నిజం…మా ఆయన బంగారం

0
140

నిజం…మా ఆయన బంగారం:(Good story,abstracted from eenadu.net)
===================
పెళ్లీడుకొచ్చిన అమ్మాయికి చాలా ఆశలుంటాయ్‌. కలలుంటాయ్‌. చేసుకోబోయేవాడు అందగాడు, ఆస్తిపరుడై ఉండాలని కోరుకుంటారు. నేనూ అందరిలా వూహల్లో తేలిపోయేదాన్ని.నాకో కజిన్‌ ఉండేది. నా వయసే. ఒకేలా ఆలోచించేవాళ్లం. డిగ్రీ కాగానే తనకో మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. ఇద్దరిలో ఒకరి కల నెరవేరింది. కొద్దిరోజులకే నా వంతు. ‘అబ్బాయి అందంగా ఉంటాడు. నెలకి ఎనభైవేల జీతం. ఆస్తిపరులు’ నాన్న చెబుతుంటే నా పాదాలు గాల్లోకి లేచాయి. చివర్లో ‘కానీ’ అంటూ ఆగిపోయారు. నాలో కంగారు. ‘తను కొంచెం హ్యాండీక్యాప్డ్‌. సర్దుకుపోవాలమ్మా’ అనడంతో గుండె కలుక్కుమంది. ‘నాకీ సంబంధం వద్దు’ క్షణం ఆలోచించకుండా చెప్పేశా. రెండ్రోజులు మౌనవ్రతం చేశా. ‘ఇంతకంటే మంచి సంబంధం తేలేనమ్మా. దయచేసి అర్థం చేసుకో. ఎవరితోనూ పోల్చి చూసుకోవద్దు’ చేతులు పట్టుకొని అర్థించారు నాన్న. జలజలా కన్నీళ్లు రాలాయి.
ముహూర్తం పెట్టుకున్నాం. నా కష్టాలు మొదలయ్యాయి. మంచి సంబంధం దొరికింది అన్నవాళ్లే అవిటివాడ్ని చేసుకుంటోందని చాటుగా గుసగుసలాడుకునేవాళ్లు. ఈ బాధలో నేనుంటే ఆయన ఫోన్‌. మాట్లాడ్డం ఇష్టంలేక ఏదో చెప్పి తప్పించుకునేదాన్ని. ఈ బాధలోనే పెళ్లి కూడా జరిగిపోయింది. ఏదైనా ఫంక్షన్‌కెళ్తే నా కజిన్‌ జంటని ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’ అనేవాళ్లు. నాకేమో జాలి చూపులు. ఇది భరించేక నా జీవితం త్వరగా ముగిస్తే బాగుండు అనుకున్నరోజులున్నాయి. నా మనసులో ఉన్నది మా ఆయనకు తెలియదు కదా! నన్ను ఇంప్రెస్‌ చేయడానికి తెగ ప్రయత్నించేవారు.
పెళై్ల ఏడాదైంది. ఓసారి మా ఇంటికి బంధువులొచ్చారు. నా కజిన్‌ కాపురం బాగా లేదన్నారు. తన భర్త రోజూ తాగొచ్చి గొడవ చేస్తాడనీ, జల్సాలకు చాలా ఖర్చు చేస్తున్నాడని చెప్పారు. బాధేసింది. ‘తనతో పోలిస్తే నువ్వు అదృష్టవంతురాలివి. మీ ఆయన చాలా మంచోడు’ అన్నారు. మొదటిసారి మా ఆయన గురించి మనస్ఫూర్తి ప్రశంస విన్నా. అది నాకో టానిక్‌లా పనిచేసింది. నిజంగా నా భర్త అంత మంచివారా? ఆలోచనలు మొదలయ్యాయి. ఎంగేజ్‌మెంట్‌ నుంచి ఆయన్ని దూరంగా పెడుతున్నా. చిరాకు పడుతున్నా. మా ఆయన మాత్రం నన్ను ఒక్క మాట అన్లేదు. పైగా ఏ లోటూ రాకుండా ప్రేమగా చూసుకునేవారు. ఆలోచిస్తుంటే నేనెంత అమానుషంగా ప్రవర్తించానో బోధ పడింది. ఆరోజు నుంచే మారాలనుకున్నా.
ప్రతి వీకెండ్‌, ప్రతి ఫంక్షన్‌కి ఆయనతో కలిసి బయటికెళ్లేదాన్ని. ఇష్టంగా, మనస్ఫూర్తిగా. ఈ మార్పు చూసి నా భర్త చాలా సంతోషించారు. ఇంతలో ఆయనకు జర్మనీ వెళ్లే అవకాశమొచ్చింది. దేశం దాటాక మా మధ్య అన్యోన్యత మరింత పెరిగింది. ఆయన ఆఫీసు నుంచి వచ్చేవరకు ఎదురుచూడటం… సరదాగా బయటికెళ్లడం… భలే థ్రిల్లింగ్‌గా ఉండేది. ఇద్దరం కలిసి దిగిన ఫొటోల్ని అప్పుడప్పుడు సరదాగా ఫేస్‌బుక్‌లో పెట్టేదాన్ని. ‘మీ ఆయన హీరోలా ఉన్నాడే’ అనేవారు ఫ్రెండ్స్‌. నాలో కొత్త అనుమానం మొదలైంది. ‘మీరు ఏ అమ్మాయినైనా ప్రేమించారా?’ అడిగానోసారి. తిండికీ లేని నేపథ్యం… బడికి కిలోమీటర్లు నడిచి వెళ్లిన రోజుల గురించి చెప్పారు. మంచిస్థాయికి చేరడం కోసం కాలేజీ రోజుల్లో చదువు తప్ప వేరేవాటిపై దృష్టి పెట్టలేదన్నారు. నా కళ్లు చెమర్చాయి.
ఏడాదిలో మా ఆయన ప్రాజెక్ట్‌వర్క్‌ విజయవంతంగా పూర్తైంది. ఇండియా తిరిగొచ్చాం. రిసీవ్‌ చేసుకోవడానికి బంధువులు, స్నేహితులు చాలామంది ఎయిర్‌పోర్ట్‌కి వచ్చారు. మా ఆయనతోపాటు నన్నూ పొగడ్తల్లో ముంచెత్తారు. అదీ మనస్ఫూర్తిగా. ఒక గొప్ప వ్యక్తి భార్యగా నేనెంతో పొంగిపోయా. ఇంటికొచ్చాక విన్న ఓ వార్త కలవరపాటుకి గురి చేసింది. చెడు అలవాట్లతో నా కజిన్‌ భర్త ఆస్తి మొత్తం కరిగించాడట. కుటుంబం గడవడానికి తను ఉద్యోగం చేస్తుందని తెలిసింది.
నేను గొప్ప స్థానంలో ఉన్నానని చెప్పడానికి మీ ముందుకు రాలేదు. జీవిత భాగస్వామి ఎంపికలో అందం, ఆస్తి ఒక్కటే ప్రామాణికం కాదు. గుణగణాలు, వ్యక్తిత్వం అంతకన్నా ముఖ్యమని అనుభవంతో చెబుతున్నా. – విజయ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.