అందం

0
932

అందం:-
అనగనగా ఒక పూల తోట ఉంది. అక్కడ అన్ని రంగుల్లోనూ పూలు పూసే మొక్కలున్నాయి.
మల్లె, సంపంగి, బంతి, చామంతి, గులాబీ ఇలా బోలెడు మొక్కలున్నాయి. వాటి మధ్యలో ఎలా వచ్చిందో గాని ఉమ్మెత్త మొక్క ఒకటి అంకురించింది. పుట్టి పుట్టగానే దాని వాసనకు మిగిలిన మొక్కలు మొఖాలు చిట్లించికున్నాయి. ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఇది అంటూ ఈసడించుకున్నాయి.
క్రమంగా అన్ని పెరుగుతూ వచ్చాయి, పూల మొక్కలన్ని ఉమ్మెత్తను తెగ ఆడిపోసుకునేవి. “నువ్వెంటి? నీ రూపం ఏంటి? అసలు మా మధ్యలో నువ్వు సరిపోతావా? మాకు ఒక దిష్టిబొమ్మలా ఉన్నావ్, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మేము ప్రశాంతంగా ఉంటాం,.” అనేవి.

పాపం ఉమ్మెత్త ఏ ఒక్కరిని పల్లెత్తు మాట అనలేదు. నాకు దేవుడు ఇచ్చిన రూపం ఇదే మీరంతా అలా అంటున్నారని నేనేందుకు బాధపడాలి అంది.

“అవునులే లేని వాటి గురించి బాధపడే కన్నా , ఇలా దేవుడు మీద భారం వేసి తృప్తి పడితే చాలు ” అని కిసుక్కున నవ్వేవి మిగిలిన పూలమొక్కలు.

ఇదిలా ఉండగా పూతకాలం వచ్చింది. చేయి తిరిగిన చిత్రకారుడు గీసిన చిత్రంలాగా రంగులు నిండిపోయాయా తోటలో. తోటమాలులు పూసిన పూలను పూసినట్టు కోసేస్తున్నారు. ఒక్కో మొక్క గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించింది. తనకు కాసిన పూలు యువతుల శిరోజాలని అలంకరించాయని, దైవ సన్నిధిలో పూజకు నోచుకున్నాయని, పెళ్లిళ్లలో వేడుకలలో అలంకరణకు ఉపయోగపడ్డాయని ముచ్చటించుకున్నాయి.

ఆ తర్వాత రోజే ఇద్దరు వ్యక్తులు తోటలోకి ప్రవేశించారు . వెతుక్కుంటూ ఉమ్మెత్త మొక్క దగ్గరకు వచ్చారు. అబ్బా దొరికింది అంటూ సంతోషించాడు ఒక వ్యక్తి. అతని కాలికి గాయం ఉంది, చాలా రోజులనుండి ఉన్నట్టుంది, ఈగలు ముసురుతున్నాయి. ఇద్దరూ ఉమ్మెత్త ఆకులు తెంపి అక్కడే ఉన్న బండపై నూరి దాని రసం పిండి దానికి పసుపు కలిపి ఆ మిశ్రమాన్ని గాయంపై కట్టుకట్టారు. తర్వాత ఇంటి దారి పట్టారు, వారం రోజులు ఇదే పని చేసారిద్దరూ.

కొన్ని రోజుల తరువాత ఆ దెబ్బ తగ్గిపోయిన వ్యక్తి మరో వ్యక్తిని తీసుకుని తోటలోకి వచ్చాడు. ఉమ్మెత్త మొక్కను చూపి “నా బాధను తగ్గించిన మొక్క ఇదే , ఎప్పట్నుంచో మానని గాయం ఇది రాసుకోగానే వెంటనే తగ్గిపోయింది, ఇది గొప్ప ఔషధగుణాలున్న మొక్క, నీ గాయానికి ఇది పూసుకో తగ్గిపోతుంది అంటూ ఉమ్మెత్తని ఎంతగానో ప్రశంసించాడు. ఆ మాటలన్నీ విన్న తక్కిన మొక్కలన్నీ ఉమ్మెత్త విలువ తెలుసుకున్నాయ్.

ఉమ్మెత్త అందంగా నవ్వింది.😊😊😊🌸🌸

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.