దేశోద్ధారకులు (29-03-1973)

0
369

అపురూప చిత్రాలు – 79

దేశోద్ధారకులు (29-03-1973)

సరిగ్గా 45 సంవత్సరాలక్రితం ఈ రోజు (29-03-1973) న విడుదలైన దేశోద్ధారకులు చిత్ర విశేషాలు. ఈ సినిమా ఎన్ టి ఆర్ నటించిన సాంఘికాలలో పూర్తి రంగులలో తీసిన తొలి చిత్రం.

ఎందరో మహనీయుల త్యాగఫలం ఈ స్వతంత్ర భారతం. పేద, ధనిక, కుల, మత వర్గ రహితంగా ప్రతి ఒక్కరికి ఇక్కడ స్వేచ్చావాయువులు పీల్చుకునే అధికారం ఉంది. మేధావి వర్గాలు మైకుల్లో ఊదరగొట్టే మాటలివి. వినడానికి ఇవి చాలా బావుంటాయి. కాని జరుగుతోందిమాత్రం అందుకు విరుద్ధం. ప్రజా సేవ ముసుగును కప్పుకొన్న ఖద్దరు గూండాల చేతుల్లో దేశం నలిగిపోతోందన్నది నిజం. ఈ నిజాన్ని ఎత్తి చూపిన సినిమానే “దేశోద్ధారకులు”. ఎన్ టి ఆర్ నటించిన రాజకీయ నేఫధ్య చిత్రాలలో ఇది ఒకటి. 1973 మార్చి 29 న విడుదలైన ఈ సినిమా అఖండ విజయాన్ని సాధించింది.

ఈ చిత్ర నిర్మాత యు విశ్వేశ్వరరావు గారు స్వతహాగా విప్లవభావాలు కలిగిన వ్యక్తి. అప్పటి కలుషిత రాజకీయాలపై కసి పెంచుకున్న ఆయన తనలోని భావాలను క్రోడీకరించి ఈ కధను సిద్ధం చేసుకున్నారు. తన విశ్వశాంతి పిక్చర్సుకు పర్మనెంట్ హీరో అయిన ఎన్ టి ఆర్ తొనే ఈ రాజకీయ సందేశం వినిపించాలని తీర్మానించారాయన. తన ప్రీవియస్ హిట్ కంచుకోట దర్శకుడు సి ఎస్ రావు గారిని దర్శకునిగా తీసుకున్నారు. సంభాషణలను అందించే బాద్యతను టి పి మహారధికి అప్పచెప్పారు. ఈస్ట్ మన్ కలర్ లో తీయాలన్నది ఆయన్ ఆలోచన. ఆ రోజుల్లో ఈస్ట్ మన్ కలర్ లో తీయడమంటే ఆషామాషీ కాదు. ముడి ఫిల్మ్ ను విదేశాలనుండే దిగుమతి చేసుకోవాలి. పైగా ఎన్నో అనుమతులు పొందాల్సిన పరిస్థితి. అప్పట్లో తెలుగు సినిమాకు అంతర్జాతీయ మార్కెట్ లేదు. అయితే దిగ్దర్శకుడు ఎల్ వి ప్రసాద్ చొరవతో ఎట్టకేలకు కలర్ ఫిల్మ్ ను తెప్పించుకోగలిగారు.

కలర్ లో సినిమా తీస్తే సరిపోదు కదా. అందుకు తగ్గట్టు సెట్స్, కాస్ట్యూంస్ కూడా కల్ర్ ఫుల్ గా ఉండాలి. ఈ విషయంలో కూడా విశ్వేశ్వర రావుగారు రాజీ పడ లేదు. కేవలం ఒక్క పాట కోసం డిల్లీనుంచి 30,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎన్ టి ఆర్ కు కాస్ట్యూం తెప్పించారు. సినిమాను అందంగా తెరపైకెక్కించడానికి విశ్వేశ్వరరావు ఎంత ఆరాటపడ్డారో, దర్శకులు సి ఎస్ రావు గారు అంతకుమించిన క్వాలిటీతో సినిమాను తీర్చి దిద్దారు.

అప్పటికే ఎన్ టి ఆర్ పల్లెటూరు, పెత్తందార్లు, కధానాయకుడు , దేశ ద్రోహులు, డబ్బుకు లోకందాసోహం మొదలైన రాజకీయ నేఫద్య చిత్రాలలో నటించినా , దేశోద్ధారకులు చిత్రం నిజంగా ప్రత్యేకం అనిపించే రీతిలో సి ఎస్ రావు ఈ చిత్రాన్ని మలిచారు.

ఎన్ టి ఆర్ నటించిన తొలి రాజకీయ వ్యంగ్య చిత్రమిది. ఆయన నటించిన తొలి రంగుల సాంఘిక చిత్రం కూడా ఇదే. ఇక ఈ సినిమాలో ఎన్ టి ఆర్ నటన న భూతో న భవిష్యతి. ఇందులో పద్మనాభం పై చిత్రీకరించిన “ఆకలైతే అన్నమడిగితే పిచ్చోడన్నారు” పాట నేటికీ హిట్ సాంగ్. ఈ సినిమాతో పద్మనాభం సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించారు.

ఇక మహారధి సంభాషణలైతే ఫిరంగి గుల్లే. కె వి మహదేవన్ పాటలు ఈ చిత్రానికి ఆభరణాలు. మబ్బులు రెండూ భేతి అయితే, ఇది కాదు మా సంస్కృతి, ఈ వీణకు శృతి లేదు, స్వాగంతం దొరా మొదలైన అన్ని పాటలూ నేటికీ శ్రోతలను అలరిస్తున్నాయి.

సావిత్రి, వాణిశ్రీ, నాగభూషణం, రాజనాల, అల్లురామలింగయ్య మొదలైన నటీ నటుల నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఈ చిత్రానికి 25 లక్షల ఖర్చు అయ్యింది. అయితే విడుదలైన 30 రోజుల్లో 30 లక్షలు వసూలు చేసి రికార్డు హిట్ గా నిలచింది. 12 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుంది. కడపలో 226 రోజులు ప్రదర్శితమయ్యింది.

“దేశాన్ని ఉద్ధరించడానికే పుట్టామని చెప్పుకుంటున్నవారంతా వారిని వారు ఉద్ధరించుకునేందుకే పాటుపడుతున్నారు. ఇటువంటి రాజకీయాలకు బుద్ధి చెప్పాలనే సంకల్పం కలిగింది. ఆ సంకల్పమ్నుండి దేశోఅద్ధారకులు చిత్రం పుట్టింది. రాజకీయ కధా వస్తువైనా రంగుల్లో చూపిస్తే మరింతగా ప్రజల్లో వెడుతుందని ఆశించాను. రాజకీయాలని సంస్కరించాలని సినిమా అయితే తీసాను గాని, సంస్కరించలేకపోఅయాననే బాధ మిగిలింది” అన్నారు విశ్వేశవర రావు గారు.

బతికున్న వ్యక్తులకు కూడా విగ్రహాలు పెట్టించుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఆ రోజుల్లో ఆ విధానం పై దాడి చేస్తూ ఆనాటి సామాజిక రుగ్మతల్ని చీల్చి చెండాడుతూ తీసిన చిత్రం “దేశోద్ధారకులు” సినిమా విడుదలై నేటికి 45 సంవత్సరాలు. ఈ చిత్రం విడుదలైన తర్వాత బ్రతికున్న వాళ్ళు విగ్రహాలు పెట్టించుకునే సంప్రదాయం కనుమరుగవడం దేశోద్ధారకులు సాధించిన ఓ విజయం.

ఈ సినిమాను నిర్మించిన యు విశ్వేశ్వర రావు గారు ఎన్ టి ఆర్ వియ్యంకుడు కూడా. ఎన్ టి ఆర్ పాత్ర, సినిమాని నడిపించిన కధనం ఈ చిత్రానికి ప్రత్యేకతలు. ఒకే పాత్ర మూడు విభిన్న పాత్రలుగా …సాధారణ యువకుడు, లండన్ నుంచి వచ్చిన తెల్ల దొర బ్రౌన్, చాకూ భరోసా నే నాటు రౌడి కనిపిస్తూ కధ నడిపించడం , అవి వేటికవే అన్నంత వైవిధ్యంగా నటించడం నేటికీ ఈ చిత్రానికి కొత్తదనం కలిగించే అంశం. అలాగే ఈ సినిమా కధనం విషయంలో పాటించిన సస్పెన్సును ఈ 45 ఏళ్ళలో ఒకసారి చూసి అర్ధం చేసుకున్నవారు లేరు. సినిమా అర్ధం కావాలంటే మళ్ళీ చూడాల్సిందే. అలా చూసేలా చేయడమే ఈ చిత్రం ప్రత్యేకత.

1973 మార్చి 29 న దశోద్ధారకులు సినిమా ఎన్ టి ఆర్ తొలి రంగుల సాంఘిక చిత్రం గా విడుదలై అఖండ విజయం సాధించి విడుదలైన అన్ని కేంద్రాలలో 50 రోజులు, 12 కేంద్రాలలో శత దినోత్సవాలు, కడపలో 230 రోజులు విజయవంతంగా ప్రదర్శించబ్డింది. అలాగే కలెక్షన్లలో మొదటి వారం 12 లక్షలు, 30 రోజుల్లో 30 లక్షలు వసూలు చేసిన తొలి తెలుగు చిత్రం గా దేశోద్ధారకులు ప్రభంజనం సృష్టించింది.

దేశోద్ధారకులు సినిమాకు 10 ఏళ్ళముందు ఇదే రోజు 29-03-1963 న విడుదలైన లవ కుశ , 10 ఏళ్ళ తర్వాత జరిగే ఎన్నికలౌగాను ఇదే రోజు 29-03-1982 న తెలుగు దేశం పార్టీ పెట్టడం ద్వారా ఎన్ టి ఆర్ జీవితంలో మార్చి 29 ఒక ప్రత్యెక స్థానం సంపాదించుకుంది.

మబ్బులు రెండూ

కోరుకున్న దొరగారూ

ఆకలై అన్నమడిగితే

ఇది కాదు మా సంస్కృతి

ఈ వీణకు శృతి లేదు

స్వాగతం దొరా

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.