కర్ణాటక చేజారితే.. అంత్యకాలం సమీపించినట్టే!

0
137

 

దేశంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి? రాహుల్ పట్టాభిషక్తుడు అయిన సమయానికి ఆ పార్టీ బలం-బలగం ఎలా ఉన్నాయి? ఓసారి సమీక్షించినప్పుడు చాలా ఆశ్చర్యకరమైన సంగతులు అగుపిస్తున్నాయి. గుజరాత్, హిమాచల్ ఎన్నికల ఫలితాల తర్వాత.. దేశవ్యాప్తంగా కలియజూసినప్పుడు ఏ పార్టీ హవా ఎలా ఉన్నదనే చర్చలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వీటిని పరిశీలిస్తే.. రాబోయే ఏడాది కాంగ్రెస్ పార్టీకి అత్యంత క్లిష్టకాలంగాను, కీలకమైన కాలంగాను కనిపిస్తోంది. ఆ ఏడాదిలో మూడురాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ మూడూ కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలే. వాటిలో ఏ ఒక్కరాష్ట్రాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడినా.. సరే.. కాంగ్రెస్ అంత్యకాలానికి దగ్గర అవుతున్నట్లే.

‘కాంగ్రెస్ ముక్త భారత్’ అంటూ 2014 ఎన్నికల ప్రచార సమయంలో నరేంద్రమోడీ చేసిన నినాదం – కార్యరూపంలోకి వస్తున్నట్లేనా అనేభయం ఆ పార్టీ కార్యకర్తల్లో కలుగుతోంది. వచ్చే ఏడాదిలో కర్ణాటక, మేఘాలయ, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మూడ చోట్ల ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. ఇవికాకుండా పంజాబ్ రాష్ట్రంలోను, పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోను కాంగ్రెస్ పాలన ఉంది. ఎన్నికలు జరగాల్సి ఉన్న మూడు రాష్ట్రాల్లో మేఘాలయ, మిజోరం చాలా చిన్నవి. కర్ణాటక వ్యవహారం కీలకంగా కనిపిస్తోంది. అక్కడ భారతీయ జనతాపార్టీకి కూడా చెప్పుకోదగ్గ బలం ఉంది. ఓసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర కూడా ఉంది. ఈసారి కూడా అధికారంలోకి వస్తాం అనే నమ్మకంతో ఆ పార్టీ ఆ రాష్ట్రం మీద చాలా కాలంగా చాలా ఫోకస్ పెడుతోంది.

కేంద్ర మంత్రులు, నాయకులు, ప్రధాని మోడీ కూడా.. కర్నాటకలో అనేక కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇటీవల కేంద్రం తరఫున జరిగిన ఒక అధికారిక కార్యక్రమానికి మోడీ హాజరైతే.. రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ప్రోటోకాల్ కూడా పట్టించుకోకుండా గైర్హాజరయ్యారు. ఆ రేంజిలో ఇరు పార్టీల మధ్య ఇప్పటినుంచే యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. కర్ణాటకలో అధికారం కోసం రెండుపార్టీలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. సిద్ధరామయ్య ప్రభుత్వం మీద ఆరోపణలు, కొంత వ్యతిరేకత ఏర్పడి ఉన్న నేపథ్యంలో పరిస్థితులు భాజపాకు అనుకూలంగా ఉండవచ్చుననే వాదనలు కూడా కొన్ని ఉన్నాయి.

ఇలాంటి నేపథ్యంలో కర్ణాటకలో గనుక వచ్చే ఏడాది కాంగ్రెస్ ఓడితే ఆ పార్టీకి రోజులు దగ్గరపడ్డట్లేనని భావించాలి. మేఘాలయ, మిజోరం చాలా చిన్న రాష్ట్రాలు. పైగా ఇటీవలి కాలంలో వ్యూహాలను మార్చి.. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా విజయాలు సాధిస్తున్న మోడీ దళం.. ఆ రెండు రాష్ట్రాల మీద కూడా తమ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కర్నాటక కోల్పోయి, ఆ రెండూ గెలిచినా కూడా కాంగ్రెస్ పెద్దగా సంతోషించే పరిస్థితి ఉండదు. మొత్తంగా మ్యాప్ ను చూస్తే.. దేశంలో కాంగ్రెస్ ఏలుబడి.. ఒక్క పంజాబ్ లో మాత్రమే ఉన్నట్లుగా కనిపిస్తుంది.

పాండిచ్చేరి లాంటి వాటిని మ్యాప్ లో వెతుక్కోవాల్సి వస్తుంది. ఇంత క్లిష్టసమయంలో పార్టీ సారథ్య బాధ్యతలు తీసుకున్న రాహుల్ ఈ మూడు రాష్ట్రాల మీద ఇప్పటినుంచే ప్రత్యేక శ్రద్ధ పెడితే తప్ప.. ఏకంగా పార్టీ మనుగడ సాధ్యంకాదని… జాతీయ స్థాయిలో భాజపా వ్యతిరేకతతో ఓ కూటమి అంటూ ఏర్పడినా దానికి సారథ్యం వహించే స్థితిలో కాకుండా భాగస్వామిగా ఉండే చిన్న పార్టీలాగా కాంగ్రెస్ బతుకు మారిపోతుందని పలువురు అంచనా వేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.