నడుంనొప్పి నివారణకు మార్గాలివిగో

0
191

నడుంనొప్పి నివారణకు మార్గాలివిగో….!

మహిళల్ని ఎక్కువగా వేధించే ఆరోగ్య సమస్యల్లో నడుంనొప్పి కూడా ఒకటి. ఇంట్లో రోజువారీ పనులు చేయడం వల్ల, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం వల్ల వచ్చే నడుమునొప్పి.. లేదా నెలసరి సమయంలో సాధారణంగా వచ్చే నొప్పి ఇలాంటి మహిళల జీవితాల్లో సహజం.. ఈ నొప్పి నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి చాలామంది మహిళలు రకరకాల క్రీములను ఆశ్రయిస్తుంటారు. అయితే వీటి ప్రభావం కొద్దిసేపటికే పరిమితం కావచ్చు. వీటివల్ల నొప్పి పూర్తిగా తగ్గక, మళ్లీ ఇబ్బందిపెట్టే అవకాశం ఉంటుంది. నడుంనొప్పి నుంచి పూర్తి ఉపశమనం పొందాలంటే కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.

* మరి అవేంటో …..!

• గసగసాల పొడితో..

వంద గ్రాముల గసగసాలను మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దాని నుంచి రెండు చెంచాల పొడి తీసుకొని గ్లాసు పాలలో కలుపుకొని తాగాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేయడం వల్ల నడుంనొప్పి తక్షణం తగ్గే అవకాశం ఉంటుంది.

• అల్లంతో ఉపశమనం..

అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక చిన్న పాత్రలో కొన్ని నీళ్లు తీసుకుని మరిగించాలి. అందులో ముందుగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసి కనీసం పది నిమిషాల పాటు చిన్న మంటపై ఉంచాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారనిచ్చి వడకట్టుకోవాలి. దీనిలో కాస్త తేనె వేసి బాగా కలుపుకుని తాగితే నడుంనొప్పి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. లేదంటే కాస్త అల్లం పేస్ట్‌ను నొప్పి ఉన్న చోట రాసి ఓ పది నిమిషాల పాటు అలాగే ఉంచుకుని కడిగేసుకోవాలి. తర్వాత నీలగిరి తైలం రాసుకుంటే చాలా రిలీఫ్‌గా అనిపిస్తుంది. అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నొప్పిని తగ్గించడంలో సహకరిస్తాయి.

• చల్లచల్లగా..

నొప్పిని, వాపును తగ్గించడంలో ఐస్‌ను మించింది మరోటి లేదు. అందుకే కొన్ని ఐస్ ముక్కల్ని ఒక ప్లాస్టిక్ సంచిలో వేసి.. దాన్ని టవల్‌లో మూటకట్టాలి. దీంతో నొప్పి ఉన్న ప్రదేశంలో కనీసం పదిహేను నిమిషాల పాటు ఉంచాలి. ఇలా నొప్పి తగ్గేంత వరకూ అరగంటకోసారి చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చాలా హాయిగా అనిపిస్తుంది.

• తులసి మిశ్రమం..

ఒక పాత్రలో కప్పు నీరు తీసుకోవాలి. అందులో పది తులసి ఆకుల్ని వేసి నీరు సగం అయ్యేంత వరకు మరిగించాలి. తర్వాత చల్లారనిచ్చి, వడకట్టి.. అందులో చిటికెడు ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని సాధారణ నొప్పి ఉన్నప్పుడు ఒకసారి, కాస్త ఎక్కువ నొప్పి ఉన్నప్పుడు రెండుసార్లు తాగడం వల్ల ఫలితం ఉంటుంది.

• పానీయాలు..

కప్పు నీటిని ఒక పాత్రలో పోసి మరిగించాలి. ఈ సమయంలో ఒక చెంచా చామోమైల్ (తెల్ల చామంతి)పువ్వును అందులో వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత వడకట్టుకుని తాగాలి. ఇలా రోజుకు కనీసం మూడుసార్లు తాగడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. లేదంటే గ్లాస్ పాలలో చక్కెరకు బదులుగా తేనె వేసుకుని రోజూ తాగడం వల్ల కూడా నడుంనొప్పి తగ్గే అవకాశం ఉంటుంది.

• మసాజ్‌తో మటుమాయం..

శరీరంపై అధిక పనిభారం పడినప్పుడు కండరాలపై ఒత్తిడి ఎక్కువగా పడి తద్వారా కండరాల్లో నొప్పి వస్తుంది. ఇది నడుంనొప్పికి దారితీస్తుంది. కాబట్టి ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి మసాజ్ మంచి ప్రక్రియ. కొబ్బరి, బాదం, నీలగిరి తైలం.. ఇలా ఏదో ఒక నూనెను గోరువెచ్చగా చేసి దాంతో నొప్పి ఉన్న ప్రదేశంలో బాగా మసాజ్ చేయాలి. ఫలితంగా నొప్పి నుంచి ఉపశమనం కలగడంతో పాటు కండరాలకు విశ్రాంతి లభిస్తుంది.
కాస్త కొబ్బరి లేదా నువ్వుల నూనెలో ఓ పది వెల్లుల్లి రెబ్బల్ని వేసి సన్నని మంటపై వేడిచేయాలి. వెల్లుల్లి రెబ్బలు గోధుమ రంగులోకి మారిన తర్వాత దింపేసి మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. తర్వాత నూనెను వడకట్టుకుని దాంతో నొప్పి ఉన్న ప్రదేశంలో మసాజ్ చేసుకోవాలి. కాసేపు అలాగే ఉంచుకుని గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. తద్వారా త్వరిత ఉపశమనం కలుగుతుంది.

• సులభమైన వ్యాయామాలు..

నడుంనొప్పిని తగ్గించుకోవడానికి సహజసిద్ధమైన పద్ధతులతో పాటు శరీరంపై తక్కువ తీవ్రతను చూపే యోగా, ఈత.. వంటి సులభమైన వ్యాయామాలను చేయడం మంచిది. వారానికి కనీసం మూడు గంటల పాటు ఈ రకమైన వ్యాయామాలు చేయడం వల్ల నడుంనొప్పిని 20 శాతం వరకు తగ్గించుకోవచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

• చూశారుగా.. నడుంనొప్పిని సహజసిద్ధంగా తగ్గించుకునేందుకు ఎలాంటి మార్గాలున్నాయో. మరి మీకెప్పుడైనా నడుంనొప్పి వేధిస్తున్నట్లయితే వీటిని పాటించి నొప్పి నుంచి ఉపశమనం పొందండి..!

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.