ఆగ్రహం అనర్థం

0
179

ఆగ్రహం అనర్థం …!

కోపం వస్తే శరీరంలో ఏం జరుగుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? కోపంతో రగిలిపోతున్నప్పుడు మన మెదడులో కార్యకారణాలను విశ్లేషించే ముందు భాగం పనిచేయటం ఆగిపోతుంది. అదే సమయంలో ప్రతీకార చర్యలను ప్రేరేపించే వెనకభాగం ఉత్తేజితమవుతుంది. కోపంతో ఉన్నప్పుడు మన శరీరం రక్తంలోకి కొలెస్ట్రాల్‌తో పాటు గుండెలో, కెరటిడ్‌ ధమనుల్లో కొవ్వు పేరుకోవటాన్ని ప్రోత్సహించే క్యాటెకోలమైన్స్‌ అనే రసాయనాలనూ పెద్ద మొత్తంలో పంపుతుంది. అందుకే కోపంతో వూగిపోయేవారికి గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కోపం వచ్చినపుడు జీర్ణాశయానికి రక్తసరఫరా తగ్గుతుంది. ఈ రక్తం కండరాల వైపు మళ్లుతుంది. ఇది పేగుల సంకోచం, జీర్ణరసాల ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. ఒత్తిడి మూలంగా జీర్ణాశయంలో ఆమ్లం ఉత్పత్తి కూడా పెరుగుతుంది. కోపం వల్ల ఒత్తిడి హార్మోన్‌ కార్టిజోల్‌ స్థాయులూ పెరుగుతాయి. ఇది చర్మంలో నూనె ఉత్పత్తిని పెంచుతూ మొటిమలు, ఇతర సమస్యలకు దారితీస్తుంది. తరచుగా, అదేపనిగా కోపంతో ప్రవర్తిస్తే నాడీవ్యవస్థలోని కొంత భాగం చాలా ఎక్కువగా ఉత్తేజితమవుతుంది. తిరిగి మామూలు స్థితికి చేరుకోవటం కష్టమవుతుంది. ఫలితంగా కొంతకాలానికి రోగనిరోధకశక్తి కూడా ప్రభావితమవుతుంది.

• పరిష్కార మార్గాలేంటి?

* మనసును నిగ్రహంచుకుంటూ.. ఆలోచనల దాడిని ఆపే ప్రయత్నం చేయాలి. దీంతో కోపాన్ని ప్రేరేపించే ఘటనలు గుర్తుకురాకుండా చూసుకోవచ్చు. అహేతుక నమ్మకాలను తిరిగి విశ్లేషించుకోవటమూ సాధ్యమవుతుంది.

* గాఢంగా శ్వాస తీసుకునేలా చేసే ప్రాణాయామం వంటివి సాధన చేయాలి. ఇవి గుండె వేగాన్ని నెమ్మదింపజేస్తాయి. ఒత్తిడిని కలగజేసే విషయాలపై నుంచి ధ్యాస మళ్లటానికి తోడ్పడతాయి.

* వ్యాయామం చేయటం వల్ల కోపం తగ్గుతుంది. మెదడులో హాయి భావనను కలిగించే రసాయనాలు ప్రేరేపితమవుతాయి.

* కోపం లక్షణాలు విడవకుండా వేధిస్తుంటే కొన్ని రకాల మందులతోనూ ఉపయోగం ఉండొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.