కల్పవల్లి… కన్యకాపరమేశ్వరి

0
217

?కల్పవల్లి… కన్యకాపరమేశ్వరి?
ప్రాణం కంటే మానం గొప్పదని భావించి ఆత్మార్పణ చేసుకున్న పవిత్రమూర్తి కన్యకాపరమేశ్వరి అమ్మవారు. ఆమె జన్మించిన ఊరుగానే కాదు, ఆత్మార్పణ చేసుకున్న పవిత్ర స్థలంగానూ పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు విశిష్ట స్థానం ఉంది. ఈ నెల 19న అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని వైభవోపేతంగా జరుపుతారిక్కడ.
వశిష్ఠ గోదావరీ తీరంలో చుట్టూ పచ్చటి ప్రకృతి సోయగాలతో అలరారుతున్న పెనుగొండ ఆధ్యాత్మికంగానూ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కొలువైన మహిషాసురమర్దినీ సమేత నగరేశ్వరస్వామి ఆలయం విశిష్టమైంది. ఈ క్షేత్రంలోనే వెలసిన వాసవీ కన్యకాపరమేశ్వరీ అమ్మవారు ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవతగా, భక్తజనకోటి కొంగుబంగారంగా విశేష పూజలందుకుంటోంది. అమ్మవారి జన్మస్థలం, ఆత్మార్పణ తర్వాత కులదైవంగా వెలసిన ప్రాంతం ఇదే కావడంతో పెనుగొండ ఆర్యవైశ్యులకు మరింత ప్రత్యేకం.
? స్థల పురాణం ?
సుమారు నాలుగు వేల సంవత్సరాల కిందట నగరేశ్వరస్వామి, మహిషాసురమర్దిని అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిశారు. కాలక్రమంలో ఈ క్షేత్రానికి దగ్గర్లో నివాసముంటున్న కుసుమశ్రేష్ఠి, కుసుమాంబ దంపతులకు వాసవీ మాత జన్మించింది. ఆమె బాల్యం నుంచే శివభక్తురాలు. రాజమహేంద్రవరాన్ని పాలించే విష్ణువర్థన మహారాజు పెనుగొండ క్షేత్రాన్ని దర్శించానికి వచ్చినప్పుడు కుసుమశ్రేష్ఠి ఇంటిలో ఆతిథ్యం తీసుకున్నాడు. ఈ సందర్భంలో వాసవి అందాన్ని చూసి ముగ్ధుడై, ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. రాజు ఆజ్ఞను ధిక్కరించలేని కుసుమశ్రేష్ఠి ఏం చెయ్యాలో పాలుపోక తమ కులపెద్దలకు జరిగింది విన్నవిస్తాడు. వారిలో కొంతమంది ఈ కళ్యాణానికి అంగీకరించగా, మరికొందరు క్షత్రియులతో వియ్యం వద్దంటూ నిరాకరించారు. అనంతరం వాసవిని తన నిర్ణయం అడగగా, తాను పార్వతీదేవి అంశతో జన్మించాననీ ఆ పరమశివుడిని తప్ప అన్యులను వివాహం చేసుకోననీ చెబుతుంది. విషయం తెలుసుకున్న రాజు ఆమెను బంధించడానికి పయనమవుతాడు. దీంతో వాసవి ఆత్మార్పణకు సిద్ధమవుతుంది. ఆమెతోపాటు వాసవికి మద్దతుగా నిలిచిన వారుకూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు.  బ్రహ్మకుండం అనే ప్రాంతంలో మాఘ శుద్ధ విదియనాడు 102 అగ్నిగుండాలను ఏర్పాటుచేసుకుని వాసవితో సహా అందరూ శివుడిలో ఐక్యమవుతారు. అనంతరం నగరేశ్వరస్వామి ఆలయంలో వాసవీ అమ్మవారు స్వయంభూగా వెలిసినట్లు ఇక్కడి భక్తుల విశ్వాసం.
ఏడంతస్తుల గాలిగోపురం

ఈ ఆలయంలో వాసవీ అమ్మవారు ఆత్మార్పణ చేసిన దృశ్యాలను తెలుపుతూ నిర్మించిన గాలిగోపుర మండపాన్ని సందర్శించవచ్చు. ఏడంతస్తులుగా నిర్మించిన ఈ గాలిగోపురానికి ప్రతి అంతస్తులో అమ్మవారి స్థలపురాణాన్ని తెలిపే శిల్పాలు కనువిందు చేస్తాయి. దీంతోపాటు వెంకటేశ్వరస్వామి, నవగ్రహాలు, గణపతి, కాలభైరవులతో నాలుగు ఉపాలయాలను ఏర్పాటు చేశారు. క్షేత్రపాలకుడిగా జనార్దనస్వామి దర్శనమిస్తాడు. కంచికామకోటి పీఠాధిపతితో శివపంచాయత క్షేత్రంగా పునఃప్రతిష్ఠ చేయించిన ఈ ఆలయంలో 2012 నుంచీ నిత్యాన్నదాన సేవ కొనసాగుతోంది.
మూలవిరాట్‌కు పూజలు…

అమ్మవారు ఆత్మార్పణ చేసిన మాఘ శుద్ధ విదియ రోజున(ఈ ఏడాది జనవరి 19న) ఆ తల్లికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ రోజు వేకువజాము నుంచే కన్యకాపరమేశ్వరి మూలవిరాట్‌కు పంచామృత స్నానాలూ, విశేష అభిషేకాలూ ప్రారంభమవుతాయి. శోభాయమానంగా అలంకరించిన ఆ చల్లనితల్లి విగ్రహాన్ని మంగళవాయిద్యాల నడుమ ఊరేగిస్తారు. అనంతరం 102 హోమగుండాలను ఏర్పాటు చేసి, పూర్ణహోమాన్ని నిర్వహిస్తారు. ఏడాదిలో వాసవీమాత జన్మదినం, ఆత్మార్పణ చేసుకున్న రెండు రోజులు మాత్రమే మూలవిరాట్‌కు అభిషేకాలు చేస్తారు. దీంతోపాటు వైశాఖమాసంలో శుద్ధ షష్ఠి నుంచి దశమి వరకూ అమ్మవారి జయంతిని నిర్వహిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఏడు రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా చేస్తారు.
?ఎలా చేరాలంటే ?
వశిష్ఠ గోదావరికి 15కి.మీ. దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి చేరాలంటే రైలూ, బస్సు సౌకర్యాలు ఉన్నాయి. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిలో సిద్ధాంతం నుంచి 15 కిలోమీటర్లూ, పాలకొల్లు నుంచి 12 కిలోమీటర్ల్లూ, తణుకు నుంచి 13 కిలోమీటర్లూ ప్రయాణించి వాసవీ అమ్మవారిని దర్శించుకోవచ్చు.

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.