తెనాలి రామకృష్ణ (12-01-1956)

0
594

అపురూప చిత్రాలు -106

తెనాలి రామకృష్ణ (12-01-1956)

1956 లో తెనాలి రామకృష్ణ (75 రోజులు) , జయం మనదే (13 కేంద్రాలలో 100 రోజులు) , చింతామణి, సొంత వూరు, ఉమా సుందరి, చిరంజీవులు, గౌరీ మహాత్మ్యం (100 రోజులు) , పెంకి పెళ్ళాం, చరణ దాసి (100 రోజులు) , భలే రాముడు (100 రోజులు), ఇలవేల్పు 9100 రోజులు) , కనక తార, హరిశ్చంద్ర, సదా రమ, ముద్దు బిడ్డ, మేలుకొలుపు, బాల సన్యాసమ్మ ల్కధ, మార్కండేయ చిత్రాలు విడుదలయ్యాయి.

12-01-1956 న విడుదలైన తెనాలి రామకృష్ణ చిత్ర విశేషాలు:-

ఈ చిత్రంలోనే తొలిసారిగా ఎన్ టి ఆర్ శ్రీ కృష్ణ దేవరాయలుగా వేయడం జరిగింది. ఈ చిత్రం అప్పట్లో 75 రోజులు ప్రదర్శితమైనది.

బి ఎన్ రంగా మలచిన రమణీయ దశ్యకావ్యం ‘తెనాలి రామకృష్ణ’
‘ఒకవైపు ఉర్రూతలూపు కవనాలు
ఒక ప్రక్క ఉరికించు యుద్ధభేరీలు
ఒక చెంప శృంగారమొలుకు నాట్యాలు’

అని కొనియాడేలా సాగిన శ్రీకృష్ణదేవరాయల పరిపాలన వైభవానికి అద్దం పడుతూనే, ఆనాటి రాజకీయాలను, సాహితీ విలాసాలను చిరస్మరణీయంగా తెలుగు ప్రేక్షకుల ముందు నిలిపిన చిత్రం ‘తెనాలి రామకృష్ణ’.

ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే అంతకన్నా ముందు ఆ చిత్ర దర్శకనిర్మాత బి.ఎస్. రంగా గురించి తెలుసుకోవాలి. ఆయన స్వయానా కన్నడిగుడు. కానీ శిక్షణ పొందింది బొంబాయిలో. ఛాయాగ్రాహకుడిగా ఎక్కువగా పనిచేసింది బొంబాయి, మద్రాసు నగరాల్లో. స్టూడియో నిర్మించింది మద్రాసులో. అందుకే ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాలు నిర్మించగలిగాడు. బి.యస్.రంగా అని పేరొందిన బిండిగణవలే శ్రీనివాస అయ్యంగార్ రంగా ‘‘లైలా మజ్నూ’’, ‘‘దేవదాసు’’ సినిమాలకు చాయాగ్రాహకుడుగా వ్యవహరించారు. తెలుగులో తొలి ఈస్టమస్ కలర్ సినిమా ‘‘అమరశిల్పి జక్కన్న’’ (1964) నిర్మించిన ఘనత కూడా రంగాదే. నలభైవ దశకంలోనే ‘‘పరదేశి’’, ‘‘ప్యాస్’’, ‘‘ప్రకాష్’’ వంటి హిందీ సినిమాలకు దర్శకత్వం నిర్విహించిన ప్రజ్ఞాశాలి కూడా అతడే. అక్కినేని, ఎన్ టి ఆర్, శివాజీగణేశన్, ఎం జి రామచంద్రన్, కన్నడ రాజకుమార్, కల్యాణ్ కుమార్, భానుమతి వంటి హేమాహేమీలతో సినిమాలు తీశారు.

‘‘తెనాలి రామకృష్ణ’’ చిత్ర దర్శకనిర్మాత బి.యస్. రంగా’ బెంగుళూరుకు దగ్గరలోని మగడి గ్రామ నివాసి. నాటకాలు, కళలమీద ఆసక్తితో తన 17వ యేటనే కెమెరా పట్టి లండన్లోని రాయల్ ఫొటోగ్రాఫిక్ సొసైటీ వారి సభ్యత్వం పొందారు. తరవాత బొంబాయి వెళ్లి కృష్ణగోపాల్ వద్ద శిష్యరికం చేశారు. ఆపై మద్రాసు చేరుకొని కొంతకాలం జెమినీ, భరణి స్టూడియోల్లో చాయాగ్రాహకునిగా సేవలందించారు. వాహినీ స్టూడియో సమీపంలో సొంతంగా ‘‘విక్రం స్టూడియో’’ నిర్మించి సినిమాల నిర్మాణం చేపట్టారు. తెలుగులో ‘‘మాగోపి’’ (1954) తొలి ప్రయత్నం కాగా, రెండవ ప్రయత్నమే ‘‘తెనాలి రామకృష్ణ’’ సినిమా.

తెలుగు తొలి టాకీ ‘‘భక్త ప్రహ్లాద’’ (1932) నిర్మించిన హెచ్.యం.రెడ్డి 1941లోనే రోహిణీ పతాకంపై ‘‘తెనాలి రామకృష్ణ’’ సినిమా నిర్మించారు. అందులో తెనాలి రామకృష్ణుడుగా లక్ష్మణస్వామి, కృష్ణదేవరాయలుగా పారుపల్లి సుబ్బారావు, తాతాచార్యులుగా కె.వి.సుబ్బారావు, తిరుమలాంబగా అనసూయ నటించారు. వెంపటి సదాశివబ్రహ్మం మాటలు, పాటలు రాయగా గండోపంత్ వాలావాల్కర్ సంగీతం సమకూర్చారు. ప్రఖ్యాత దర్శక నిర్మాత యల్వీ ప్రసాద్ అందులో తిమ్మరుసుగా, కరటకశాస్త్రిగా రెండు పాత్రలు పోషించడం ప్రత్యేకత.

ఈ నేపథ్యంలో రంగా, కన్నడ రచయిత సిహెచ్. వెంకట్రామయ్య రచించిన నాటకం ఆధారంగా ‘‘తెనాలి రామకృష్ణ’’ కథను సముద్రాల రాఘవాచార్యతో రాయించి దానిని చలనచిత్రంగా మలిచారు. ఈ చిత్రానికి నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలనే కాకుండా చాయాగ్రహణ బాధ్యతను కూడా తనే నిర్వహించడం విశేషం.

కథా సంగ్రహం
రామకృష్ణుడు (అక్కినేని) మంచి పండితుడు. అతని నివాసం తెనాలి. భార్య కమల (జమున), కొడుకు మాధవుడు (మాస్టర్ వెంకటేశ్వర్), తల్లి లక్ష్మమ్మ (వెంకుమాంబ).

కుటుంబం జరుగుబాటులేని పరిస్థితుల్లో తను రాసిన ‘ఉద్భటారాధ్య చరిత్ర’ కావ్యాన్ని, కవితా ప్రియుడిగా పేరొందిన రావూరు రంగారెడ్డికి అమ్ముకోవాలనే ఉద్దేశంతో రామకృష్ణ వెళతాడు. కానీ తన కావ్యం కన్నా, వీధిలో నాట్యం చేస్తున్న ఓ ఆటకత్తె పాటే బాగుందని అతడనడంతో ఉక్రోషం పట్టలేక కావ్యాన్ని చింపి ఆవేశంగా వెళ్లిపోతుంటాడు. ఆ కావ్యం గొప్పదనాన్ని గుర్తించిన ఒక యోగిపుంగవుడు అతడిని విజయనగర సంస్థానం చేరమని సలహా యిస్తాడు.

రామకృష్ణ కుటుంబంతో సహా బయలుదేరి మార్గమధ్యంలో దారి ప్రక్కనున్న కాళికాలయంలో బసచేస్తాడు. అర్థరాత్రి కాళికామాత ప్రత్యక్షమై రామకృష్ణ ముందు రెండు వెండిగిన్నెలలో పాయసం వుంచి వాటిలో ఒకటి విజ్ఞానాన్ని, రెండవది ధనాన్ని యిస్తుందనిచెప్పి ఏది కావాలో కోరుకోమంటుంది. రామకృష్ణ ఆ రెండు గిన్నెలనూ కలియబోసి గటగటా తాగేస్తాడు. కాళీమాత ఆగ్రహించి ‘‘వికటకవి’’ అయిపోతావని శపిస్తుంది.

రామకృష్ణ విజయనగరం చేరుకొని తెలివిగా శ్రీకృష్ణదేవరాయలు (ఎన్ టి ఆర్) వారి కొలువులో స్థానం సంపాదిస్తాడు. బహమనీ సుల్తానులు విజయనగర సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని పంపించిన కనకరాజు (మిక్కిలినేని) అనే గూఢచారి దూరపుబంధువునంటూ వరస కలిపి రామకృష్ణుడి ఇంట్లోనే మకాంపెడతాడు. రామకృష్ణ కవితాప్రతిభకు అసూయతో రగులుతున్న ఆస్థానకవి తాతాచార్యులు (ముక్కామల), కనకరాజు కుట్రను ఆసరా చేసుకుని రామకృష్ణుడిపై నింద వేస్తాడు. రాయలు మరణదండన విధిస్తాడు. అయినా రామకృష్ణ తెలివిగా తప్పించుకుని, ఆస్థాన జ్యోతిష్కుడు డబ్బాశతో సుల్తానుల గూఢచారితో చేతులు కలపడాన్ని పసికట్టి, మహామంత్రి తిమ్మరుసు (నాగయ్య) చెవిన వేస్తాడు.

తరువాతి ప్రయత్నంగా సుల్తానులు కృష్ణసాని (భానుమతి) అనే నర్తకిని వినియోగిస్తారు. రాయలువారు ఆమెతోనే సమయాన్ని గడపడాన్ని గమనించి హెచ్చరించబోయిన రామకృష్ణ తిరిగి రాజాగ్రహానికి గురై దేశబహిష్కరణ శిక్షకు లోనవుతాడు.

అయినా రామకృష్ణ యోగి వేషంలో క్రిష్ణసాని గుట్టు రట్టు చేస్తాడు.

ఆపై బహమనీ సుల్తానులకు గజసైన్యాన్ని పంపుతున్న ఢిల్లీ చక్రవర్తి బాబరు (డా।।కామరాజు)ను రామకృష్ణ మరో వేషంలో కలుసుకుని పరిస్థితులు వివరించి దాన్ని నివారిస్తాడు.

యుద్ధంలో బహమనీ సుల్తానులను ఓడించిన తర్వాత రామకృష్ణ చేసిన సాయం తెలుసుకున్న కృష్ణదేవరాయలు అతడిని ఆదరించడంతో సినిమా ముగుస్తుంది. సంధ్య, వంగర, సురభి బాలసరస్వతి, వెంకుమాంబ వంటి నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

సినిమా విశిష్టతలు
ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవలసింది దర్శకత్వం గురించి. కన్నడిగుడు కావటం చేత వి.యస్. రంగాచారి సహకారం తీసుకున్నారు. కానీ, సినిమా నిర్మాణం పూర్తయ్యేవరకు దర్శకత్వ సాయం పూర్తిగా అందించినవారు సముద్రాల. అంతేకాదు, మల్లాది రామకృష్ణశాస్త్రి అదృశ్యహస్తం కూడా ఈ సినిమా నిర్మాణానికి దోహదపడింది.

ముఖ్యంగా జయదేవ అష్టపది, అన్నమయ్య కీర్తన, చాటుపద్యాలు కలబోసి అలనాటి కృష్ణదేవరాయుని సాంస్కృతిక సాహిత్య కవితా వైభవాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దారు. సముద్రాల రాఘవాచార్య రచనావైభవాన్ని, ప్రతిభా పాటవాన్ని ఈ సినిమాలో ఆస్వాదించవచ్చు.

ముఖ్యంగా అక్కినేని, ఎన్ టి ఆర్, భానుమతి ముగ్గురూ కలిసి నటించిన చిత్రం ఇదొక్కటే. అక్కినేని తొలిసారి అనేక మారువేషాలలో కనుపించడాన్ని కూడా ఈ చిత్రంలోనే చూస్తాం.

ఆ రోజుల్లో ‘‘భారతి’’ సాహిత్య మాస పత్రికలో ఒక సినిమా గురించిన విశ్లేషణ రావడం ఈ చిత్రానికి మాత్రమే పరిమితమైంది.

ఇక భానుమతి క్రిష్ణసాని వేషం వెయ్యడానికి ఒప్పుకొవడం చిత్రపరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. భరణీ సంస్థలో రంగా చాయాగ్రాహకునిగా పనిచేయడం వలన ఆమె ‘‘తెనాలి రామకృష్ణ’’లో నటించిందని చెప్పుకున్నా, కొంత ఆమె స్వార్థం కూడా ఉందంటారు. భరణీ స్టూడియో నిర్మాణానికి ఆ రోజుల్లోనే పాతిక లక్షలు దాకా ఖర్చయింది. అందుకైన బాకీలు తీర్చడం కోసం ఇందులో నటించేందుకు ఒప్పుకుందని సన్నిహిత వర్గాలు చెప్పుకునేవి!

ఎన్ టి ఆర్ శ్రీ కృష్ణ దేవ రాయలు పాత్రలో పరకాయ ప్రవేశం చేసారు. అక్కినేని నటించిన మంచి మనసులు చిత్రంలో అహో ఆంధ్ర భోజా పాటలో ఎన్ టి ఆర్ తెనాలి రామకృష్ణ చిత్రంలోని క్లిప్పింగ్స్ వాడుకుని, దానివలన చిత్రానికి నిండుతనం వచ్చిందని స్వయానా ఆదుర్తి సుబ్బారావు గారు మంచిమనసులు శత దినోత్సవ సభలో చెప్పడం విశషం. ఆ తరువాత వచ్చిన మహా మంత్రి తిమ్మరసు సినిమాలో కూడా కృష్ణ దేవరాయలుగా ఎన్ టి ఆర్ తప్ప, వేరొక ప్రత్యామ్నాయం లేఅని, తిమ్మరసు పాత్ర ఎన్ టి ఆర్ మక్కువ చూపినా నిర్మాతలు పట్టు పట్టి ఎన్ టి ఆర్ చేత రాయలు పాత్ర వేయించడం గమనార్హం.

ఇందులో ఘంటసాల 14 పద్యాలు కూడా పాడారు. కానీ వాటికి పారితోషికం తీసుకోవడానికి నిరాకరిస్తే, బి.యస్. రంగా ఆయన ఇంటికి వెళ్లి భార్య సావిత్రికి పద్యానికి వంద రూపాయల చొప్పున పద్నాలుగు వందలు ఇచ్చి ఘంటసాల ఋణం తీర్చుకున్నారు.

విజయవాడ మారుతీ టాకీసులో ‘‘తెనాలి రామకృష్ణ’’ సినిమా తొమ్మిది వారాలకు పైగా ఆడి విజయవంతమైంది. ఈ సినిమా తొలి విడుదలకన్నా, రిపీట్ రన్ లలో బాగా ప్రేక్షకుల మన్ననలు పొందింది.

ఈ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికై రజత పతకాన్ని గెలుచుకుంది. ‘‘తెనాలి రామకృష్ణ’’ను సమాంతరంగా తమిళంలో ‘‘తెనాలి రామన్’’ పేరుతో నిర్మించారు. అందులో అక్కినేని పాత్రను శివాజిగణేశన్, రారలుగా ఎన్ టి ఆర్, ముక్కామల పాత్రను నంబియార్ పోషించారు.

సంగీత సౌరభాలు
ఈ సినిమాకి విశ్వనాథన్-రామ్మూర్తి జంట అందించిన సంగీతం అపూర్వం. తెలుగులో పాటలు, పద్యాలను సముద్రాల రాయగా తమిళంలో కణ్ణదాసన్, ఆత్మనాథన్, తమిళమణ్ణన్ రాశారు.

1. జయదేవుని అష్టపది ‘‘చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలీ’’ని సుశీల మోహన రాగంలో ఆలపించగా తిరుమలాంబగా నటించిన సంధ్య మీద చిత్రీకరించారు.
హరిరిహ ముగ్ధ వధూనికరే విలాసిని విలసతి కేళిపరే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలి
చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలి
కేళిచలన్మణి కుండల మండిత గండయుగ స్మితశాలీ
హరిరిహ ముగ్ధ వధూనికరే విలాసిని విలసతి కేళిపరే

కాపి విలాస విలోల విలోచన కేలన జనిత మనోజం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కాపి విలాస విలోల విలోచన కేలన జనిత మనోజం
ధ్యాయతి ముగ్ధ వధూరధికం మధుసూదన వదనసరోజం
ధ్యాయతి ముగ్ధ వధూరధికం మధుసూదన వదనసరోజం

హరిరిహ ముగ్ధ వధూనికరే విలాసిని విలసతి కేళిపరే

శ్లిష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామాం
పశ్యతి సస్మిత చారుతరాం అపరామను గస్యతి రామా.. ఆ ఆ ఆ…

హరిరిహ ముగ్ధ వధూని కరే విలాసిని విలసతి కేళిపరే
చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలి

2. రాయలవారిని వలలో వేసుకోవటానికి క్రిష్ణసాని పాడే శృంగార గీతం. ‘‘తీరని నా కోరికలే తీరెను ఈ రోజు- కూరిమి నా చెలిమి కోరెను రారాజు’’ అనే భానుమతి పాట ‘దేవదాసు’ చిత్రంలో ‘‘అందం చూడవయా ఆనందించవయా’’ పాటను గుర్తుకు తెస్తుంది.

3. ఘంటసాల ఆలపించిన ‘‘చేసేది ఏమిటో చేసెయ్యి సూటిగా వేసెయ్యి పాగా ఈ కోటలో’’ పాటను సంగీత దర్శకులు సింధుభైరవి రాగ చట్రంలో అమర్చారు – ఘంటసాల (రచన: సముద్రాల)
‘‘రహదారి వెంట మొక్క నాటిపెంచరా… కలవాడు లేనివాడు నిన్ను తలచురా, భువిని తరతరాల నీదు పేరు నిలుచురా’’ అనే చరణంలో పర్యావరణ పరిరక్షణను చాటారు సముద్రాల.

4. ఘంటసాల, నాగయ్య పాడిన ‘‘హరేరాం హరేరాం- గండుపిల్లి మేనుమరచి బండ నిదుర పోయెరా’’ పాట ఎంతో అందంగా అమరింది.

5. షణ్ముఖప్రియ రాగంలో భానుమతి ఆలపించిన ‘నీవేరా రా రాజీవేగా నయ విజయశాలి కృష్ణరాయ’’ పాట

6. రావు బాలసరస్వతి పాడిన ‘‘ఝణ్ ఝణ్ కంకణములూగ- ఘల్ ఘల్ కింకిణులు మ్రోగ కోరికలీడెర కూడేనురా’’ పాటను శుద్ధసారంగ రాగంలో తీర్చిదిద్దారు. ఈ పాటకు రాధాసాని పాత్ర పోషించిన సురభి బాలసరస్వతి సశాస్త్రీయంగా నృత్యం చేస్తుంది. ఈ పాటను తరవాతి రోజుల్లో ఎందుకో ప్రింటునుంచి తొలగించారు.

7. జమున ఆలపించే ‘‘జగములా దయనేలే జననీ సదాశివునీ’

8. కోమల పాడిన ‘‘ఓలాలా ఓలాలా కంచెల చెరిగే చేడె కురులపై’’,

9. రామకోటి పాడిన ‘‘ఆకతాయి పిల్లమూక అందాల చిలకా’’ పాటలు కూడా జనరంజకాలే.

ఇక పద్యాల విషయానికొస్తే, వాటిని ఆలపించిన తీరు గురించి చెప్పుకోవాలి. ఘంటసాల పాడిన బాణీలు అద్భుతమనిపిస్తుంది.

10. తురుపు జూపున జాలిన కొరత నురుపు (పద్యం) –

స్తుతమతి యైన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకేల కల్గెనో అతులిత మాధురీ (పద్యం) – ఘంటసాల
“స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె నీ
యతులితమాధురీమహిమ?” “హా! తెలిసెన్; భువనైకమోహనో
ద్ధతసుకుమారవారవనితాజనతాఘనతాపహారి సం
తతమధురాధరోదితసుధారసధారలు గ్రోలుటం జుమీ.”

గంజాయి తాగి తురకల సంజాతము చేత కల్లు చవికొన్నావా (పద్యం) – ఘంటసాల
గంజాయి తాగి తురకల
సంజాతము చేత కల్లు చవిగొన్నావా?
లంజల కొడకా! ఎక్కడ
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్

రంజన చెడి పాండవులరిభంజనలై విరటుకొల్వుపాలై రకటా (పద్యం) – ఘంటసాల
రంజన చెడి పాండవులరి
భంజనులై విరటు కొల్వు పాలైరకటా!
సంజయా! విధి నేమందును
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్ !

11. రాజనందన రాజ రాజస్తతుల సాటి తలప నన్నయవేమ ధరిణి (పద్యం) –
మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక (పద్యం) – ఘంటసాల

రాజనందన రాజ రాజాత్మజుల సాటి
తలప నల్లయ వేమ ధరణి పతికి
రాజనందన రాజ రాజాత్మజుల సాటి
తలప నల్లయ వేమ ధరణి పతికి

రాజనందన రాజ రాజాత్మజుల సాటి
తలప నల్లయ వేమ ధరణి పతికి
రాజనందన రాజ రాజాత్మజుల సాటి
తలప నల్లయ వేమ ధరణి పతికి

గీ: భావభవ భోగ సత్కళా భావములను
భావభవ భోగ సత్కళా భావములను
భావభవ భోగ సత్కళా భావములను
భావభవ భోగ సత్కళా భావములను.

దీనికి పేరడీఅయిన “మేకతోకకు మేక” పద్యానికి అర్థం ఉన్నా లేకపోయినా, ఈ పద్యానికి, దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు ఈ విధం గా అర్థం చెప్పారు.

సీస పద్యంలో మొదటి చరణం, గీతపద్యంలో మొదటి చరణం తో క్రమంగా అన్వయించుకోవాలి. అల్లగే, రెండవ చరణం, రెండవదానితో, మూడవ చరణం మూడవదానితో, సీసపద్యం ఆఖరి చరణం గీతపద్యం ఆఖరి చరణం తో, వరసగా అన్వయించుకోవాలి.

మొదటి చరణద్వయాల అర్థం, అన్వయం:

రాజ నందన = చంద్రుని కొడుకైన బుధుడు, ర = సమర్థుడైన, అజ= ఈశ్వరుడు, రాజ = దేవేంద్రుడు, ఆత్మజులు = బ్రహ్మదేవుడును

తలపన్ = ఆలోచించగా, అల్లయ వేమ ధరణిపతికి = అల్లయ వేమారెడ్డి అనే రాజుకు, సాటి = సమానులు

భావ = బుద్ధియందు, భవ = ఐశ్వర్యమునందును, భోగ = వైభవంలోనూ, సత్కళా = శ్రేష్టమైన విద్యలయొక్క
భావములను = అతిశయమందును

బుద్ధియందు, ఐశ్వర్యమందు, వైభవంలోను, శ్రేష్టమైన విద్యల యొక్క అతిశయములందూ, చంద్రుని కుమారుడైన బుధుడు, సమర్థుడైన ఈశ్వరుడు, దేవేంద్రుడు, బ్రహ్మదేవుడును, ఆలోచించగా అల్లయ వేమారెడ్డి అనే రాజుకు సమానులు.

రెండవ చరణద్వయాల అర్థం, అన్వయం:

ర + అజ + నందన = మనోహరుడైన శివునికి కుమారుడైన కుమారస్వామి, రాజ = కుబేరుడు
ర + అజ = శ్రేష్ఠుడైన , రఘువు కుమారుడైన యజుడు, ఆత్మజులు = చంద్రుడును

తలప అల్లయ వేమ ధరణిపతికి సాటి = ఆలోచించగా అల్లయ వేమా రెడ్డి అనే రాజుకు సమానులు.

భావ = క్రియ యందు, భవ = ధనమునందు, భోగ = పరిపాలనలో, సత్కళా = శ్రేష్ఠమైన కాంతి యొక్క
భావములను = సమూహమునందును

క్రియయందు, ధనమునందు, పరిపాలనలో శ్రేష్ఠమైన కాంతి సమూహమునందును, మనోహరుడైన శివుని కుమారుడైన కుమార స్వామి , కుబేరుడు, శ్రేష్ఠుడైన రఘువుకు కొడుకైన అజుడు, చంద్రుడును, ఆలోచించగా అల్లయ వేమారెడ్డి అనే రాజుకు సమానులు.

మూడవ చరణద్వయాల అర్థం, అన్వయం:

ర + అజ + నందన = బంగారం వంటి కాంతిగల బ్రహ్మకు పుట్టిన సనత్కుమారుడు
ర + అజ = శ్రేష్ఠుడైన బ్రహ్మకు పుట్టిన వశిష్ఠుడు
రాజ = క్షత్రియుడైన
ఆత్మ + జ = బృహస్పతియందు పుట్టిన కచుడును

తలప అల్లయ వేమ ధరణిపతికి సాటి = ఆలోచించగా అల్లయ వేమా రెడ్డి అనే రాజుకు సమానులు.

భావ = ఆత్మ జ్ఞానమునందు, భవ = పుట్టుకయందు, భోగ = అనుభవమునందు, సత్కళా = అభివృద్ధియొక్క
భావములను = పద్ధతులందును

ఆత్మ జ్ఞానమునందు, పుట్టుకయందు, అనుభవమునందు, అభివృద్ధియొక్క పద్ధతులందును బంగారువంటి కాంతి కలిగిన బ్రహ్మకు కుమారుడైన సనత్కుమారుడు, శ్రేష్ఠుడైన బ్రహ్మకుపుట్టిన వశిష్ఠుడు, క్షత్రియుడై బృహస్పతి వలన పుట్టిన కచుడునూ, ఆలోచించగా అల్లయ వేమారెడ్డి అనే రాజుకు సమానులు.

నాలగవ చరణద్వయాల అర్థం, అన్వయం :

ర + అజ + నందన = శ్రేష్ఠుడైన మన్మధుని కుమారుడైన అనిరుద్ధుడును
ర + అజ = సర్వ వ్యాపకుడైన విష్ణువు
రాజ = యక్షుడును (నలకూబరుడు ?)
ఆత్మజ = మన్మధుడును

తలప అల్లయ వేమ ధరణిపతికి సాటి = ఆలోచించగా అల్లయ వేమా రెడ్డి అనే రాజుకు సమానులు ( అన్ని పాదాలకీ ఒకే అర్థం)

భావ = ఆకారమునందును, భవ = సంసారమందును, భోగ = సుఖానుభవమునందును, సత్కళా = సౌందర్యము యొక్క
భావములను = రీతియందును

ఆకారమునందు, సంసారమందు, సుఖానుభవమునందు, సౌందర్యముయొక్క రీతియందును, శ్రేస్ఠుడైన మన్మధునికుమారుడైన అనిరుద్ధునికి, సర్వ వ్యాపకుడైన విష్ణువు, యక్షుడైన నలకూబరుడు, మన్మధుడును, ఆలోచించగా అల్లయ వేమారెడ్డి అనే రాజుకు సమానులు.

గీత పద్య పాదానికి, సీసపద్యపాదానికీ మధ్య ఉన్న క్రమాలంకారం గమనించదగ్గది.

ఉదాహరణకి, మొదటి చరణాలద్వయం తీసుకోండి. బుద్ధియందు చంద్రుని కుమారుడైన బుధుడు, ఐశ్వర్యమునందు సమర్థుడైన ఈశ్వరుడు, వైభవములో దేవేంద్రుడు, మంచివిద్యలయొక్క అతిశయములందు బ్రహ్మదేవుడును, ఆలోచింపగా అల్లయ వేమారెడ్డి అనే రాజుకు సమానులు. మిగిలిన వాక్యాలూ ఇల్లాగే క్రమాన్వితం చేసుకోవాలి.

ఇక పోతే, మేకతోక పద్యం అర్థం ఏమిటి?

ఒక మేక, దానివెనక తోక, తోక ముందు మరోమేక, మరోమేక వెనక తోక, ఈ తోకముందు మరోమేక … వగైరా, వగైరా.
12. శరసంధాన బలక్షమాది ఐశ్వర్యంబులన్ కల్గి (శ్లోకం) –
మ. శరసంధాన బలక్షమాది వివిధై శ్వర్యంబులుంగల్గి దు
ర్భర షండత్వ బిలప్రవేశ కలన్ బ్రహ్మఘ్నతల్ మానినన్
నరసింహ క్షితి మండలేశ్వరుల నెన్నన్ వచ్చు నీ సాటిగా
నరసింహ క్షితి మండలేశ్వరుని కృష్ణా! రాజకంఠీరవా!

(నరసింహదేవరాయల కుమారుడైన కృష్ణదేవరాయా! రాజశ్రేష్ఠా! నరుడు(అర్జునుడు) శరసంధానములోను, సింహము బలములోను, భూమి ఓర్పులోను, ఈశ్వరుడు ఐశ్వర్యములోను గొప్పవారే అయిననూ నీతో పోల్చ దగరు. ఎందుకనిన పై నల్గురిలో నాలుగు దోషములు నపుంసకత్వము – గుహలో దాగియుండుట – భూకంపము – బ్రహ్మ హత్య అనునవి వరుసగా కలవు అని భావము.)
కలనన్ తావక ఖడ్గఖండిత రిపుక్ష్ముభర్త మార్తాండ (పద్యం) – ఘంటసాల
కలనన్ తావక ఖడ్గ ఖండిత రిపుక్ష్మాభర్త మార్తాండ మం
డల భేదంబొనరించి ఏగునెడ, తన్మధ్యంబునన్, హార కుం
డల కేయూర కిరీట భూషితుని శ్రీనారాయణుం గాంచి, లో
గలగం బారుచునేగె, నీవయను శంకన్ కృష్ణరాయాధిపా!

13. పరదేశ కవి గర్వమణచేందుకు ఉచ్చారణతో తికమక పెట్టే పద్యం ‘‘తృవ్వట బాబా తలపై పువ్వట జాబిల్లి వల్వ బూదెట చేదే’’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. – ఘంటసాల
మరుధృతాతటస్త శతృమండలీగళాంతర (శ్లోకం) –
మరుధృతాతటస్థ శత్రుమండలీగళాంతర
శ్చరన్నరాత్రు కాపగాభి సారికా ధృతాంబుధీ
మరుత్పతిత్ మరుజ్ఝతి క్రమత్పృట కుభుత్వరత్
పృరర్ధరిత్ ప్రవృధయుద్ధ పుంఖితార కార్భటీ

తృవ్వట బాబా తలపై పువ్వట జాబిల్లి వల్వ బూదెట చేదే’
తృవ్వట! బాబా; తలపై
పువ్వట! జాబిల్లి; వల్వబూదట! చేదే
బువ్వట! చూడగ నుళుళు
క్కవ్వట; అరయఁగ నట్టి హరునకు జేజే!

(తృప్ = సాక్షరపదముల గ్రహింపజాలని పశువు – వృషభం, బాబా = వాహనం, జాబిల్లి, తలపై పువ్వు, వలువ = కట్టుపుట్టము, బూచి = భయంకరమైన (ఏనుగు)తోలు, చేదే = హాలాహలమే, బువ్వ = ఆహారం, ఉళుళుక్ (హుళక్కి)= లేనిది – మాయ, అవ్వ = కాగా, అట్టి హరును = అలాంటి పరమశివునకు, జేజేలు)

తెలియనివన్ని తప్పులని ధిక్కనాన సభాంతరంబునన్ (పద్యం) – ఘంటసాల
తెలియనివన్ని తప్పులని దిట్టతనాన సభాంతరంబునన్
పలుకగ రాదురోరి పలుమారు పిశాచపు పాడెగట్ట నీ
పలికిన నోట దుమ్ముబడ భావ్యమెరుంగవు పెద్దలైన వా
రల నిరసింతురా ప్రగడ రాణ్ణరసా! విరసా! తుసా! భుసా!

14. ఉద్భటారాధ్య చరిత్ర తెనాలి రామలింగడు రచించిన తెలుగు కావ్యము.దీనిలో కథానాయకుడు ఉద్భటుడు. ఇందులో మదాలస చరిత్ర, ముదిగొండ వంశ మూల పురుషుని కథ ఉన్నవి. కవి ఈ కావ్యంలో ఎన్నో వర్ణనలతో తన కావ్యాన్ని అందంగా తీర్చిదిద్దాడు. ఈ క్రిందీ పద్యంలో పార్వతీదేవి శివుడితో విహరించే వేళ .

తరుణ శశాంక శేఖర మరాళమునకు
సారగంభీర కాసార మగుచు

కైలాస గిరినాథ కలకంఠ భర్తకు
గొమరారు లేమావి కొమ్మయగుచు

సురలోక వాహినీధర షట్పదమునకు
బ్రాతరుద్బుద్ధ కంజాత మగుచు

రాజరాజ ప్రియ రాజకీరమునకు
మానిత పంజర స్థానమగుచు

నురగవల్లభ హార మయూరమునకు
జెన్ను మీరిన భూధర శిఖరమగుచు

లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి
అద్రి నందన బోల్చె విహార వేళ

తరుణేందు శేఖరుడంటే నెలవంకను శిఖలో ధరించిన శివుడు మరాళమైతే , ఆ హంసకు శ్రేష్టమైన గంభీరమైన నీటి కొలను ఔతోందట అమ్మ వారు.

కలకంఠ అంటే మగ కోకిల. కలకంఠి అంటే ఆడు కోకిల. కైలాసధిపతి ఐన (మగ) కోకిలలో శ్రేష్టునకు పూచే లేత మావి కొమ్మ ఔతోందట అమ్మ వారు.

సుర లోకంలో ప్రవహించేది సుర గంగ. దానిని ధరించిన వాడు శివుడు. షట్పదం అంటే ఆరు పదములు కలది, భ్రమరం. అట్టి భ్రమరానికి పొద్దున్నే విచ్చుకున్న తామర పూవు ఔతోంది అమ్మవారు.

రాజ రాజ ప్రియ రాజ కీరము. శ్రేష్టులకు ఇష్టమైన ష్రేష్టమైన మగ చిలుక (కీరి అంటే ఆడు చిలుక). అట్టి చిలుకకి ఆమోదమైన పంజరమౌతోందట అమ్మ వారు.

ఉరగము అంటే పొట్టతో కదిలేది పాము. పాములు మెడలో వేసుకున్న వాడు శివుడు. శివుడు అనే మయూరానికి (నెమలికి) తన అందాన్ని తన అందాన్ని (చెన్ను) వదిలేసిన (వీడిన) కొండ శిఖరము (భూదర శిఖరము) ఔతోందట అమ్మ వారు. అందాన్ని వదిలేయడమేమిటి? శిఖరానికి అందం సమ తలం కాకపోవడమే. అది వదిలేసిన అంటే అమ్మ వారు పర్వతాలలోని సమ తల ప్రదేశము (సానువు) ఔతోందట.

లలితమైన సౌభాగ్యవంతమైన లక్షణాలను కనబరిచే గిరి తనయ విహార వేళలో ఇన్ని రకాలుగా కనబడింది కవికి.

గమ్మత్తు ఏమిటంటే అమ్మ వారు కొలను ఔతోంది, కొమ్మ ఔతోంది, కంజాతమౌతోంది అన్నాడు కవి, కొలను లా ఉంది అనడం లేదు.

తెనాలి రామ కృష్ణ సినిమాలో ఘంటసాల ఈ సీస పద్యం పాడేరు.

15. శ్రీ కృష్ణ దేవరాయల కీరిని వర్ణిస్తూ తెనాలి రామ కృష్ణ కవి చెప్పిన పద్యం , గానం ఘంటసాల.

నరసింహ కృష్ణ రాయల
కరమరుదగు కీర్తి వెలయు కరిభిత్గిరిభి
త్కరి కరిభిద్గిరి గిరిభి
త్కరిభిత్గిరిభిత్తురంగ కమనీయంబై!

ఈ పద్యంలో తెనాలి రామకృష్ణుడు శ్రీ కృష్ణదేవరాయల కీర్తిని స్వచ్ఛతకు ప్రతీకయైన శ్వేత వర్ణం (తెలుపు రంగు) తో పరోక్షంగా వ్యక్తి, వస్తు, వాహన విశేషాల ఉపమానాలుపయోగించి ఆరు అంశాలతో పోలుస్తూ వర్ణిస్తాడు. అదెలాగంటే, నరసింహ కృష్ణరాయల – నరసింహ రాయల కుమారుడైన కృష్ణ దేవరాయల (తండ్రి పేరును తనయుని పేరుకు జతచేసి చెప్పడం దక్షిణాదిన ఒక ఆనవాయితీ కదా!) అపూర్వమైన కీర్తి ఎలా ఒప్పిందంటే – “కరిభిద్గిరిభిత్కరి కరిభిద్గిరి గిరిభిత్కరి భిద్గిరిభిత్తురంగ కమనీయంబౌ” అని. ఇందులోని తెలుపు రంగును గలిగిన ఆరు అంశాలు పదచ్ఛేదనం చేస్తే – కరిభిత్ (1) + గిరిభిత్-కరి (2) + కరిభిత్-గిరి (3) + గిరిభిత్ (4) + కరిభిత్ గిరిభిత్ తురంగ అంటే కరిభిత్ తురంగ (5) మరియు గిరిభిత్ తురంగ (6).

వీటి అర్ధం – 1. కరిభిత్ = శివుడు (కరి = ఏనుగు; భిత్ = తునక లేక ముక్క) గజాసురుడు అనే కరి రూపుగల రాక్షసుడ్ని ముక్కలు చేసినవాడు అయిన శివుడు తెల్లగా వుంటాడు;
2. గిరిభిత్ కరి – గిరుల రెక్కలు త్రుంచిన ఇంద్రుని యొక్క ఏనుగు – ఐరావతం తెల్లనిది;
3. కరిభిత్ గిరి – కరిభిత్ అంటే శివుడు, కరిభిత్ గిరి అంటే శివుని కొండ లేక ధవళగిరి తెల్లనిది;
4. గిరిభిత్ – తెల్లనైన తళుకుమనే వజ్రాయుధం;
5. కరిభిత్ తురంగము అంటే శివుని వాహనము అయిన నంది తెల్లనిది (తురంగము అంటే గుఱ్ఱమైనప్పటికీ వాహనము అన్న అర్ధంలో కూడ తీసుకోవచ్చును. అందువలన శివునికి వాహనము అని అనుకోవచ్చును);
6. గిరిభిత్ తురంగము అంటే గిరుల రెక్కలను ఖండించిన ఇంద్రుని వాహనమైన ఉచ్ఛైశ్రవము కూడ తెల్లనిది; .

ఆవిధంగా – శివుడు (కరిభిత్), ఐరావతం (గిరిభిత్ కరి), వెండి కొండ (కరిభిత్ గిరి), వజ్రాయుధం (గిరిభిత్), నందీశ్వరుడు (కరిభిత్తురంగము) మరియు ఉచ్ఛైశ్రవము (గిరిభిత్తురంగము) అన్నీ తెల్లనివే. తెలుపు రంగు శాంతికి, స్వచ్ఛతకు, చైతన్యానికి ప్రతీక. ఆవిధంగా శ్రీ కృష్ణదేవరాయల అపూర్వమైన కీర్తి స్వచ్ఛతకు చిహ్నమై తెల్లగా వున్నదని తెనాలి రామకృష్ణ కవి భావము.

మా కొలది జానపదులకు నీ కవనపు ఠీవి అబ్బునే (పద్యం) – ఘంటసాల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.