేసుకుని పచ్చడిలో కలుపుకోవాలి .

అంతే ఎంతో రుచిగా ఉండే పచ్చ పెసలు తో నానబెట్టిన పచ్చడి సర్వింగ్ కు సిద్ధం.

మార్కెట్లో పచ్చ పెసలు , నల్ల పెసలు రెండూ దొరుకుతాయి .

పచ్చ పెసలు నాన పోసి చేసుకుంటే పచ్చడి రుచిగా ఉంటుంది .

రోటిసౌకర్యము లేని వారు ఇదే విధముగా మిక్సీ లో చేసుకొనవచ్చును .

సంబంధిత రెసిపీ మరియు ఫోటో నా స్వంతం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.