కాలక్షేపంకబుర్లు-అంతర్మధనం

0
348

కాలక్షేపంకబుర్లు-అంతర్మధనం!
.
వెటకి వచ్చిన దుష్యంతుడు కణ్వాశ్రమంలో ప్రవేశించి, శకుంతలను చూసి మోహించి, ఆమె జన్మ వృత్తాంతం తెలుసుకుని, గాంధర్వ వివాహం చేసుకుని సంగమించి, ఆమెను తీసుకు వెళ్ళడానికి మంత్రి తదితరులను పంపుతానని మాటిచ్చి వెడలిపోయాడు. ఆ తరవాత….
తండ్రితో చెప్పకుండా పెళ్ళి చేసుకున్నాను, సంగమించాను కూడా, ఇది తెలిసి తండ్రి ఏమని కోపించునో అని భయపడుతూ ఉండగా కణ్వుడు అడవి నుంచి కందమూలాలు, ఫలాలు తీసుకుని వచ్చి, లలిత శృంగార భావనతో సిగ్గుపడుతున్న శకుంతలను చూసి, దివ్య దృష్టితో జరిగినది తెలుసుకుని రాచవారికి గాంధర్వ వివాహం భగవన్నిర్ణయంగా సంతసించి, శకుంతలతో
ఇలా అన్నాడు. “తల్లీ, నీ పుట్టుకకు, సౌందర్యానికి తగిన వరుణ్ణే చూసుకున్నావు. అందువల్ల గర్భవతివి కూడా అయ్యావు, నీ కడుపున, ఈ ప్రపంచాన్ని ఏలే చక్రవర్తి పుడతాడు సుమా” అన్నాడు.
ఇంకా “నీ ధర్మ వ్రతానికి మెచ్చుకున్నాను, నీకు కావలసిన వరం కోరుకో”మన్నాడు. దానికి శకుంతల,
“తండ్రీ! ఎప్పుడు నా మనస్సు ధర్మాన్ని తప్పకుండా ఉండులాగా, నాకు కలిగే పుత్రుడు దీర్ఘాయు,ఐశ్వర్య, బలవంతుడు, వంశకర్త అయ్యేలా దీవించమని” కోరింది. అప్పుడు కణ్వుడు కోరిన వరమిచ్చి, ఆమెకు గర్భ కాలోచితమైన సంస్కారాలు చేయించగా, మూడు సంవత్సరము పూర్తి అయిన తరవాత శకుంతలకు భరతుడు జన్మించాడు.
పుట్టిన బిడ్డకి జాత కర్మలు చేయించిగా, చక్రవర్తి లక్షణ సమన్వితుడయిన భరతుడు ఆ అడవిలోని ఎలుగులు, సింహాలు, పులులు, ఏనుగులను బంధించి తెచ్చి కణ్వాశ్రమ సమీప చెట్లకి కట్టేస్తూ ఉండేవాడు, వాటి పై స్వారీ చేసేవాడు. ఇది చూసిన ఆ అడవిలో నివసిస్తున్న మునులంతా అతనికి
సర్వదమనుడని బిరుద నామం (నిక్ నేమ్) ఇచ్చారు. ఇలా
ఆట పాటలలో భరతుడు పెరుతుండగా,
ఒక రోజు కణ్వమహాముని శకుంతలతో
కణ్వ మహాముని “ఎంతగొప్ప ఇంట పుట్టినా, పెళ్ళి అయిన తరవాత ఆడపిల్ల పుట్టినింట ఎక్కువ కాలం ఉండటం తగదు, భర్త దగ్గర ఉండటం ధర్మం, సతికి పతియే ఆలంబం సుమా! అందుచేత నీ కొడుకును తీసుకుని నీ భర్త ఇంటికి వెళ్ళ”మని కొంతమంది శిష్యులను తోడిచ్చి పంపేడు. ఇక్కడికి ఆపుదాం, లేకపోతే టపా చాలా పెద్దదయిపోతుంది.
విహంగ వీక్షణ చేద్దాం.
తండ్రికి చెప్పకుండా పెళ్ళి చేసుకుని, సంగమించాను, తొందరపడ్డానేమో, తండ్రి ఏమంటాడో అని మధన పడింది, భయపడింది. చాలా సహజంగా అనుకున్నపని చేయడం పూర్తి అయిపోయిన తరవాత ఇటువంటి అలోచన రావడం., అందునా జీవన సమస్యకి సంబంధించిన విషయంలో పెద్దవారి అనుమతి లేక నిర్ణయం తీసుకున్నపుడు సహజమైన మధనమే శకుంతలా పడింది. తిరిగివచ్చిన కణ్వుడు విషయం దివ్యదృష్టిని తెలుసుకున్నాడు, కాని శకుంతల జరిగినది చెప్పలేదు. జరిగిన దానికి విచారించి లాభం లేదు, అదీకాక ఆమె జన్మకి తగిన నిర్ణయం తీసుకుందని, ఆమె గర్భవతి అని కూడా కణ్వుడు గ్రహించి, ఆమెను ఆశీర్వదించాడు.
ఇప్పుడూ ఆడపిల్లలు ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని అన్నీ పూర్తి అయిపోయిన తరవాత కూడా చెప్పక తల్లి తండ్రులను ఇరుకున పెడుతున్నారు. ఆ తర్వాత ఏ మూడో నెలలోనో, నాలుగో నెలలోనో, గర్భవతిగా, తల్లి తెలుసుకునేటప్పటికి ఆలస్యమైపోతూ ఉంది. కొంతమంది తల్లులకు కూడా చెప్పక దాచి ఉంచి డాక్టర్ ద్వారా తెలుసుకున్న తల్లి తండ్రులు నిర్ఘాంతపోతున్నారు. విషయం ఊరివారందరికి తెలుస్తూ ఉంది
కాని ఇంట్లో వాళ్ళకి ఆలస్యంగా తెలియడంతో తల్లి తండ్రులు తలలు పట్టుకుంటున్నారు.
కొన్ని చోట్ల తల్లి తండ్రులు ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు. దానికితోడు చాలా రకాల అనుచిత చర్యలకూ పాలు పడుతున్నారు.కొంతమంది అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పరువు పోతుందని హత్యలు చేసిన సంఘటనలున్నాయి.
ఇక్కడ మన కధానాయకిని తండ్రి మెచ్చుకున్నాడు, వరమిచ్చాడు. శకుంతల కోరిన కోరిక చూడండి, తన బుద్ధి ధర్మం తప్పకుండులాగ వరమడిగింది, పొరపాటు చేశాను, ఇక ముందు ఇటువంటి పరిస్థితి జీవితం లో రాకూడదనే పశ్చాత్తాపం కనపడలా,
ఆమె కోరికలో? తల్లిగా పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుషు, ఐశ్వర్య,బలవంతుడు, వంశకర్త కావాలని కోరింది. మరొక సంగతి మూడు సంవత్సరాలు గర్భాన్ని ధరించిందన్నారు. మూడు తొమ్మిదులు మోసికన్నానన్న మాట వినేవాళ్ళం. ఇప్పుడు ఇది మరుగునపడిందా? అసాధ్యమా? వైద్యపరంగా ఇది సాధ్యమా తెలియదు. తెలిసినవారు చెబితే సంతసం. ఈమె కాబోయే తల్లి,
శకుంతల తల్లి మేనకకీ, శకుంతలకీ ఈ విషయం లో ఎంత తేడా ఉంది.
కాలం గడచినా దుష్యంతుడు తీసుకు వెళ్ళే ప్రయత్నం చేయనపుడు
మాత్రమే కణ్వుడు శకుంతలను బిడ్డతో సహా మగని దగ్గరకు వెళ్ళమని చెబుతాడు.
ఇది కూడా నేటి కాలం వారికి వర్తిస్తుంది. ఆలోచించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.